Begin typing your search above and press return to search.

బట్టతల మీద జుట్టు.. సోషల్ మీడియాలో ప్రచారం.. పాతబస్తీలో వేలాదిగా క్యూ!

తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని ఖులీకుతుబ్ షాహీ స్టేడియంలో బట్టతల మీద జుట్టు మెలిపిస్తానంటూ.. అందుకు తగ్గ వైద్యం తన దగ్గర ఉందంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేశారు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 10:10 AM IST
బట్టతల మీద జుట్టు.. సోషల్ మీడియాలో ప్రచారం.. పాతబస్తీలో వేలాదిగా క్యూ!
X

‘‘మీకు బట్టతల ఉందా? ఒత్తైన జుట్టు కావాలా? చాలా సింపుల్. గుండు కొట్టించుకొని మా దగ్గరకు రండి. రిజిస్ట్రేషన్ కింద రూ.700 కట్టి.. తలకు నూనె రాసినందుకు రూ.600 కట్టేస్తే చాలు. ఇలా రెండు వారాలకు ఒకసారి.. మొత్తం మూడు నెలలు మేం ఇచ్చే మూలికల తైలం రాస్తే చాలు.. జుట్టుతో మీ తల మిలమిలా మెరిసిపోతుంది’’ ఇలా ఎవరైనా చెబితే అనుమానం రాకుండా ఉంటుందా? బట్టతల ఉన్నోడికి ఒత్తైన జుట్టు కోసం కేవలం ఆరుసార్లు తైలం రాస్తే భారీగా జుట్టు వచ్చేసే మేజిక్ ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా జనాలు ఎగబడిపోరా? కానీ.. ఈ లాజిక్ ఏమీ రాదు.

జనాల ఆశను సొమ్ము చేసుకోవటానికి ఢిల్లీకి చెందిన సల్మాన్ ఢిల్లీవాలా చెప్పే తప్పుడు మాటలకు వేలాది మంది మోసపోతుంటారు. పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చినా వారు తీసుకునే అరకొర చర్యల కారణంగా వారి దందా సా..గుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని ఖులీకుతుబ్ షాహీ స్టేడియంలో బట్టతల మీద జుట్టు మెలిపిస్తానంటూ.. అందుకు తగ్గ వైద్యం తన దగ్గర ఉందంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేశారు.

దీంతో స్టేడియం వద్దకు వేలాదిగా జనాలు పోటెత్తారు. శని..ఆదివారాల్లో ఏకంగా ఐదారు వేల మందికి పైగా ఈ వైద్యం కోసం క్యూ కట్టారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనకు తగ్గట్లే.. పురుషులకు.. మహిళలకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.కొందరు అయితే గుండు కొట్టించుకొని మరీ వచ్చి తైలం రాసుకునేందుకు ఆసక్తి చూపారు. ఔషధ మొక్కలు.. అరుదైన చెట్ల నుంచి తీసిన తైలంతో మూడు నెలల్లో ఒత్తైన జుట్టు ఖాయమన్న ప్రచారానికి వేలాదిగా పోటెత్తిన వైనాన్ని పోలీసులు పట్టించుకోరా? అన్నది ప్రశ్నగా మారింది.

స్టేడియంను వేదికగా తీసుకొని మరీ యాపారం చేస్తున్న ఇలాంటి వారికి తగిన అనుమతులు ఉన్నాయా? శాస్త్రీయత ఉందా? లాంటి పోలీసులకు పట్టదా? అన్నది ప్రశ్న. గతంలోనూ ఇదే తరహాలో పాతబస్తీ.. ఉప్పల్ ప్రాంతంలో ఇదే సల్మాన్ టీం బట్టతల మీద జుట్టు ఖాయమని హడావుడి చేయటం.. అప్పట్లో గొడవ జరగటం తెలిసిందే. గతంలో వీరి మీద ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మళ్లీ ఇన్నాళ్లకు హడావుడి చేస్తున్నప్పటికీ పోలీసులకు పట్టకపోవటంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. వేలాది మంది స్టేడియం వద్ద రెండు రోజులు సందడి చేస్తున్నా..తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు పేర్కొనటం గమనార్హం. తమకు వారి మీదా ఎలాంటి ఫిర్యాదులు అందలేదని హుస్సేని ఆలం పోలీసులు చెబుతున్నారు. జరిగిన మోసం అర్థం కావటానికి బాధితులకు కాస్త సమయం పడుతుంది. నిఘా వ్యవస్థ బలంగా ఉంటే.. మోసం జరిగే సమయంలోనే గుర్తిస్తే.. వారికి చెక్ చెప్పే వీలుంది.