పెళ్లి పేరుతో టోకరా! 25 మంది గాళ్స్ నుంచి కోట్లు దండుకున్న ఘనుడు!!
పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ నిందితుడు తనకు ఇంకా వివాహం కాలేదంటూ నకిలీ ఐడి కార్డులు.. రకరకాల దొంగ పేర్లతో చలామణీ అయ్యేవాడు.
By: Sivaji Kontham | 14 Jun 2026 6:00 AM ISTమహారాష్ట్రలోని మీరా భయందర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పెళ్లి పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్న ఒక కిలాడీ పెళ్లికొడుకును అరెస్ట్ చేశారు. వివాహం చేసుకుంటానని నమ్మించి దేశవ్యాప్తంగా దాదాపు 25 మందికి పైగా మహిళల నుండి కోట్లాది రూపాయలు కాజేసిన ఈ మోసగాడి ఉదంతం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో తలదాచుకున్న ఈ `కాన్‌మన్ గ్రూమ్` (మోసగాడు) స్థావరాన్ని మీరా భయందర్ క్రైమ్ డిటెక్షన్ బ్రాంచ్ యూనిట్ వన్ అధికారులు ఒక భారీ ఆపరేషన్ ద్వారా కనిపెట్టి.. అతడికి విజయవంతంగా భేడీలు వేశారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ నిందితుడు తనకు ఇంకా వివాహం కాలేదంటూ నకిలీ ఐడి కార్డులు.. రకరకాల దొంగ పేర్లతో చలామణీ అయ్యేవాడు. ముఖ్యంగా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు , దినపత్రికల ప్రకటనల ద్వారా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసేవాడు. సమాజంలో విడాకులు తీసుకున్నవారు... శారీరక వికలాంగులు.. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండి ఎమోషనల్‌గా ఎవరిదైనా అండ కోరుకునే మహిళలను గుర్తించి.. మొదట వారి నమ్మకాన్ని చూరగొని.. ఆపై పెళ్లి ప్రస్తావన తెచ్చి క్రమక్రమంగా పెద్ద మొత్తంలో డబ్బును గుంజేవాడు.
బాధితుల నుండి నమ్మకంగా వసూలు చేసిన కోట్లాది రూపాయల సొమ్ముతో ఈ కేటుగాడు విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితుల డబ్బుతోనే నిందితుడు కొనుగోలు చేసిన ఒక ఖరీదైన బిఎండబ్ల్యూ ఎక్స్-1 లగ్జరీ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రూరమైన మోసాలలో కేవలం ప్రధాన నిందితుడే కాకుండా అతడికి సహకరించిన అతడి కుమారుడిని కూడా పోలీసులు ఈ కేసులో సహ నిందితుడిగా చేర్చడం గమనార్హం.
ఈ అంతరాష్ట్ర పెళ్లిళ్ల దగాకోరు ప్రస్తుతం పోలీసుల జ్యుడీషియల్ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నాడు. బాధితుల జాబితా ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న క్రైమ్ బ్రాంచ్ అధికారులు, ఈ ముఠా వెనుక ఉన్న పూర్తి ఆర్థిక లావాదేవీలను వెలికితీసే పనిలో పడ్డారు. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో కనిపించే వ్యక్తుల నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించకుండా సామాన్యులు ఎవరూ తొందరపడి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు.
