నకిలీ వైద్యుడి ఆపరేషన్..? మాజీ స్పీకర్ మృతికి కారణమదేనా?
అసలు అతడు వైద్యుడే కాదట.. బ్రిటన్ రిటర్న్ అంటూ వచ్చి గుండె ఆపరేషన్లు చేశాడు. ఏడుగురు చనిపోయారు.
By: Tupaki Desk | 8 April 2025 6:00 PM ISTఅసలు అతడు వైద్యుడే కాదట.. బ్రిటన్ రిటర్న్ అంటూ వచ్చి గుండె ఆపరేషన్లు చేశాడు. ఏడుగురు చనిపోయారు. అచ్చం అలాగే చత్తీస్ ఘడ్ లోనూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మాజీ స్పీకర్ కు గుండె ఆపరేషన్ జరిగింది. అక్కడ కూడా ఎవరో వైద్యుడిని తీసుకొచ్చి చేయించారు. ఆ మాజీ స్పీకర్ చనిపోయాడు. ఇంకేముంది మధ్యప్రదేశ్ లో లాగానే చత్తీస్ ఘడ్ లోనూ నకిలీ వైద్యులే ఆపరేషన్లు చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లో ఒకే నెలలో ఏడుగురి మృతికి కారణమైన నకిలీ వైద్యుడి నిర్వాకం తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు కూడా పాకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్ రాజేంద్ర ప్రసాద్ శుక్లా మృతికి ఈ నకిలీ వైద్యుడే కారణమై ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శుక్లా బిలాస్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుంటున్న సమయంలో మరణించారు. ఆ సమయంలో నరేంద్ర జాన్ కెమ్ అనే వ్యక్తి వైద్యం అందించాడు. అతను యూకే నుంచి తిరిగి వచ్చిన వైద్యుడిగా చెప్పుకున్నాడు. అయితే, ఆ వైద్యం జరుగుతున్న తీరుపై అనుమానం వచ్చిందని, తర్వాత అతడు నకిలీ వైద్యుడని తెలిసిందని శుక్లా కుమారుడు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రి మాత్రం అతడు గొప్ప డాక్టరని చెప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
బిలాస్‌పూర్ సీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రమోద్ తివారీ ఈ విషయంపై స్పందిస్తూ, దర్యాప్తు బృందాన్ని పంపామని, సరైన రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదిలా ఉండగా, నరేంద్ర జాన్ కెమ్ అనే గుండె వైద్య నిపుణుడు దమోహ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ, అక్కడ ఆయన వద్ద శస్త్రచికిత్స చేయించుకున్న ఏడుగురు రోగులు వారం వ్యవధిలో మరణించడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా, అతడు అసలు వైద్యుడే కాదని తేలింది. ఎన్ జాన్ కెమ్ అనే ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడి పేరును వాడుకొని ఇతను కార్డియాలజిస్ట్‌గా చలామణి అవుతున్నట్లు గుర్తించారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనుంగో మాట్లాడుతూ నిందితుడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని వెల్లడించారు. అంతేకాకుండా అతడు చేసిన ఆపరేషన్లకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా పొందినట్లు తెలిపారు. నిందితుడు నకిలీ పత్రాలు సృష్టించి వైద్యుడిగా కొనసాగుతున్నాడని, హైదరాబాద్‌లో కూడా అతడిపై కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఏడు కంటే ఎక్కువ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ మాజీ స్పీకర్ మృతికి కూడా ఈ నకిలీ వైద్యుడే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
