Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ లో ఆర్మీ యూనిఫామ్ కొని, డాక్టర్ పై అత్యాచారం.. అసలేం జరిగింది?

సోషల్ మీడియా ద్వారా స్నేహం చేసి, ఆర్మీ అధికారినని నమ్మించి ఓ డెలివరీ బాయ్‌ వైద్యురాలిపై దారుణానికి పాల్పడ్డాడు.

By:  Tupaki Desk   |   28 Oct 2025 12:00 AM IST
ఆన్ లైన్ లో ఆర్మీ యూనిఫామ్ కొని, డాక్టర్ పై అత్యాచారం.. అసలేం జరిగింది?
X

సోషల్ మీడియా ద్వారా స్నేహం చేసి, ఆర్మీ అధికారినని నమ్మించి ఓ డెలివరీ బాయ్‌ వైద్యురాలిపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. అనంతరం సదరు వైద్యురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఫైనల్ గా ఛతర్‌ పూర్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అవును... ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ లో డెలివరీ బాయ్‌ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. తాను ఓ ఆర్మీ ఆఫీసర్ ని అని నమ్మించి, సోషల్ మీడియాలో ఓ మహిళా డాక్టర్ తో స్నేహం చేశాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది కూడా పక్కా ప్లాన్ ప్రకారం, ఆమెకు మత్తు మందు ఇచ్చి కావడం గమనార్హం. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... అమెజాన్ లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నిందితుడు ఆరవ్ మాలిక్.. తనను తాను ఆర్మీ అధికారిగా పేర్కొంటూ సోషల్ మీడియాలో పలు ఫోటోలు పెట్టడం మొదలుపెట్టాడు! ఈ క్రమంలో ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ వైద్యురాలితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో... ఏప్రిల్ 30, సెప్టెంబర్ 27 మధ్య కాశ్మీర్‌ లో పనిచేస్తున్న అధికారిగా చెప్పుకున్నాడు.

ఇందులో భాగంగా... ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆమెను నమ్మించేలా సైనిక యూనిఫాం ధరించిన ఫొటోలను ఆమెకు పంపుతుండేవాడు. ఈ క్రమంలో ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకునే వరకూ పరిచయం పెరిగింది. అనంతరం వారు వాట్సాప్‌ లో మెసేజ్‌ లు చేసుకోవడం ప్రారంభించారు.

ఈ క్రమంలో మాలిక్ ఈ నెలలో మసీద్ మాత్ ప్రాంతంలోని మహిళా డాక్టర్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమెకు మత్తుమందు కలిపిన ఆహారాన్ని ఇచ్చాడు. దీంతో.. అది తిన్న అనంతరం వైద్యురాలు మత్తులోకి జారుకుంది. ఇదే అదనుగా భావించిన మాలిక్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

కాసేపటికి స్పృహలోకి వచ్చిన వైద్యురాలు తనపై అత్యాచారం జరిగినట్లు గుర్తించి ఈ నెల 16న సఫ్దర్‌ జంగ్ ఎన్‌ క్లేవ్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీంతో... కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఛతర్ పూర్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌ లైన్‌ లో ఆర్మీ యూనిఫామ్‌ ను కొనుగోలు చేసినట్లు మాలిక్ వెల్లడించాడు!

ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్.ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు!