ఎంతకు తెగించార్రా..? సీపీ సజ్జనార్ పేరిటే ఫేస్ బుక్ ఫేక్ ఖాతా
వారితో వీరితో కాదు.. ఎవరైతే సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నారో ఏకంగా ఆ ఉన్నతాధికారితోనే పెట్టుకుందాం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు బరితెగించారు..!
By: Tupaki Desk | 15 Nov 2025 6:02 PM ISTవారితో వీరితో కాదు.. ఎవరైతే సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నారో ఏకంగా ఆ ఉన్నతాధికారితోనే పెట్టుకుందాం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు బరితెగించారు..! ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న ఆయనతోనే తేల్చుకుందాం అని అనుకున్నారు..! ఈ మేరకు ఆయన పేరితే ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా తెరిచారు. రిక్వెస్ట్ లు పంపడం మొదలుపెట్టారు. అసలే ఆయన సూపర్ కాప్..! ఇలాంటి అధికారి నుంచి సందేశాలు వస్తే ఎవరైనా స్పందించకుండా ఉంటారా..? ఇప్పుడు అదే జరిగింది. సైబర్ నేరగాల్ల మాయలో పడి మోసపోయినవారిలో ఆ సూపర్ కాప్ స్నేహితుడు కూడా ఉండడం గమనార్హం.
ఇంతకూ ఏం జరిగిందంటే..?
టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో అదే స్థాయిలో మోసాలూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో వారు, వీరు అని లేదు. చదువుకుని నగరాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు, ఊళ్లలో పనిచేసుకునేవారు అందరూ బాధితులుగా మిగులుతున్నారు. ఈ క్రమంలోనే నాయకుల నుంచి పోలీసుల వరకు అందరూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బహుమతులు తగిలాయని మీ ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ)గా ఉన్న సజ్జనార్ అయితే ఓ అడుగు ముందుకేసి మరీ చైతన్యం కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్ ఉన్నతాధికారుల్లో సైబర్ నేరాల పట్ల మరే అధికారి కూడా ఈ స్థాయిలో ప్రజలను మేల్కొపలేదు.
ఆయననే టార్గెట్ చేసి...
సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా సీపీ సజ్జనార్ నే టార్గెట్ చేశారు. ఆయన పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతాను ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్నానని, డబ్బలు పంపాలని మోసపూరిత మెసేజ్ లు పంపిస్తున్నారు. ఈ సంగతి చెబుతూ సజ్జనార్... ఇప్పటికే తన స్నేహితుడు ఒకరు రూ.20 వేలు పంపి మోసపోయారని తెలిపారు. ఇలాంటి మెసేజ్ లను ఎవరూ నమ్మొద్దని హితవు పలికారు. అనుమానాస్పదంగా కనిపించే లింక్ లు, వీడియో కాల్స్ వస్తే గనుక బ్లాక్ చేయాలని ప్రజలకు సూచించారు. సైట్లను బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ మోసాలపై సత్వరమే ఫిర్యాదు చేసేందుకు నిర్దేశించిన హైల్ప్ లైన్ నంబరు 1930కు ఫోన్ చేయాలని స్పష్టం చేశారు.
