Begin typing your search above and press return to search.

బర్త్ డే స్పెషల్... రతన్ టాటా గురించిన ఆసక్తికర విషయాలు!

ఈయన పుట్టుక స్వతంత్ర భారత దేశానికి ఒక వరం అని చెప్పేవారూ లేకపోలేదు! వ్యక్తిగత ఆస్తులు పెంచుకుని రికార్డులకు ఎక్కాలనే తాపత్రయం కాకుండా... దేశాభివృద్ధిలో తన పాత్ర ఉండాలని నిత్యం తపించే మనీషి ఈ రతన్ టాటా.

By:  Tupaki Desk   |   28 Dec 2023 11:20 AM GMT
బర్త్  డే స్పెషల్... రతన్  టాటా గురించిన ఆసక్తికర విషయాలు!
X

భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, టాటా గ్రూప్ మాజీ చైర్‌ పర్సన్ "రతన్ టాటా" గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన పుట్టుక స్వతంత్ర భారత దేశానికి ఒక వరం అని చెప్పేవారూ లేకపోలేదు! వ్యక్తిగత ఆస్తులు పెంచుకుని రికార్డులకు ఎక్కాలనే తాపత్రయం కాకుండా... దేశాభివృద్ధిలో తన పాత్ర ఉండాలని నిత్యం తపించే మనీషి ఈ రతన్ టాటా.

సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్‌ స్టాగ్రాం ఫాలోవర్స్ కలిగిన ఈయన... నేటితో 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ రోజు రతన్ టాటా జన్మదినం సందర్భంగా ఆయన గురించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం...!

బాల్యం - విద్యాభ్యాసం:

రతన్ టాటా పూర్తి పేరు రతన్ నావల్ టాటా. 1937 డిసెంబర్ 28న రతన్ టాటా జన్మించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు, జంషెడ్ జీ టాటా.. రతన్ టాటా కు ముత్తాత అవుతారు. 1948లో రతన్ టాటాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో రతన్ టాటాను ఆయన నానమ్మ నవాజ్ బాయి టాటా పెంచారు.

రతన్ టాటా 8వ తరగతి వరకు ముంబైలోని క్యాంపియన్ స్కూల్లో, ఆ తర్వాత ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో, సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో చదివారు. అనంతరం 1955లో న్యూయార్క్ నగరంలోని రివర్ డేల్ కంట్రీ స్కూల్ నుంచి డిప్లొమా పొందారు.

కెరీర్ ప్రారంభం!:

1961లో రతన్ టాటా "టాటా గ్రూప్"లో తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు! కార్నెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో రతన్ టాటా పూర్వ విద్యార్థి కూడా! ఈ క్రమంలో రతన్ టాటా 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ను ప్రారంభించారు.

ఈ క్రమంలో అంచలంచెలుగా ఎదిగిన టాటా గ్రూపు... ఆంగ్లో-డచ్ స్టీల్ మేకర్ కోరస్, బ్రిటిష్ టీ సంస్థ టెట్లీ, బ్రిటిష్ ఆటోమోటివ్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ విలీనాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు భరించగలిగే చౌకైన కారును తయారు చేస్తానని 2009లో రతన్ టాటా వాగ్దానం చేశాడు. చెప్పినట్లుగానే రూ.లక్షకు టాటా నానోను లాంచ్ చేశారు.

చేతికి ఎముక లేని మనిషి!:

దాతృత్వం విషయంలో కూడా రతన్ టాటా ప్రసిద్ధి చెందారు. ఆయన చేతికి ఎముకే లేదనే మాటలు నిత్యం వినిపిస్తుంటాయి. భారతదేశానికి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి కార్నెల్ విశ్వవిద్యాలయంలో 28 మిలియన్ డాలర్ల టాటా స్కాలర్షిప్ నిధిని అతని నాయకత్వంలోని టాటా గ్రూప్ ఏర్పాటు చేసింది.

ఇదే క్రమంలో 2010 లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ నిర్మాణానికి 50 మిలియన్ డాలర్లు టాటా గ్రూప్ విరాళంగా ఇచ్చింది. దీంతో ఆ సెంటర్ కు "టాటా హాల్" అని పేరు పెట్టారు. అనంతరం... 2014 లో ఐఐటీ-బాంబేకు 95 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది టాటా గ్రూప్. ఆ విరాళంతో "టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్" ను ఏర్పాటు చేసింది.

ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే... భారతదేశంలోని అనేక మంచి కార్యక్రమాల కోసం రతన్ టాటా లెక్కకు మించిన డబ్బును విరాళంగా ఇచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి!

పెళ్లి చేసుకోలేదు!:

అంత చదువు, అన్ని తెలివి తేటలు, అంత సంపద.. ఎన్ని ఉన్నా రతన్ టాటా అవివాహితుడిగానే మిగిలిపోయారు! దీనివెనుక ఒక పెద్ద (లవ్)స్టోరీనే ఉంది! ఈ విషయాలపై గతంలో స్పందించిన రతన్ టాటా... తాను లాస్ ఏంజిల్స్ లో పనిచేస్తున్న రోజుల్లో ప్రేమలో పడినట్లు చెబుతారు. కానీ... 1962 ఇండో - చైనా యుద్ధం కారణంగా ఆ అమ్మాయి తల్లితండ్రులు ఆమెను ఇండియాకు పంపడానికి నిరాకరించారంట. దీంతో రతన్ టాటా అవివాహితుడిగానే ఉండిపోయారు!