Begin typing your search above and press return to search.

ఎఫ్ -35 ఫైటర్ జెట్.. ఇంకా ఎన్నిరోజులు?

హైడ్రాలిక్‌ వ్యవస్థలో తలెత్తిన సమస్యతో జూన్ 14న అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసిన ఈ ఫైటర్‌ జెట్‌, అప్పటి నుండి అక్కడే నిలిచివుంది.

By:  Tupaki Desk   |   15 July 2025 1:00 AM IST
ఎఫ్ -35 ఫైటర్ జెట్.. ఇంకా ఎన్నిరోజులు?
X

కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నెల రోజులుగా నిలిచిపోయిన బ్రిటన్‌ నౌకాదళానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్‌-35 ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైడ్రాలిక్‌ వ్యవస్థలో తలెత్తిన సమస్యతో జూన్ 14న అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసిన ఈ ఫైటర్‌ జెట్‌, అప్పటి నుండి అక్కడే నిలిచివుంది.

-రహస్య మరమ్మతులు

మొదటి దశలో సుమారు మూడు వారాల పాటు విమానం విమానాశ్రయంలో బహిరంగంగానే నిలిపివేయబడింది. ఆ తర్వాత, జూలై 6న దీనిని ఒక ప్రత్యేక హ్యాంగర్‌కు తరలించి మరమ్మతుల ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఇది సాధారణ మరమ్మతు కాదు. ఈ ప్రక్రియ అత్యంత రహస్యంగా, అత్యధిక భద్రత మధ్య సాగుతోంది. ఈ మరమ్మతుల కోసం బ్రిటన్ నుండి 24 మంది నిపుణుల బృందం వచ్చింది. వీరిలో 14 మంది సాంకేతిక నిపుణులు కాగా, మిగిలిన 10 మంది విమాన క్రూ సభ్యులు. ఈ బృందం ఎఫ్‌-35లో తలెత్తిన హైడ్రాలిక్ లోపాన్ని పరిష్కరించేందుకు నిత్యం కృషి చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సంతృప్తికరమైన ఫలితం రాలేదు.

-ఆస్ట్రేలియాకు బయలుదేరి...

ఈ ఫైటర్‌ జెట్‌ అసలు గమ్యం ఆస్ట్రేలియాగా తెలుస్తోంది. మార్గ మధ్యలో ఇంధన సమస్యలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఎదురుకావడంతో పైలట్ అత్యవసరంగా సమీప విమానాశ్రయమైన తిరువనంతపురంలో ల్యాండ్ చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఈ యుద్ధవిమానం తిరిగి గాల్లోకి లేచిన దాఖలాలు లేవు. ప్రస్తుతం విమానం చుట్టూ బ్రిటిష్‌ భద్రతా సిబ్బంది ముమ్మర నిఘా పెట్టారు. భారతీయ సిబ్బంది విమానం నుండి దూరంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రహస్యతే ఈ విమానానికి మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

- విడిభాగాలుగా తరలిస్తారా?

సాంకేతిక మరమ్మతులు ఫలించకపోతే, ఎఫ్‌-35ని విడిభాగాలుగా విభజించి, భారీ ట్రాన్స్‌పోర్ట్ విమానం సీ-17 గ్లోబ్‌ మాస్టర్ ద్వారా తిరిగి బ్రిటన్‌కు తరలించే అవకాశముంది. దీన్ని అమలు చేయగలిగేది కేవలం లాక్‌హీడ్ మార్టిన్ సంస్థకు చెందిన ప్రత్యేక ఇంజినీర్లే. ఈ పరిణామాలతో భారత విమానాశ్రయ చరిత్రలోనే ఒక అరుదైన ఘటనగా ఎఫ్‌-35 నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో దీని మరమ్మతులు పూర్తవుతాయా? లేక దీన్ని విదేశాలకు తరలించాల్సి వస్తుందా? అన్నదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ పరిస్థితి ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.