Begin typing your search above and press return to search.

ఎఫ్-1 పీడకల: తప్పుడు సమాచారంతో SEVIS రద్దు?

అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు తమ చట్టపరమైన హోదా విషయంలో తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   21 April 2025 10:34 PM IST
ఎఫ్-1 పీడకల: తప్పుడు సమాచారంతో SEVIS రద్దు?
X

అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు తమ చట్టపరమైన హోదా విషయంలో తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎఫ్-1 వీసాపై చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థుల స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (SEVIS) స్టేటస్, సరైన ప్రక్రియ, తుది నిర్ధారణ లేకుండానే రద్దు చేయబడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలు విద్యార్థి సమాజంలో ముఖ్యంగా లక్షలాది మంది భారతీయ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టుల ద్వారా నేరారోపణల తుది స్థితి స్పష్టంగా తేలకముందే.., కేవలం ప్రాథమిక సమాచారం ఆధారంగానే SEVIS స్టేటస్‌లను రద్దు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక కోర్టు దాఖలు పత్రంలో క్రిమినల్ అరెస్ట్ అంతిమ స్థితిని తాము ఎల్లప్పుడూ కచ్చితంగా నిర్ధారించలేమని అమెరికా ప్రభుత్వం అంగీకరించిందని ఒక సోషల్ మీడియా యూజర్ పేర్కొన్నారు. సరైన సమాచారం అందుబాటులో లేకపోయినా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

ఈ లోపభూయిష్ట ప్రక్రియ వెనుక హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (HSI) లో భాగమైన కౌంటర్ థ్రెట్ లీడ్ డెవలప్‌మెంట్ యూనిట్ (CTLD) ఉందని తెలుస్తోంది. ఈ యూనిట్ ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ రికార్డులను సమీక్షిస్తుంది. CTLD ప్రధానంగా SEVIS , కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) వ్యవస్థల నుండి అరెస్ట్‌లు, చలాన్‌లు.. వేలిముద్రలు వంటి ప్రాథమిక డేటాను పరిశీలిస్తుంది. అయితే ఈ ప్రాథమిక డేటాలో తరచుగా కేసు యొక్క తుది ఫలితం ఉండనుంది. న్యాయస్థానం నిర్ణయం ఇక్కడ ఉండదు.

దీని ఫలితంగా ఎటువంటి నేర చరిత్ర లేని లేదా తప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ నిర్దోషిగా తేలిన విద్యార్థులు సైతం ఈ వ్యవస్థలో చిక్కుకుంటున్నారు. రాత్రికి రాత్రే వారి ఎఫ్-1 వీసా చెల్లుబాటు కోల్పోతుంది. తద్వారా వారి చట్టపరమైన హోదా, విద్యను కొనసాగించే అవకాశం.. భవిష్యత్ ఉద్యోగావకాశాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. ఇది చట్టాన్ని అమలు చేయడం కంటే, వాస్తవాలు పూర్తిగా నిర్ధారించబడకముందే వ్యక్తులను శిక్షించే ఒక వ్యవస్థగా తయారయిందని విశ్లేషకులు అంటున్నారు.

అమెరికాలో చదువుకుంటున్న సుమారు 330,000 మంది భారతీయ విద్యార్థులతో సహా అంతర్జాతీయ విద్యార్థి సంఘం తీవ్ర భయాందోళనలో ఉంది. ఎప్పుడు తమ SEVIS స్టేటస్ రద్దవుతుందోనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితికి భయపడి చాలా మంది విద్యార్థులు తమంతట తామే స్వదేశాలకు తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. మరికొందరు మాత్రం తమ చట్టపరమైన హోదాను కాపాడుకోవడానికి, ఈ అన్యాయమైన ప్రక్రియపై పోరాడటానికి న్యాయ సహాయం కోరుతున్నారు.

సరైన ధ్రువీకరణ లేకుండా, కేవలం ప్రాథమిక డేటా ఆధారంగా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ ప్రక్రియపై పారదర్శకత, జవాబుదారీతనం అవసరం అని విద్యార్థి సంఘాలు , న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ "ఎఫ్-1 పీడకల" నుండి అంతర్జాతీయ విద్యార్థులకు ఎప్పుడు విముక్తి లభిస్తుందో వేచి చూడాలి.