రోజు రోజుకీ పెరుగుతున్న అక్రమ సంబంధాలకు ఇవే అసలు కారణాలు!
అవును... అక్రమ సంబంధాల వ్యవహారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి! వీటి ఫలితంగా జరుగుతున్న నేరాలు, ఘోరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
By: Tupaki Desk | 1 July 2025 4:24 PM ISTఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే! అంతే కాకుండా.. వాటి కారణంగా జరుగుతున్న నేరాలు, ఘోరాలూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. పైగా గత కొన్ని నెలలుగా వరుసగా ఈ తరహా ఘటలను తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో... ఈ అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణాలు ఏమిటనేది ఇప్పుడు చూద్దామ్...!
అవును... అక్రమ సంబంధాల వ్యవహారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి! వీటి ఫలితంగా జరుగుతున్న నేరాలు, ఘోరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి కారణంగా నాశనం అవుతున్న వారి జీవితాల సంగతి అలా ఉంచితే... బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లల జీవితాలను అందకారంలోకి నెట్టేస్తున్నాయి. పాపం పుణ్యం ఎరుగని వయసులో వారి మనసుల్లో తీవ్రమైన అలజడిని, ఆందోళనను సృష్టిస్తున్నాయి.
ఇలా రోజు రోజుకీ పెరిగిపోతూ, తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అక్రమ సంబంధాలకు ప్రత్యేకంగా ఒకటే కారణం అని ఉండదని అంటున్నారు నిపుణులు. ఇందులో పలు కారణాలు శరీరానికి సంబంధించినవి అయితే.. మరిన్ని కారణాలు మనసుకు సంబంధించినవని చెబుతున్నారు. ఈ విషయంలోఈ ఆడ, మగా అనే తేడాలేమీ ఉండవని, ఇద్దరివైపు నుంచి కారణాలుంటాయని అంటున్నారు.
ఇందులో ప్రధానంగా... భార్యాభర్తల మధ్య భావోద్వేగ సాన్నిహిత్యం కొరవడటం ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, వినకపోవడం, అభినందించకపోవడం వంటివి బయట సాన్నిహిత్యాన్ని కోరుకునేలా చేస్తాయి. భర్త లేదా భార్య నుండి తగినంత ప్రేమ, శ్రద్ధ, గౌరవం లభించడం లేదని భావించినప్పుడు, ఆ ఖాళీని మరొకరితో నింపుకోవాలని చూస్తారు.
ఇదే క్రమంలో... లైంగిక కోరికలు తీరకపోవడం లేదా భాగస్వామితో శారీరక సాన్నిహిత్యం తగ్గిపోవడం కూడా ఈ అక్రమ సంబంధాలకు మరో ప్రధాన కారణం అని అంటున్నారు. అదే విధంగా... మరికొంతమంది దంపతుల్లో కొత్తదనం కోరుకోవడం, ఉత్సాహం ఆశించడం కూడా దీనికి దారితీయవచ్చని చెబుతున్నారు.
దీంతో... కాలక్రమేణా భాగస్వాముల మధ్య ఎమోషన్స్ కరువవ్వడం, మానసిక దూరం పెరగడం, కమ్యూనికేషన్ లేకపోవడం, భావాలను పంచుకోలేకపోవడం, ఒకరు పంచుకున్నా మరొకరు అర్ధం చేసుకోకపోవడం జరుగుతుందని.. దీని తదుపరి దశ అక్రమ సంబంధాలేనని చెబుతున్నారు. ఇలా అటు శారీరక, మానసిక సమస్యల ఫలితమే వీటికి ప్రధాన కారణమని చెబుతున్నారు.
ఇదే సమయంలో.. ఇతరులను చూసి, కొత్త కొత్త కోరికలు పెంచుకుని, వాటిని తీర్చుకోవడానికి ఆర్థిక స్థోమత సరిపడక పలువురు ఈ మార్గాలను ఎంచుకుంటారని చెబుతున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. ఇలా.. నేటి సమాజంలో మానవ సంబంధాల మధ్య పెరిగిపోతున్న అర్ధిక సంబంధాలు ఒక ప్రధన కారణమని అంటున్నారు.
పరిష్కార మార్గాలు:
భాగస్వామిపై కాకుండా మరొకరిపైకి ఆలోచనలు మళ్లుతున్నప్పుడు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించేలా ప్రయత్నించాలి. ఇలాంటి వాటిని ప్రోత్సహించే స్నేహితులకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. ఇక అక్రమ సంబంధాలు బయటపడినప్పుడు.. నిపుణులు కౌన్సెలింగ్, థెరపీని సిఫార్సు చేస్తారు. ఇది జంటల మధ్య బంధాన్ని పునర్నిర్మించుకోవడానికి సహాయపడుతుంది.
