Begin typing your search above and press return to search.

ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను చంపి.. జేసీబీతో పూడ్చేసింది

ముచ్చ‌టైన కుటుంబం ముందున్నా.. అంత‌కు మించి ఏదో కావాల‌న్న అత్యాశ‌.. అనూహ్య ఉదంతాల‌కు తావిస్తోంది.

By:  Garuda Media   |   25 May 2026 1:37 PM IST
ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను చంపి.. జేసీబీతో పూడ్చేసింది
X

ముచ్చ‌టైన కుటుంబం ముందున్నా.. అంత‌కు మించి ఏదో కావాల‌న్న అత్యాశ‌.. అనూహ్య ఉదంతాల‌కు తావిస్తోంది. పెళ్లై.. పిల్ల‌ల‌తో గ‌డుస్తున్న కుటుంబాన్ని.. మ‌ధ్యలో ప‌రిచ‌య‌మైన ప్రియుడి కోసం ఆ కుటుంబాన్ని చేజేతులారా నాశ‌నం చేసుకోవ‌టం ఇటీవ‌ల కాలంలో పెరిగిపోవ‌టం తెలిసిందే. తాజాగా అలాంటి ఉదంత‌మే మ‌రొక‌టి వెలుగు చూసింది. ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను చంపేసి.. జేసీబీ తెప్పించి మ‌రీ కప్పేసిన వైనం షాకింగ్ గా మారింది. సంగారెడ్డి జిల్లా మ‌నూరు మండ‌లం ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ దారుణం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. తొమ్మిది రోజులుగా మిస్ట‌రీగా మారిన మిస్సింగ్ కేసును పోలీసులు ఆదివారం ఛేదించారు. స్థానికులు.. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం చూస్తే.. అస‌లేం జ‌రిగిందంటే..

ప‌ద‌మూడేళ్ల క్రితం మ‌నూరు మండ‌ల కేంద్రానికి చెందిన క‌ల్ప‌న‌కు.. నారాయ‌ణ‌ఖేడ్ మండ‌లానికి చెందిన ముత్యంరెడ్డి అనే వ్య‌క్తితో వివాహ‌మైంది. వీరికి ప‌దేళ్ల కూతురు.. కొడుకు ఉన్నారు. నారాయ‌ణ‌ఖేడ్ ప‌ట్ట‌ణంలో మోటారు వైండింగ్ మెకానిక్ గా ముత్యం రెడ్డి ప‌ని చేస్తుంటే.. క‌ల్ప‌న ఒక ప్రైవేటు ఆసుప‌త్రిలో న‌ర్సుగా ప‌ని చేసేది. ఈ మ‌ధ్య కాలంలో ఆమె న‌ర్సు ఉద్యోగాన్ని వ‌దిలేసి.. కొత్త‌గా ఒక ప్రైవేటు స్కూల్లో టీచ‌ర్ గా చేరింది.

ఈ నెల ప‌ద‌హారు నుంచి ఆమె భ‌ర్త ముత్యంరెడ్డి కనిపించ‌కుండా పోయారు. ఇదే విష‌యాన్ని పోలీసుల‌కు ఫిర్యాదు రూపంలో ఇచ్చి.. క‌న్నీళ్లు పెట్టుకుంది. క‌నిపించ‌కుండా పోయిన త‌న భ‌ర్త ఆచూకీని ఎలాగైనా క‌నిపెట్టాల‌ని మొర‌పెట్టుకుంది. క‌ల్ప‌న‌తో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు కూడా స్టేష‌న్ కు త‌ర‌చూ వెళ్లేవారు. రంగంలోకి దిగిన పోలీసుల‌కు ముత్యంరెడ్డికి సంబంధించి ఎలాంటి ఆచూకీ ల‌భించ‌లేదు.

దీంతో.. క‌ల్ప‌న మీద సందేహంతో ఆమె మీద నిఘా పెట్టారు. ఆమె ఫోన్ కాల్స్ చిట్టాను తెప్పించారు. ఇందులో వారికి ఈ నెల ప‌ద‌హారున ఒక నెంబ‌ర్ కు చాలాసార్లు ఫోన్ చేసి మాట్లాడిన‌ట్లుగా గుర్తించారు. ఆ వ్య‌క్తి మ‌నూరు మండ‌లానికి చెందిన గైని పండ‌రి అలియాస్ చింటూగా తేల్చారు. దీంతో.. వీరిద్ద‌రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. త‌మ‌దైన స్టైల్ లో విచార‌ణ సాగించేస‌రికి.. అస‌లు విష‌యాన్ని చెప్పి పోలీసుల‌కు సైతం షాకిచ్చారు.

త‌మ ఇద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఉంద‌ని.. త‌మ రిలేష‌న్ కు భ‌ర్త ముత్యంరెడ్డి అడ్డుగా ఉండ‌టంతో అత‌న్ని అంతం చేస్తే.. తాము ఎంచ‌క్కా ఉండొచ్చ‌న్న దుర్మార్గ‌మైన ఆలోచ‌న‌తో అత‌డ్ని చంపిన వైనాన్ని వెల్ల‌డించారు. అంతేకాదు.. ముత్యంరెడ్డిని చంపేసిన త‌ర్వాత జేసీబీను అద్దెకు తీసుకొచ్చి.. గొయ్యి తీసి అందులో ముత్యంరెడ్డి శ‌వాన్ని పూడ్చి పెట్టారు. విచార‌ణ‌లో వారు వెల్ల‌డించిన వివ‌రాల ఆధారంగా స‌ద‌రు గోతిలో నుంచి ముత్యంరెడ్డి డెడ్ బాడీని వెలికి తీశారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచ‌ల‌నంగా మారింది.