Begin typing your search above and press return to search.

భారత్‌ - కెనడా విదేశాంగ మంత్రుల రహస్య భేటీ అందుకేనా?

ఖలిస్తానీ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను తమ దేశంలో భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 Oct 2023 11:03 AM GMT
భారత్‌ - కెనడా విదేశాంగ మంత్రుల రహస్య భేటీ అందుకేనా?
X

ఖలిస్తానీ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను తమ దేశంలో భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమ దర్యాప్తునకు భారత్‌ సహకరించేలా ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ కెనడా మిత్ర దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ తదితర దేశాలకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగని ట్రూడో కెనడాలోని భారత సీనియర్‌ దౌత్యవేత్తను బహిష్కరించారు.

దీనికి దీటుగా ప్రతిస్పందించిన భారత్‌ తమ దేశంలోని కెనడా దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించింది. తమ దేశంలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిలో 41 మందిని వెనక్కి తీసుకోవాలని ఆల్టిమేటం జారీ చేసింది. అంతేకాకుండా కెనడాకు వీసాల జారీని నిలిపేసింది. ఇప్పటికే కెనడాలో ఉన్న భారత పౌరులకు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు జారీ చేసింది. కెనడా ఉగ్రవాదుల స్వర్గధామమని భారత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

దీంతో దిగివచ్చిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తాము భారత్‌ తో ఉద్రిక్తతలను కోరుకోవడం లేదని తెలిపారు. హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి ఆధారాలను ఇప్పటికే భారత్‌ కు అందజేశామని వెల్లడించారు. ఈ దర్యాప్తుకు భారత్‌ సహకరించాలని కోరారు. మరోవైపు కెనడా ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. నిజ్జర్‌ హత్యతో తమకెలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.

ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్, కెనడా విదేశాంగ మంత్రులు ఇటీవల అమెరికాలో రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ దినపత్రిక ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఒక కథనం వెలువరించింది.

కొద్ది రోజుల క్రితం అమెరికా రాజధాని వాషింగ్టన్‌ లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ రహస్య సమావేశంలో పాల్గొన్నట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. భారత్‌ తో దౌత్య ఉద్రిక్తతలను తొలగించుకోవాలని కెనడా ప్రయత్నిస్తున్నట్టు ఆ కథనం తెలిపింది. ఈ క్రమంలోనే భారత్‌ డిమాండ్‌ చేసినట్లుగా భారత్‌ లో దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకున్నట్లు కెనడా తెలిపింది. అయితే, ఈ రహస్య భేటీ గురించి ఇరు దేశాల విదేశాంగ శాఖల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడం గమనార్హం.

కాగా భారత్‌ తో దౌత్య వివాదాన్ని తాము ప్రైవేటుగా పరిష్కరించుకోవాలనుకుంటున్నామని ఇటీవల కెనడా విదేశాంగ మంత్రి మెలానీ ప్రకటించారు. తాము భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. తమ దౌత్యవేత్తల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ వివాదం పరిష్కారం కోసం భారత్‌ తో ప్రైవేటు చర్చలు కొనసాగించాలనుకుంటున్నామని చెప్పారు. ఎందుకంటే.. విషయాలు బహిర్గతం కానంతవరకు దౌత్యపరమైన చర్చలే ఉత్తమమైన మార్గమని భావిస్తున్నాం అని మెలానీ వెల్లడించారు.

మరోవైపు భారత్‌ తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి ఇంకా పెరగాలని తమ దేశం కోరుకోవట్లేదని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కూడా ఇప్పటికే ప్రకటించారు.