Begin typing your search above and press return to search.

పశ్చిమ దేశాలపై జైశంకర్‌ హాట్‌ కామెంట్స్‌ వైరల్‌!

భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. పశ్చిమ దేశాలు చెడ్డవనే అపనమ్మకాల నుంచి బయటపడాలన్నారు

By:  Tupaki Desk   |   18 Sep 2023 8:28 AM GMT
పశ్చిమ దేశాలపై జైశంకర్‌ హాట్‌ కామెంట్స్‌ వైరల్‌!
X

భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. పశ్చిమ దేశాలు చెడ్డవనే అపనమ్మకాల నుంచి బయటపడాలన్నారు. వారేమీ తమ సరుకులతో ఆసియా-ఆఫ్రికా మార్కెట్లను ముంచెత్తడం లేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆ దేశాలను ప్రతికూల దృక్పథంతో చూడాల్సిన అవసరం లేదని చెప్పారు. తానేమీ పశ్చిమ దేశాల తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడటం లేదని వివరణ ఇచ్చారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభం సందర్భంగా తిరువనంతపురం వెళ్లిన జైశంకర్‌ ఈ మేరకు ఓ మలయాళీ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు హాట్‌ కామెంట్స్‌ చేశారు.

పశ్చిమ దేశాలేవీ తమ సరుకులతో ఆసియా–ఆఫ్రికా మార్కెట్లను ముంచెత్తడం లేదని జైశంకర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలు చెడ్డవనే పాతకాలం అపోహల నుంచి మనం బయటపడాల్సి ఉందన్నారు. అలాగే పశ్చిమ దేశాలు బాగా అభివృద్ధి చెందిన దేశాలని గుర్తు చేశారు. సంక్లిష్టమైన ప్రపంచంలో సమస్యలు కూడా సంక్షిష్టంగానే ఉంటాయని తెలిపారు.

గత 15–20 ఏళ్లుగా గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో అసమానతలు పెరిగిపోయాయన్నారు. కొన్ని దేశాలకు చెందిన చౌక వస్తువులే మార్కెట్లను ముంచెత్తాయని తెలిపారు. దీంతో కొన్ని ప్రపంచ దేశాలు ఒత్తిడికి గురై తమ సరుకులు, ఉద్యోగాలకు చోటెక్కడని చూస్తున్నాయని జైశంకర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ముఖ్యంగా ఈ దేశాలు గత 20 ఏళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరు, కొవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇంధన, ఆహార వస్తువుల ధరల పెంపు సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. దీంతో తమను అభివృద్ధి చెందిన దేశాలు వాటి ఆర్థిక వృద్ధి కోసం వాడుకొంటున్నాయనే ఆగ్రహం వెనుకబడిన దేశాల్లో ఉందన్నారు. అయితే ఇందుకు పశ్చిమ దేశాలను బాధ్యులను చేయకూడదన్నారు.

భారత్‌ తయారీ రంగం, వ్యవసాయం, చంద్రయాన్‌–3 వంటి శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతి, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వంటి అంశాల కారణంగా.. తమలో ఒక దేశానికి తట్టుకొని నిలబడి పురోగతి సాధించగల సత్తా ఉందని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు భారత్‌ ను గుర్తించాయన్నారు. ఇటీవల జరిగిన జీ20 సదస్సుల్లో గ్లోబల్‌ సౌత్, 120 దేశాల వాణిని సమష్టిగా వినిపించామని జైశంకర్‌ గుర్తు చేశారు.

ఉక్రెయిన్‌ పై యుద్ధం చేస్తున్నందుకు రష్యాను నిందించే కార్యక్రమాన్ని జీ20 సదస్సు నుంచి భారత్‌ ఎలా తప్పించిందనే ప్రశ్నకు కూడా జైశంకర్‌ స్పందించారు. అక్కడ చాలా పట్టువిడుపులు చోటు చేసుకున్నాయన్నారు. ఇండోనేషియాలోని బాలి సదస్సులో రష్యాను తీవ్రంగా నిందించారని జైశంకర్‌ గుర్తు చేశారు. కానీ, భారత్‌ లో అలా జరగలేదని.. డిక్లరేషన్‌ మాత్రమే సాధ్యమైందని తెలిపారు.