Begin typing your search above and press return to search.

నారాయణ... నారాయణ... ఏమోసార్ మాకు కనబడదు!

నారాయణ కాలేజీల చైర్మన్, మాజీ మంత్రి పొంగూరు నారాయణ తనను వేధించారని, హింసించారని అయన మరదలు ప్రియ పొంగూరు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 July 2023 8:43 AM GMT
నారాయణ... నారాయణ... ఏమోసార్  మాకు కనబడదు!
X

నారాయణ కాలేజీల చైర్మన్, మాజీ మంత్రి పొంగూరు నారాయణ తనను వేధించారని, హింసించారని అయన మరదలు ప్రియ పొంగూరు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికలుగా చేసిన ఆ ఆరోపణల వీడియోలు రాష్ట్రంలో విస్తృతంగా సర్క్యులేట్ అయ్యాయి. అయితే ఎల్లో మీడియా కానీ... రాష్ట్రంలో మహిళల భద్రతకు, వారి సంక్షేమానికి కంకణం కట్టుకున్నాను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్‌ గానీ రెండ్రోజులుగా చడీ చప్పుడు చేయడం లేదు!

అదేంటి... రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది అంటూ పెద్దపెద్ద కేకలు వేసిన పవన్ కళ్యాణ్... ఇప్పుడు తన రాజకీయ మిత్రుడు నారాయణపై.. ఆయన సొంత తమ్ముడి భార్య చేసిన ఆరోపణలపై కిక్కురుమనడం లేదు?.. దీంతో రాజకీయంగా ప్రయోజనకరం అయితేనే పవన్ స్పందిస్తారు, లేదంటే మాత్రం “ఏమోసార్ నాకు కనబడదు.. వినబడదూ” అని నాటకాలు ఆడతారని అర్థం అవుతోందనే కామెంట్లు వినిపిస్తోన్నాయి.అయితే వాస్తవానికి టీడీపీలో మొదటి నుంచీ ఇటువంటి అరాచకాలు ఉన్నాయని... ఇదే మొదటి కాదని... ఇదే చివరిది కాకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు!


కాల్ మనీకి అరాచకాలకు కేరాఫ్ అడ్రస్:


తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు... పార్టీలోని వారిని, వారి కుటుంబీకులను, ఆర్థిక సాయం చేసిన నెపంతో బయటివారిని శారీరకంగా మానసికంగా వేధించారంటూ అప్పట్లో సంచలన విషయాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీ ఆ స్థాయిలో పతనం అవ్వడానికి గల కారణాల్లో... ఈ కాల్ మనీ సెక్స్ రేకెట్ కూడా ఒక కారణం అని అంటుంటారు.

పేదలకు అవసరానికి పదివేలు అప్పు ఇచ్చి లక్షరూపాయలు వసూలు చేయడం.. తల్లీ - బిడ్డ, అక్కా చెళ్లి అనే తారతమ్యాలు ఏమీ లేకుండా లైంగికంగా హింసించిన ఘ‌ట‌న‌లు ఎన్నో అప్పట్లో తెరపైకి వచ్చాయని అంటుంటారు. విజయవాడ కాల్ మనీ కేసు అప్పట్లో రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.

ఇదే సమయంలో... మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్.. తన కుమారుడు శివరామకృష్ణతో కలిసి కోడలు పద్మప్రియను వేధించారంటూ అప్ప్పట్లో ఒక కేసు పెద్ద సంచలనం సృష్టించింది. ఇదే క్రమంలో... ప్రస్తుతం సత్తెనపల్లి టిడిపి ఇంచార్జ్ గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, అయన భార్య, కొడుకు నాగరాజు సైతం కోడలు కీర్తిని వేధించిన కేసుల్లో విచారణ ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి నారాయణ.. ఏకంగా తన తమ్ముడి భార్య ప్రియను వేధించడం సంచలనం అయింది. అప్పట్లో సినీ నటి కవిత, దివ్య వాణి సైతం ఇలాగే పార్టీలో తమకు జరిగిన అవమానాలు, ఇబ్బందులను సమాజానికి ఏకరువు పెట్టి పార్టీకి, అధినేతకు ఒక నమస్కారం అంటూ నిష్క్రమించిన సంగతి తెలిసిందే!


అప్పట్లో బాలయ్యకు.. ఇప్పుడు ప్రియకు.. పిచ్చి అంట!:


ఇదిలా ఉండగా తమకు , తమ ప్రతిష్టకు భంగం కలుగుతున్నదని గుర్తించిన మరుక్షణమే టీడీపీ నాయకులు, పెద్దలు లైన్లోకి వస్తారని... వెంటనే తమను, తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చి అసలు విషయాన్ని నీరుగారుస్తారని అంటుంటారు పరిశీలకులు. ఇందుకు ఉదాహరణంగా… అప్పట్లో తన ఇంటిలో బాలకృష్ణ జరిపిన కాల్పుల ఘటనను తెరపైకి తెస్తున్నారు.

ఆ సమయంలో బాలకృష్ణ… కేసు నుంచి తప్పించుకునేందుకు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని బయటపడ్డారు! ఇప్పుడు కూడా ప్రియా పొంగూరుకు పిచ్చి ఉందని.. అందుకే ఆమె ఏదేదో మాట్లాడుతున్నారని.. ఆమె భర్త, నారాయణ సొంత తమ్ముడు సుబ్రహ్మణ్యం చెప్పడం దీనికి మరో ఉదాహరణ అని అంటున్నారు. దీంతో... ఆమె పిచ్చిది కాబట్టి.. ఆ మాటలకు విలువలేదని చెబుతూ ఆ అంశాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లే అని అంటున్నారు!


ఆమె వీర మహిళ... అయినా కిక్కురుమనని పవన్?:


వాస్తవానికి ప్రియ పొంగూరు జనసేన సానుభూతిపరురాలు అని అంటున్నారు. గతంలో వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ వివాదాస్పద కామెంట్స్ చేసినపుడు.. ప్రియ ఆయనకు మద్దతుగా నిలబడ్డారని చెబుతున్నారు. ఇందులో భాగంగా... హ్యూమన్ ట్రాఫికింగ్ అంశం మీద పవన్ చేసిన ఆరోపణలు, లేవనెత్తిన ప్రశ్నలకు ప్రియా మద్దతు తెలుపుతూ... ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పోస్టర్, ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

ఆ స్థాయిలో తనకు మద్దతుగా నిలిచిన మహిళ ఇప్పుడు కుటుంబసభ్యుల నుంచే వేధింపులకు గురవుతునంట్లు స్వయంగా ఆమే వెల్లడిస్తుంటే... పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం లేదా? వీర మహిళకు అన్యాయం జరుగుతున్నా అయన వినబడనట్లే, కనబడనట్లే ఉంటారా? కనీసం ఎల్లో మీడియా అయినా ఈ అంశాన్ని ప్రశ్నించాలి కదా! అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.