Begin typing your search above and press return to search.

30 ఏళ్లలో ఎగ్జిట్ పోల్స్ వాస్తవరూపం దాల్చిందెంత?

కొద్ది నెలలుగా సా..గుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, సిక్కిం) సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ నిన్నటితో (బుధవారం) ముగిసింది.

By:  Garuda Media   |   30 April 2026 10:09 AM IST
30 ఏళ్లలో ఎగ్జిట్ పోల్స్ వాస్తవరూపం దాల్చిందెంత?
X

కొద్ది నెలలుగా సా..గుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, సిక్కిం) సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ నిన్నటితో (బుధవారం) ముగిసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మే నాలుగు (సోమవారం) ఉదయం నుంచి ప్రారంభం కానుంది. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి ఏ రాష్ట్రం ఎవరికి అన్న విషయంపై ఫుల్ క్లారిటీ రానుంది.

పోలింగ్ పూర్తైన నేపథ్యంలో వివిధ మీడియా సంస్థలు.. ఇతర సర్వే సంస్థలు ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ఫలితాలు ఎలా ఉంటాయి? ఏ రాష్ట్రంలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న దానిపై తమ అంచనాల్ని వెల్లడించారు. ఇలాంటి వేళ వచ్చే ఆసక్తికర ప్రశ్న ఏమంటే.. ఎగ్జిట్ పోల్స్ ఏమేరకు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి? అన్నది. గడిచిన ముప్ఫై ఏళ్లలో దేశ వ్యాప్తంగా జరిగిన పలు కీలక ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీలు గెలుస్తాయన్న అంశాన్ని మాత్రం సరిగానే అంచనా వేశాయి. కాకుంటే.. గెలుపు తీవ్రత కానీ.. ఓటమి తీవ్రతను మాత్రం అంచనా వేసే విషయంలో మాత్రం చతికిలపడిన పరిస్థితి. గెలుపు ఎవరిది? ఓటమి ఎవరిది? అన్న విషయంపై మాత్రం సరిగానే అంచనా వేసిన పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ కు దగ్గరగా వాస్తవ ఫలితాలు ఉన్న ఎన్నికల్ని చూస్తే.. అసలు విషయం అర్థమవుతుంది.

1998లో లోక్ సభలో బీజేపీ నాయకత్వంలోని కూటమికి 260 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే.. అప్పుడు 254 స్థానాలు వ్చాయి. 1999లో లోక్ సభలో 280 స్థానాలు అంచనా వేస్తే 303 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. 2014లో లోక్ సభలో ఎన్డీయేకు 280-300 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే 336 స్థానాలు దక్కాయి. అదే సమయంలో 2019లో లోక్ సభలో ఎన్డీయేకు 300-350స్థానాలు వస్తాయని అంచనా వేస్తే 353 స్థానాల్ని దక్కించుకుంది.

అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే 2006లో కేరళ ఎన్నికల్లో ఎల్ డీఎప్ కు 15-105 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే 99 స్థానాలు వచ్చాయి. 2011లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమికి 140-160 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే 150స్థానాలు వచ్చాయి. 2016 తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకేకు 130-150 స్థానాలు వస్తాయని అంనా వేస్తే.. 136 స్థానాల్ని సొంతం చేసుకుంది. 2016లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత పార్టీ (టీఎంసీ) 210-230స్థానాలు వస్తాయని అంచనా వేస్తే.. 211 స్థానాలు వచ్చాయి. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన పరిస్థితిని మర్చిపోలేం. ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఎంతమేర వాస్తవ రూపం దాల్చాయన్నది తేలాలంటే మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే.