మాజీ తాలిబన్ కమాండర్‌కు 42 ఏళ్ల జైలు శిక్ష.. అమెరికా కోర్టు సంచలన తీర్పు
2007 నుంచి 2009 మధ్య కాలంలో అఫ్గానిస్తాన్‌లోని వదరక్ ప్రావిన్స్‌కు ఇతను తాలిబన్ కమాండర్‌గా వ్యవహరించాడని చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 10 Jun 2026 4:58 PM ISTఅంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, మాజీ తాలిబన్ కమాండర్ హాజీ నజీబుల్లా (50)కు అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది. అమెరికా సైనికుల మరణాలకు కారణమవడమే కాకుండా, జర్నలిస్ట్ కిడ్నాప్ చేసిన కేసులో అతనికి ఏకంగా 42 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యూయార్క్ లోని మన్‌హట్టన్ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి నజీబుల్లా నైమ్, అబూ తయ్యబ్ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. 2007 నుంచి 2009 మధ్య కాలంలో అఫ్గానిస్తాన్‌లోని వదరక్ ప్రావిన్స్‌కు ఇతను తాలిబన్ కమాండర్‌గా వ్యవహరించాడని చెబుతున్నారు.
అమెరికా సైనికులపై దాడులు
తాలిబాన్ మాజీ కమాండర్ హాజీ నజీబుల్లా నాయకత్వంలో తాలిబన్ ఉగ్రవాదులు అమెరికా, నాటో సైనిక బలగాలపై ఆటోమేటిక్ వెపన్స్, రాకెట్ లాంచర్లతో విరుచుకుపడినట్లు ఆరోపిస్తున్నారు. 2008 జూన్ నెలలో జరిగిన దాడిలో ముగ్గురు అమెరికా సైనికులతోపాటు అఫ్గాన్ అనువాదకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు తానే బాధ్యుడినని నజీబుల్లా అప్పట్లో గర్వంగా చెప్పుకున్నారు. 2008 నవంబర్‌లో అఫ్గానిస్తాన్ వచ్చిన ప్రఖ్యాత అమెరికన్ జర్నలిస్ట్ డేవిడ్ రోడ్ తో పాటు ఇద్దరు అఫ్గాన్ పౌరులను తుపాకీ చూపించి నజీబుల్లా గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. దాదాపు ఏడు నెలల పాటు పాకిస్తాన్ సరిహద్దుల్లోని తాలిబన్ స్థావరంలో వీరందరినీ బంధించి, తలలకు తుపాకులు గురిపెట్టి వీడియోలు తీశారు. కోట్లాది రూపాయల విరాళాలు, తాలిబన్ ఖైదీల విడుదల కోసం అమెరికా ప్రభుత్వాన్ని బెదిరించారు. అయితే, ఆ తర్వాత డేవిడ్ రోడ్ ఆ నరకం నుంచి అత్యంత సాహసోపేతంగా తప్పించుకున్నారు.
కోర్టు రూమ్‌లో ఊహించని సీన్
ఈ కేసు విచారణ ముగిసి, తీర్పు చెప్పే సమయంలో మన్‌హట్టన్ కోర్టు హాల్‌లో ఒక సినిమా రేంజ్ డ్రామా నడిచింది. నల్లటి స్కల్ క్యాప్ ధరించి నిలబడిన ఉగ్రవాది హాజీ నజీబుల్లాకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఒకప్పుడు అతని చేతిలో బందీగా నరకం చూసిన జర్నలిస్ట్ డేవిడ్ రోడ్ వచ్చి నిలబడ్డారు. నజీబుల్లా కళ్లల్లోకి నేరుగా చూస్తూ డేవిడ్ రోడ్ కోర్టులో గద్గద స్వరంతో మాట్లాడారు. ‘కిడ్నాప్ అనేది అత్యంత క్రూరమైన, పిరికిపంద చర్య. ఇంటర్వ్యూ ఇస్తానని అబద్ధాలు చెప్పి నన్ను పిలిపించి మోసపూరితంగా అంబుష్ చేశారు. ఈ రోజు కోర్టులో నిలబడి కూడా నువ్వు చేసిన తప్పుకు బాధ్యత తీసుకోకుండా ఇతరులపై నెట్టేయాలని చూడటం సిగ్గుచేటు’ అని రోడ్ నిలదీశారు. అలాగే, ఆ నాడు ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అమెరికా సైనికుల పేర్లను కోర్టులో చదువుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
దీనిపై నజీబుల్లా స్పందిస్తూ.. డేవిడ్‌కు క్షమాపణలు చెప్పాడు. తన దేశాన్ని రక్షించుకోవడానికే యుద్ధం చేయాల్సి వచ్చిందని డిఫెన్స్ లాయర్ వాదించినప్పటికీ జడ్జి కాథరిన్ పోల్క్ ఫైల్లా ఆ వాదనలను తోసిపుచ్చారు. అమెరికా చట్టాల ప్రకారం నజీబుల్లాకు జీవిత ఖైదు పడాల్సి ఉంది. కానీ, 2025 ఏప్రిల్‌లోనే అతను కోర్టులో తన నేరాలను అంగీకరించడం, పైగా గత ఆరేళ్లుగా కఠినమైన జైలు పరిస్థితులను ఎదుర్కొని ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుని జడ్జి శిక్షను 42 ఏళ్లకు తగ్గించారు. ‘అమెరికన్లకు హాని తలపెట్టినా, ఉగ్రవాద చర్యలకు పాల్పడినా.. ఎంత కాలం పట్టినా సరే వేటాడి పట్టుకుంటాం, న్యాయం ముందు నిలబెడతాం’ అని అమెరికా యాక్టింగ్ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే ఈ తీర్పు అనంతరం హెచ్చరించారు. దాదాపు 18 ఏళ్ల క్రితం జరిగిన క్రూరమైన నేరానికి, అమెరికా ఏరికోరి పట్టుకుని మరీ 42 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో అమెరికా పగ పడితే అంత తేలిగ్గా వదలదు అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
