Begin typing your search above and press return to search.

జగన్ ముత్తాత వెంకట్ రెడ్డి.. ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలుసా? - మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్

ఏపీ రాజకీయాలు తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధానంగా లడ్డూ ప్రసాదం కల్తీపై అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం కాకరేపుతోంది.

By:  Tupaki Political Desk   |   7 Feb 2026 7:17 PM IST
జగన్ ముత్తాత వెంకట్ రెడ్డి.. ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలుసా? - మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
X

ఏపీ రాజకీయాలు తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధానంగా లడ్డూ ప్రసాదం కల్తీపై అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం కాకరేపుతోంది. వైసీపీ పాలనలో లడ్డూ కల్తీ జరిగిందని అధికార కూటమి, తమ హయాంలో కాదు చంద్రబాబు సీఎంగా ఉండగానే కల్తీ ట్యాంకర్లు వచ్చాయని వైసీపీ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్మోహనరెడ్డి సైతం ఈ అంశంపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తిరుమల వెంకన్న తమ ఇంటి దైవమని చెప్పిన సీఎం చంద్రబాబు.. తాను శ్రీవారి కరుణాకటాక్షాల వల్లే అలిపిరిలో నక్సల్స్ దాడి నుంచి బయటపడ్డానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన లేవనెత్తిన లాజిక్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ గా మారింది.

తిరుమల వెంకటేశ్వరుడు తమ ఇంటి దైవంగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యాలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు కుటుంబంలో ఏ ఒక్కరు తిరుమల వెంకటేశ్వరుడు పేరు పెట్టుకోలేదని మాధవ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జగన్ కుటుంబంలో ఆయన ముత్తాత వెంకట్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ, వైఎస్ కుటుంబానికి వెంకటేశ్వరుడిపై భక్తి ఉంది కనుకే ఆ పేరు పెట్టుకున్నారని మాధవ్ అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కంటెంట్ గా మారాయని అంటున్నారు.

మాధవ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ట్రోల్ చేస్తోంది. ‘‘ఇంటి దేవుడు, నా కుల దైవం అని మాట్లాడుతున్నావు. నీ కొడుకు పేరు లోకేశ్ బాబు, నీ పేరు చంద్రబాబు, నీ తండ్రి పేరు ఖర్జూర బాబూ.. అదే జగన్మోహనరెడ్డి కుటుంబంలో వైఎస్ జగన్మోహనరెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి రాజారెడ్డి, ఆయన తండ్రి వెంకట్ రెడ్డి. నీ (చంద్రబాబు) ఇంట్లో ఏడుకొండలు అని పేరు పెట్టలే.. తిరుపతయ్య అని పేరు పెట్టలే.. వెంకటేశ్వరరావు అని పేరు పెట్టలేదు. ఇది రాష్ట్ర ప్రజలు అంతా గమనించాలి. జగన్ రెడ్డి ముత్తాత వెంకట్ రెడ్డి. వెంకటేశ్వరస్వామిపై భక్తి ఉంటేనే ఆయన పేరు పెట్టుకుంటాం’’ ఆయన నాకే దేవుడు. ఎవరికీ కాదన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారంటూ మాజీ ఎంపీ మాధవ్ వ్యాఖ్యానించారు.

అయితే మాజీ ఎంపీ మాధవ్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వెంకటేశ్వరుడిపై భక్తి ఉందా? లేదా? అన్న విషయాన్ని చెప్పడానికి జగన్ ముత్తాత పేరు ఉదహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. పూర్వీకుల పేర్లకు తాజా రాజకీయాలకు ముడి పెట్టడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం ద్వారా మాజీ ఎంపీ మాధవ్ మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు.