మనిషిని ఎలా చంపాలో 5రోజులు గూగుల్లో సెర్చ్ చేసి మరీ భర్తను చంపింది
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. 68 ఏళ్ల వయస్సున్న భర్తను అత్యంత కిరాతకంగా చంపడానికి భార్య పల్లవి అనుసరించిన పథకం పోలీసులనే తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.
By: Tupaki Desk | 24 April 2025 2:00 AM ISTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. 68 ఏళ్ల వయస్సున్న భర్తను అత్యంత కిరాతకంగా చంపడానికి భార్య పల్లవి అనుసరించిన పథకం పోలీసులనే తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన పల్లవిని పోలీసులు లోతుగా విచారిస్తున్న క్రమంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. తన భర్తను హత్య చేసేందుకు ఐదు రోజుల ముందు నుంచే పల్లవి గూగుల్లో 'మనిషిని ఎలా చంపాలి?', 'తక్కువ సమయంలో ప్రాణాలు పోవాలంటే ఎక్కడ కొట్టాలి?' వంటి భయంకరమైన విషయాలను సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో ఆయన భార్య పల్లవితో పాటు కుమార్తె కృతికి కూడా భాగం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, భర్తను తానే హత్య చేశానని పల్లవి ఒప్పుకోవడంతో పోలీసులు ఆమెను మొదట అరెస్ట్ చేశారు. కుమార్తె కృతి పాత్ర మీద పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినప్పటికీ.. పూర్తి సమాచారం కోసం ఇంకా విచారణ జరుపుతున్నారు. కృతి ప్రస్తుత మానసిక స్థితిని కూడా డాక్టర్లు పరిశీలిస్తున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న పల్లవిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం సాయంత్రం ఆమెను హత్య జరిగిన స్థలానికి తీసుకెళ్లి విచారించారు. హత్యకు ముందు నిందితురాలు వాట్సాప్ గ్రూపుల్లో అనేక మెసేజ్ లను పోస్ట్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. విచారణ సమయంలో తన సొంత ఇంట్లో తనను బంధించారని, నిరంతరం నిఘాలో ఉంచారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన కుమార్తె సేఫ్టీ గురించి కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసుల విచారణలో మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఓం ప్రకాశ్ హత్యకు భార్య మానసిక స్థితితో పాటు ఆస్తి వివాదాలు కూడా ముఖ్య కారణమని పోలీసులు గుర్తించారు. ఓం ప్రకాశ్ భార్య, కుమార్తె కంటే ఆయన తన కుమారుడు, సోదరి ఇంట్లోనే ఎక్కువగా ఉండేవారని తేలింది. అంతేకాకుండా, తనకున్న 17 ఎకరాల భూమిని కుమారుడు, సోదరికి ఇవ్వడానికి సిద్ధం కావడంతో భార్య, కుమార్తె తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ ఆస్తి వివాదాలే చివరికి ఓం ప్రకాశ్ ప్రాణాలు తీసేలా చేశాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
