అరెస్టు గురించి ముందే తెలుసు: సీఐడీ లో వైసీపీ అభిమానులు!
ఆయన మామూలోడు కాదు. ఐపీఎస్ కం టార్గెట్ ఒకసారి తీసుకుంటే దాని సంగతి చూసే వరకు వెనుదిరిగి చూసే అలవాటు లేని రోటీన్ కు భిన్నమైన పోలీసు ఉన్నతాధికారి.
By: Tupaki Desk | 23 April 2025 5:51 AMఆయన మామూలోడు కాదు. ఐపీఎస్ కం టార్గెట్ ఒకసారి తీసుకుంటే దాని సంగతి చూసే వరకు వెనుదిరిగి చూసే అలవాటు లేని రోటీన్ కు భిన్నమైన పోలీసు ఉన్నతాధికారి. తన కెరీర్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ను చూసిన ఆయన.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. తాజాగా హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో అరెస్టు అయిన ఆయన్ను ఏపీ సీఐడీ అధికారులు ఏడు గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా తనను విచారించిన అధికారులకే షాకులు ఇచ్చేలా ఆయన ఆన్సర్లు ఉండటమే కాదు.. విచారణ చేసే వారిని తికమకకు గురయ్యేలా చేసిన వ్యాఖ్యలు కొన్ని వెలుగు చూశాయి.
నటి జెత్వానీ ఎపిసోడ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ నిఘా ఛీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు తనను అరెస్టు చేసిన సీఐడీ అధికారులను కన్ఫ్యూజ్ కు గరయ్యే కార్యక్రమానికి తెర తీసినట్లుగా చెబుతున్నారు. విచారణ వేళ ఆయన నోటి నుంచి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
''అరెస్టు చేయటానికి మీరు వస్తున్నట్లు వారం ముందే నాకు తెలుసు. అరెస్టు చేస్తే ఒకసారి లోపలకు వెళ్లి వద్దామనుకున్నా. అందుకే ముందస్తు బెయిల్ కూ వెళ్లలేదు. జెత్వానీ ఎవరో నాకు తెలీదు. నాకు అప్పట్లో ఈ విషయాలు పట్టించుకునే తీరిక లేదు. ఆమె గురించి ఈ మధ్యే తెలుసుకున్నా. నాకు మంచి అభిప్రాయంలేదు. విద్యాసాగర్ తో సహజీవనం సాగించినట్లు తెలిసింది' అంటూ పలు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
అధికారులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి తడబాటు లేకుండా.. నింపాదిగా సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పలు ప్రశ్నలకు ఔను.. కాదు అనే సమాధానాలు ఇవ్వటం.. అధికారులు సైతం కన్ఫ్యూజ్ అయ్యేలా ఆయన వ్యవహారశైలి ఉందంటున్నారు. ముక్తసరి సమాధానాలు ఇవ్వటం.. ఈ కేసుతో తనకేం సంబంధం ఉందంటూ అమాయకంగా ఎదురు ప్రశ్నలతో విచారణ అధికారులను అమోయానికి గురి చేసినట్లుగా చెబుతున్నారు.
కాన్ఫిడెంట్ గా సమాధానాలు ఇవ్వటం.. అంతలోనే సంబంధం లేని వైరాగ్యాన్ని ప్రదర్శించటం.. కేసుతో సంబంధం లేదన్నట్లుగా ధీమాను ప్రదర్శించటం.. ప్రాప్తం ఉంటే అన్నీ వస్తాయంటూ సంబంధం లేని కామెంట్లు చేయటం లాంటి వాటితో అధికారులకు తనదైన శైలిలో చుక్కలుచూపినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న తర్వాత నుంచి పలు సందర్భాల్లో పోలీసులు ఇచ్చిన ఫుడ్ ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అరెస్టు అంశంపై ఫుల్ ప్రిపేర్ అయినట్లుగా ఆంజనేయులు తీరు ఉందన్నట్లుగా సీఐడీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.