Begin typing your search above and press return to search.

అమ్మ వండినా అలకలు తప్పవు... అన్నప్రసాదంపై రాద్ధాంతమేల!

ఈ సందర్భంగా సోమవారం రాత్రి అన్నదాన సత్రానికి వచ్చిన కొంతమంది భక్తులకు సిబ్బంది అన్నం వడ్డించారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 4:32 PM GMT
అమ్మ వండినా అలకలు తప్పవు... అన్నప్రసాదంపై రాద్ధాంతమేల!
X

తిరుమలలో నిత్యాన్నదానంపై ఒక వివాదం తాజాగా తెరపైకి వచ్చింది. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యత సరిగ్గా లేదంటూ పలువురు భక్తులు టీటీడీ సిబ్బందిపై తిరగబడ్డారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి అన్నదాన సత్రానికి వచ్చిన కొంతమంది భక్తులకు సిబ్బంది అన్నం వడ్డించారు. దీంతో అన్నం సరిగా ఉండకలేదని, మెత్తగా ఉందని టీడీపీ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇందులోకి రాజకీయం రంగప్రవేశం చేసింది!

అవును... టీటీడీ అన్నదాన సత్రంలో సోమవారం రాత్రి భోజనానికి వచ్చిన కొందరు భక్తులు.. అన్నం సరిగ్గా ఉండకలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు బయటకు రావడం, రాజకీయ నాయకులు వీటిపీ కామెంట్లు చేయడంతో ఆన్ లైన్ వేదికగా ఈ వ్యవహారం రచ్చ రచ్చ అయ్యింది.

వాస్తవంగా చూస్తే.. తిరుమలలోని నిత్యాన్నదాన కేంద్రం భక్తులకు చాలా అద్భుతమైన సేవ అందిస్తోంది. ప్రతిరోజూ కనీసం లక్ష మందికి పైగా ఈ కేంద్రంలో భోజనం చేస్తుంటారు. ప్రపంచంలోనే నిత్యాన్నదానం నిర్వహిస్తున్న వాటిలో ఈ స్థాయిలో భక్తులకు భోజన వసతి కల్పించే ఏకైక కేంద్రం తిరుమల అని చెబుతారు. ఇలా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా రోజుకు లక్షమందికి భోజనం దొరుకుతుంటుంది.

ఈ సమయంలో ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు ప్రజలనుంచి వినిపిస్తున్నాయి! ఇలా ప్రతీరోజూ లక్షల మందికి వంటలు వండుతున్నప్పుడు అన్ని రోజులూ ఒకే రకంగా భోజనం ఉడకడం సాధ్యం కాకపోవచ్చు. అందుకు సవాలక్ష కారణాలు ఉండొచ్చు అని అంటున్నారు పరిశీలకులు. ఇంట్లో కూడా ఏడు రోజులూ ఒకేలా అన్నం ఉడికించడం తల్లికి కూడా సాధ్యంకాకపోవచ్చు కదా అని గుర్తు చేస్తున్నారు!

ఈ సమయంలో దైవ ప్రసాదం కాస్త ఎక్కువ ఉడికిందనో, కాస్త మెత్తబడిందనో, కొద్దిగా చిమిడి మెత్తబడిండనో కారణం ఏదైనా... ఈ స్థాయిలో శ్రీవారి నిత్యాన్నదాన సత్రంపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు భక్తులు! ఏడాది పాటు రోజుకి లక్షకు పైగా భక్తులకు జరిగే ఈ కార్యక్రమంలో ఏడాదిలోనో, రెండేళ్లలోనో ఒకరోజు అన్నం చిమిడినంత మాత్రన్న అందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు.

పైగా టీటీడీ సిబ్బందిపై కొంతమంది భక్తులు విరుచుకుపడాల్సిన అవసరం లేదు. కారణం... అది దైవ ప్రసాదం! అలా అని క్వాలిటీ బాగుండకపోతేనో.. నాణ్యత లేని పప్పులు, బియ్యం వండితేనో కచ్చితంగా ప్రశ్నించొచ్చు. కానీ... కేవలం అన్నం మెత్తపడిందని రాద్ధాంతం చేయడం సహేతుకం కాదనే మాటలు వినిపిస్తున్నాయి! ప్రభుత్వాన్ని విమర్శించడానికో.. ప్రభుత్వ పెద్దలపై విమర్శలు చేయడానికో అన్న ప్రసాదాలను సైతం విమర్శించడం ఏమిటో అనే మాటలు ఆన్ లైన్ వేదికగా వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు... ఇదిగో తోక అంటే, అదిగో పులి అన్నట్లుగా ఒక ఫోటో చూసి అల్లరి చేయాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. ఇదే సమయంలో ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు టీటీడీ కూడా అత్యంత సున్నితమైన అంశంగా పరిగణించి స్పందించాలని గుర్తుచేస్తున్నారు భక్తులు. ఈ విషయాన్ని కొంతమంది రాద్ధంతం చేయడం ఎంత తప్పో... ఇలాంటి సున్నితమైన విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవడం అంతకు మించి ముఖ్యమని పెద్దలకు సూచిస్తున్నారు.

ఏది ఏమైనా... రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏవైనప్పటికీ, టీటీడీ బోర్డులో ఉన్న పెద్దలు ఏ పార్టీకి చెందినవారైనప్పటికీ... కొండమీదకు సంబంధించిన విషయాల్లో వీలైనంత జాగ్రత్తగా స్పందించాలని అటు భక్తులకు, అధికారులకు, సిబ్బందికి, పెద్దలకు తెలియజేస్తున్నారు పరిశీలకులు. కోట్లమంది మనోభావాలతో ముడిపడిన అంశం కదా అని కొంతమంది రాజకీయ ప్రయోజనాలకోసం బురదజల్లే ప్రయత్నం చేసినా.. బాధ్యతల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా, సమన్వయతో సమస్యలను పరిష్కరించాలని, పునరావృతం కాకుండా చూడాలని చెబుతున్నారు.

ఈ సమయంలో స్పందించిన టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి... తిరుమలకు రోజూ వచ్చే భక్తులకు అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో టీటీడీ ప్రథమస్థానంలో నిలుస్తోందని తెలిపారు. పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాని తెలిపారు.