Begin typing your search above and press return to search.

అలాగైతే రష్యాను ఉసిగొల్పుతా.. ట్రంప్‌ తెంపరితనం!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆ దేశానికి అధ్యక్షుడిని కావాలని ఉవ్విళ్లూరుతున్నారు

By:  Tupaki Desk   |   11 Feb 2024 8:51 AM GMT
అలాగైతే రష్యాను ఉసిగొల్పుతా.. ట్రంప్‌ తెంపరితనం!
X

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆ దేశానికి అధ్యక్షుడిని కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. పోయినసారి డెమోక్రటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ చేతిలో చిత్తయిన ఆయన ఈసారి మాత్రం పట్టు వదలకూడదని భావిస్తున్నారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకునే ప్రక్రియలో ఆయా రాష్ట్రాల ప్రైమరీల్లో అత్యధిక ఓట్లను గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డోనాల్డ్‌ ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలను మానుకోవడం లేదు. తాజాగా ఆయన ఉత్తర అట్లాంటిక్‌ సంధి వ్యవస్థ (నాటో) దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.

నాటో సభ్య దేశాలు నిబంధనల ప్రకారం తమ రక్షణ బడ్జెట్లను పెంచుకోకపోతే తానే వాటిపైకి రష్యాను ఉసిగొల్పుతానని ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అమెరికాలోని దక్షిణ కరోలినా ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ట్రంప్‌ నాటో దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన నాటో సమావేశం సందర్భంగా తాను సభ్య దేశాధినేతలకు ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలిపారు.

తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన నాటో సమావేశంలో ఒక పెద్ద దేశాధినేత మాట్లాడుతూ.. ‘నాటో కూటమి నిబంధనల మేరకు మేం రక్షణపై ఖర్చు చేయలేదనుకోండి.. మా పై రష్యా దాడి చేస్తే అమెరికా కాపాడదా?’ అని ప్రశ్నించారని ట్రంప్‌ గుర్తు చేశారు. ఆ పెద్ద దేశాధినేత ప్రశ్నకు అమెరికా వారిని రక్షించదని తాను నిర్మొహమాటంగా సమాధానం చెప్పానన్నారు. రష్యా.. నాటో దేశాలను ఏం చేయాలనుకుంటే అది చేయాలని ప్రోత్సహిస్తానని చెప్పినట్టు ట్రంప్‌ వెల్లడించారు. కాగా ట్రంప్‌ వ్యాఖ్యలు అమెరికాలోని రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి.

ట్రంప్‌ తాజా వ్యాఖ్యలపై వైట్‌ హౌస్‌ ప్రతినిధి ఆండ్రూ బెట్స్‌ స్పందించారు. హంతక దేశాల పాలకులను తమ మిత్రదేశాలపై ఉసిగొల్పుతాననడం భయంకరమైన విషయమని మండిపడ్డారు. ఇలాంటివి అమెరికా, ప్రపంచ శాంతి భద్రతలను ప్రమాదంలో పడేస్తాయని వ్యాఖ్యానించారు.

కాగా 2014లో ఉక్రెయిన్‌ లో భాగంగా ఉన్న క్రిమియాను రష్యా ఆక్రమించిన తర్వాత అమెరికా నేతృత్వంలోని నాటో సభ్య దేశాలు అప్రమత్తమయ్యాయి. దీంతో అమెరికా–రష్యా ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్‌ వార్‌) తర్వాత భారీగా తగ్గించుకున్న రక్షణ ఖర్చును మళ్లీ పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి.

2024 నాటికి నాటో దేశాల జీడీపీలో రక్షణ రంగానికి అదనపు పెంపు 2 శాతం ఉంచాలనుకున్నాయి. అయితే ప్రస్తుతం నాటో కూటమిలో ఉన్న 31 దేశాల్లో కేవలం ఏడు దేశాలు మాత్రమే రక్షణ రంగ వ్యయాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు నాటో దేశాల్లో అలజడికి కారణమవుతున్నాయి.