మోడీ పాలనపై యూరోపియన్ పార్లమెంటు కన్నెర్ర.. ఏకగ్రీవ తీర్మానం!
క్రిస్టియన్లు మైనారిటీలుగా ఉన్న భారత్‌లో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని యూరోపియన్ నాయకులు ఆరోపించారు.
By: Tupaki Desk | 13 April 2025 6:00 AM ISTప్రత్యేక విదేశాంగ విధానం తీసుకువచ్చి.. భారత దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తం చేస్తున్నామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై యూరోపియన్ యూనియన్ కన్నెర్ర చేసింది. ఈ యూనియన్‌లో 27 దేశాలు ఉన్నాయి. వీరంతా ముక్తకంఠంతో ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై విరుచుకుపడ్డారు. ఒకరు కాదు .. ఇద్దరు కాదు.. దాదాపు 26 దేశాలకు చెందిన అధినేతలు మోడీ విధానాలను ఎండగట్టారు. ప్రత్యేకంగా 2014 నుంచి భారత దేశంలో జరుగుతున్న పరిణామాలను కూలంకషంగా వారు వివరించారు. తాజాగా యూరోపియన్ యూనియన్ సర్వసభ్య సమావేశం ఐక్యరాజ్యసమితిలో జరిగింది.
ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాల్లో 26 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చలో భారత్‌లో మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలను వారు తీవ్రంగా గర్హించారు. అతి పెద్ద ప్రజాస్వామ్యమని.. ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తామని చెబుతున్న భారత్‌లో మత స్వేచ్చ లేదని అన్నారు. జర్నలిస్టులకు స్వేచ్ఛలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఏం రాయాలో.. ఏం రాయకూడదో కూడా వారే నిర్ణయిస్తారు'' అని వ్యాఖ్యానించారు. మహిళా నాయకులు కూడా.. మోడీ పానలపై నిప్పులు చెరిగారు. మహిళలకు కూడా భద్రత కరువైందని ఆరోపించారు.
క్రిస్టియన్లు మైనారిటీలుగా ఉన్న భారత్‌లో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని యూరోపియన్ నాయకులు ఆరోపించారు. ముస్లిం మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారని.. ఇవన్నీ 2014 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేనని ప్రధాని మోడీ పేరును ప్రత్యేకంగా పేర్కొంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు భారత్‌లో పర్యటించాల్సిన అవసరం ఉందని తీర్మానం చేశారు. మోడీ విధానాలతో దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మణిపూర్ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. అదేవిధంగా ఇతర చట్టాలను కూడా ప్రస్తావించారు. అయితే.. యూరోపియన్ దేశాలకు.. భారత్ వాణిజ్య పరంగా కీలక దేశమని పేర్కొనడం గమనార్హం.
కాగా.. భారత ప్రధానిపై యూరోపియన్ యూనియన్ ఇంత భారీ ఎత్తున దాడి చేయడం ఇదే తొలిసారి. ఒక రకంగా చెప్పాలంటే.. ఇది మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అని మేధావులు పేర్కొంటున్నారు. భారత ప్రధానిపై ఇంత దారుణమైన దాడి ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. భారతదేశ ముఖ చిత్రం ఇప్పుడు మతపరంగా తీవ్రవాద, అణచివేత, & అసహనంతో కూడిన దేశంలా ఉందని యూరోపియన్ నేతలు పేర్కొనడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇది మన వృద్ధి, పురోగతి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
