Begin typing your search above and press return to search.

నాలుగు లక్షలకు పైగా కిట్ క్యాట్ బార్లు చోరీ.. ఎలా సాధ్యమైందంటే?

4 లక్షల కిట్‌క్యాట్ బార్ల అపహరణ, దీని వెనుక ఉన్న అంతర్జాతీయ స్మగ్లింగ్ కోణాలను పరిశీలిస్తే..

By:  Tupaki Political Desk   |   30 March 2026 10:33 AM IST
నాలుగు లక్షలకు పైగా కిట్ క్యాట్ బార్లు చోరీ.. ఎలా సాధ్యమైందంటే?
X

యూరప్‌లో జరిగిన 'స్వీట్ హీస్ట్' గురించి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. హాలీవుడ్ సినిమాలో దొంగతనాన్ని తలపిస్తోంది. దాదాపు 4 లక్షల కిట్‌క్యాట్ చాక్లెట్ బార్లను, అది కూడా 12 టన్నుల బరువున్న లోడ్‌ను ట్రక్కుతో సహా ఎత్తుకెళ్లడం అంటే అది మామూలు దొంగతనం కాదు. ఇటలీ నుంచి పోలాండ్‌కు వెళ్లాల్సిన ఈ భారీ కన్సైన్‌మెంట్ మధ్యలోనే మాయమవ్వడం నెస్టే (Nestlé) సంస్థను తీవ్రమైన షాక్‌కు గురి చేసింది. యూరప్‌లో పెరుగుతున్న కార్గో దొంగతనాలకు ఈ ఘటన ఒక నిలువుటద్దం. 4 లక్షల కిట్‌క్యాట్ బార్ల అపహరణ, దీని వెనుక ఉన్న అంతర్జాతీయ స్మగ్లింగ్ కోణాలను పరిశీలిస్తే..

పక్కా ప్లాన్‌తో దొంగతనం!

ఇటలీలోని నెస్టే ప్లాంట్ నుంచి సుమారు 4,13,793 కిట్‌క్యాట్ బార్లతో కూడిన ట్రక్కు పోలాండ్ గమ్యస్థానానికి బయలుదేరింది. గ్యాంగ్ చాలా చాకచక్యంగా ఈ లోడ్‌ను దారి మళ్లించింది. గమ్యస్థానానికి చేరుకోవాల్సిన సమయం దాటిపోయినా ట్రక్కు రాకపోవడంతో నెస్టే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 12 టన్నుల చాక్లెట్లు అంటే అది ఒక చిన్నపాటి గోదాం నిండా సరిపోయే స్టాక్. ఇంత పెద్ద మొత్తాన్ని ఎవరికీ అనుమానం రాకుండా తరలించడం వెనుక ఒక వ్యవస్థీకృత ముఠా హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

బ్లాక్ మార్కెట్ ముప్పు

నెస్టే సంస్థ ఈ దొంగతనంపై తీవ్రంగా స్పందిస్తూ వినియోగదారులను, రిటైలర్లను అప్రమత్తం చేసింది. దొంగిలించబడిన ఈ 4 లక్షల కిట్‌క్యాట్ బార్లు తక్కువ ధరలకు అనధికారిక మార్కెట్లలో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. ఈ చాక్లెట్లను సరైన ఉష్ణోగ్రత వద్ద భద్రపరచకపోతే అవి పాడైపోయే అవకాశం ఉంది. కాలం చెల్లిన లేదా పాడైపోయిన చాక్లెట్లను కొత్త ప్యాకింగ్‌లో విక్రయించే ప్రమాదం ఉందని సంస్థ హెచ్చరించింది. అనుమానాస్పదంగా తక్కువ ధరకు కిట్‌క్యాట్ చాక్లెట్లు ఎవరైనా విక్రయిస్తే వాటి బ్యాచ్ నంబర్లను తనిఖీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

పెరుగుతున్న కార్గో దొంగతనాలు!

కొన్నేళ్లుగా యూరప్ ఖండంలో హైవేలపై వెళ్లే ట్రక్కులను దోచుకోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే దొంగిలించేవారు. కానీ ఇప్పుడు ఆహార పదార్థాలు, చాక్లెట్లు, మద్యం వంటి నిత్యావసరాలకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో దొంగలు వీటిపై పడుతున్నారు. సరిహద్దులు దాటి వెళ్లేటప్పుడు ట్రక్కుల భద్రత కోసం జీపీఎస్ ట్రాకర్లు ఉన్నప్పటికీ, హ్యాకర్లు ఆ సిగ్నల్స్‌ను జామ్ చేసి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు.

అంతర్జాతీయ ముఠాల హస్తం?

ఇటలీ, పోలాండ్ పోలీసులు సంయుక్తంగా ఈ 'చాక్లెట్ హీస్ట్'పై విచారణ జరుపుతున్నారు. ఈ దొంగతనంలో ట్రక్కు డ్రైవర్ ప్రమేయం ఉందా..? లేదా దారిలో ఎక్కడైనా హైజాక్ జరిగిందా..? అనే కోణంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 12 టన్నుల స్టాక్‌ను నిల్వ చేయడానికి పెద్ద గోదాములు అవసరం. కాబట్టి స్థానిక గ్యాంగ్‌ల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. హ్యాకర్లు ఏవైనా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ ఆర్డర్‌ను దక్కించుకున్నారా? అనే కోణంలో డిజిటల్ విచారణ సాగుతోంది.

బ్రాండ్ ప్రతిష్ట!

4 లక్షల కిట్‌క్యాట్ బార్ల విలువ కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ నష్టాన్ని భరించినప్పటికీ, మార్కెట్‌లో సడన్ గా స్టాక్ కొరత ఏర్పడడం నెస్టేకు ఇబ్బందికరంగా మారింది. దొంగిలించబడిన స్టాక్ మార్కెట్లోకి వస్తే బ్రాండ్ పేరు దెబ్బతింటుందనేది కంపెనీ ప్రధాన ఆందోళన. అందుకే అధికారిక డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు.

కిట్ క్యాట్ దొంగలకు బాగా నచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే 4 లక్షల బార్లతో ఉన్న పెద్ద కంటైనర్ చోరీ చేశారు. వినడానికి జోక్ గా ఉన్నా, అంతర్జాతీయ రవాణా వ్యవస్థలోని భద్రతా లోపాలను ఈ ఘటన ఎత్తిచూపుతోంది. యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇలాంటి కార్గో దొంగతనాలు జరుగుతుంటే, రవాణా సంస్థలు తమ భద్రతా ప్రమాణాలను ఎంతలా పెంచుకోవాలో అర్థమవుతోంది. దొంగలు ఆ చాక్లెట్లను తినకముందే పోలీసులు పట్టుకుంటారో లేదో చూడాలి!