Begin typing your search above and press return to search.

యూరప్‌లో అంధకారం.. విమానాలు నిలిచిపోయాయి.. మెట్రోలు ఆగిపోయాయి

బ్లాక్‌అవుట్ కారణంగా ట్రాఫిక్ లైట్లు ఆగిపోయాయి. మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల రోడ్ల మీద గందరగోళం ఏర్పడింది.

By:  Tupaki Desk   |   28 April 2025 8:38 PM IST
యూరప్‌లో అంధకారం.. విమానాలు నిలిచిపోయాయి.. మెట్రోలు ఆగిపోయాయి
X

యూరప్ లోని అనేక దేశాల్లో ఒక్కసారిగా భారీ విద్యుత్ సంక్షోభం తలెత్తింది. స్పెయిన్, పోర్చుగల్‌తో సహా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్లాక్‌అవుట్ ఏర్పడింది. దీని కారణంగా విమాన సేవలు, మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. మధ్యాహ్నం సమయంలో మాడ్రిడ్ నుంచి లిస్బన్ వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు చీకటిలోనే ఉండిపోయారు. ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి రెండు దేశాలు వెంటనే చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం దీనికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది సైబర్ దాడి కూడా అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

స్పెయిన్ నేషనల్ గ్రిడ్ ఆపరేటర్ ‘రెడ్ ఎలెక్ట్రికా’ ఓ ప్రకటనలో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి సంబంధింత కంపెనీలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, పోర్చుగల్ గ్రిడ్ ఆపరేటర్ ‘ఈ-రెడెస్’ మాట్లాడుతూ.. ఈ సంక్షోభం యూరోపియన్ పవర్ గ్రిడ్‌లో తలెత్తిన సమస్య కారణంగా ఏర్పడిందన్నారు. ప్రాథమిక దర్యాప్తులో వోల్టేజ్ వల్ల ఈ సమస్య ఏర్పడిందని అందువల్లే విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్నారు.

బ్లాక్‌అవుట్ కారణంగా ట్రాఫిక్ లైట్లు ఆగిపోయాయి. మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల రోడ్ల మీద గందరగోళం ఏర్పడింది. ఆసుపత్రులలో బ్యాకప్ జనరేటర్ల సహాయంతో ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతున్నాయి. అయితే అధికారులు ఆసుపత్రి సిబ్బందికి కంప్యూటర్లు మూసివేయాలని, విద్యుత్ ఆదా చేసే ఇతర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో ప్రస్తుతం స్పష్టంగా తెలియదు. స్పెయిన్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఓ కమిటీని ఏర్పాటుచేశారు.

బ్లాక్‌అవుట్ వెనుక సైబర్ దాడి ఉండవచ్చనే అవకాశాన్ని స్పెయిన్ అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. యూరప్‌లో ఇంతకు ముందు కూడా చిన్న చిన్న టెక్నికల్ లోపాల వల్ల పెద్ద బ్లాక్‌అవుట్‌లు జరిగాయి. 2003లో స్విట్జర్లాండ్‌లో ఒక చెట్టు విద్యుత్ లైన్‌ను తెంచడంతో ఇటలీ మొత్తం చీకటిలో మునిగిపోయింది. కాబట్టి ఈసారి కూడా అలాంటి సాంకేతిక సమస్య, లేదా సైబర్ దాడి రెండింటినీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్పెయిన్ ప్రభుత్వం ప్రజలకు టెలిఫోన్ సెంటర్‌లు ఇప్పటికే కాల్స్‌తో నిండిపోయి ఉన్నందున అనవసరమైన కాల్స్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తోంది.