Begin typing your search above and press return to search.

భారత్ వైపు బూడిద మేఘాలు.. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే?

ఉత్తర భారతం ఈ కాలంలో చాలా సమస్యలు ఎదుర్కొంటుుంది. చలికాలం, పొగమంచు, కాలుష్యం, శ్వాసకోశ ఇబ్బందులు.. ప్రతిసారీ ఇదే కథ.

By:  Tupaki Desk   |   25 Nov 2025 12:03 PM IST
భారత్ వైపు బూడిద మేఘాలు.. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే?
X

ఉత్తర భారతం ఈ కాలంలో చాలా సమస్యలు ఎదుర్కొంటుుంది. చలికాలం, పొగమంచు, కాలుష్యం, శ్వాసకోశ ఇబ్బందులు.. ప్రతిసారీ ఇదే కథ. కానీ ఈసారి మరో కొత్త ప్రమాదం వచ్చేసింది. మన దేశం వైపు అగ్నిపర్వత బూడిద మేఘం దూసుకొస్తుందన్న సమాచారం ప్రజల్లో ఆందోళనను రేకెత్తించింది. ఎక్కడో ఇథియోపియాలో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనం ప్రభావం.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భార‍తదేశంపై పడుతుందనడమే ఒక గ్లోబల్ రియాలిటీని గుర్తుచేస్తోంది. ఒక మూలలో జరిగిన ప్రకృతి ఘటన మరొక చివరికి ముప్పు తెచ్చేస్తోంది. అగ్నిపర్వత విస్ఫోటనం అంటే కేవలం అగ్ని కీలలు కాదు.. ఆగ్రహంతో బయటకు విసిరేసిన బూడిద, సల్ఫర్ డైఆక్సైడ్, సన్నని రాళ్లు, గాజు ముక్కలు ఇవన్నీ కలిసి ఆకాశంలో ఒక మసక మబ్బు తయారైంది. దీన్ని చూసిన వారికి ఇది సాధారణ మేఘంలా అనిపించినా.. వాస్తవానికి ఇది ఆకాశంలో ఘోర ప్రమాదం లాగా పని చేస్తుంది. కారణం స్పష్టం ఈ బూడిదలోని సూక్ష్మకణాలు గాలిలోకి చేరితే ఆరోగ్యానికి ప్రమాదం.. విమానాల ఇంజిన్లకు మాత్రం మహా ముప్పు.

45 వేల అడుగుల ఎత్తుకు చేరే అవకాశం..!

ఇథియోపియాలోని ‘హేలీ గుబ్బి’ అగ్నిపర్వతం విస్ఫోటనం ఈ పెద్ద మేఘానికి కారణం. ఈ బూడిద 15 వేల అడుగులు, 25 వేల అడుగులు.. కొన్నిసార్లు 45 వేల అడుగుల ఎత్తులో కూడా వ్యాపించగలదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అది ఎర్రసముద్రం దాటి అరేబియా ప్రాంతంలోకి ప్రవేశించి, అక్కడి నుంచి భారత్ వైపు ప్రయాణిస్తోంది. గుజరాత్, ఢీల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హరియాణ, హిమాలయ ప్రాంతాలు ఈ రాష్ట్రాలు ప్రభావితమయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా పెట్టింది.

తీవ్రమైన ప్రభావం..

వరల్డ్ మ్యాప్‌పై చూసుకుంటే, ఈ బూడిద మేఘం ప్రయాణం ఒక నిమిషం కథలా కనిపిస్తుంది. కానీ దాని వెనుక ఉన్న శాస్త్రం, ప్రభావం మాత్రం చాలా క్లిష్టం. ముఖ్యంగా విమాన ప్రయాణాలకిది పెద్ద సవాలుగా మారుతుంది. విమానం ఇలాంటి బూడిద మేఘాల్లోకి ప్రవేశిస్తే విజిబిలిటీ తగ్గుతుంది, పైలట్లు దిశను స్పష్టంగా గుర్తించలేరు. దీనితో పాటు ఇంజిన్‌లో బూడిద కణాలు చేరితే, ఇంజిన్ వేడెక్కి ఆగిపోవడం కూడా జరిగే ప్రమాదం ఉంది. ప్రపంచ విమానయాన చరిత్రలో 1980 ప్రాంతంలో ఇలాంటి రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తూ ఆ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. లేదంటే పరిణామాలు భయంకరంగా ఉండేవి.

రెడ్ అలర్ట్ జారీ..

ఈ నేపథ్యంలో డీజీసీఏ వెంటనే అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. బూడిద మేఘాలు కదులుతున్న దిశలో విమానాలు ఎగరొద్దని, ప్రయాణ లెవల్స్‌ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఇంజిన్‌లో ఏవైనా అసాధారణ శబ్ధాలు వినిపించినా, క్యాబిన్‌లో దుర్వాసన వచ్చినా వెంటనే రిపోర్ట్ చేయాలని సూచించింది. ఎయిర్ లైన్స్ కూడా త్వరగా స్పందించాయి. ఇండియా అంతటా పలు సర్వీసులు రద్దు.. మరికొన్ని విమానాలు ఆలస్యం అవుతున్నాయి.

శ్వాసకోశాలకు పెద్ద ముప్పు..

అయితే బూడిద అంటే ప్రమాదం కేవలం విమానాలకు మాత్రమే కాదు. ఈ చిన్న కణాలు గాలిలో కలిస్తే శ్వాసకోశాలకు పెద్ద ముప్పే. కళ్లలో దురద, చర్మ సమస్యలు, ఆస్తమా ఉన్నవారికి తక్షణ ఇబ్బందులు కలుగుతాయి. అందుకే అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు. మాస్క్ తప్పనిసరి. గాలి శుద్ధీకరణ పరికరాలు ఉన్న ఇళ్లలో వాటిని ఉపయోగించాలని సూచిస్తున్నారు. విండోలు మూసి ఉంచడం, బయటికి వచ్చినప్పుడల్లా ముఖాన్ని రక్షించడం ఇంత చిన్న జాగ్రత్తలు కూడా పెద్ద ప్రమాదాన్ని నివారిస్తాయి.

శక్తివంతమైన ప్రకృతి..

ఇవన్నీ చూసినప్పుడు ఒక నిజం మన ముందుకొస్తుంది ప్రకృతి మనం అనుకున్నదానికంటే శక్తివంతమైందని, సరిహద్దులు లేని గాలిలో ప్రయాణించే బూడిదను ఆపడం మనుషుల చేతుల్లో లేదు. కానీ దాని ప్రభావం తగ్గించుకోవడం మన బాధ్యత. ప్రకృతి మార్పులు, గ్లోబల్ కనెక్టివిటీ, వాతావరణ వ్యవస్థల ప్రభావం ఇవన్నీ మన జీవితాల్లో ఎంత ముఖ్యమో అనేది ఇలాంటి ఘటనల వల్ల తెలుస్తోంది. అగ్నిపర్వతం పేలింది ఇథియోపియాలో ప్రభావం మొదట పడేది అరేబియాలో.. కానీ భారత్ కు కూడా కొంతలో కొంత ఇబ్బంది తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న ఘటన పెద్ద ప్రభావం.