ప్రపంచంలోనే పెద్దమ్మ.. 115 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎథెల్
అసలు 115 ఏళ్లు బతకడానికి ఈ బామ్మ ఏం చేసిందో తెలుసా? ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా ఉండడమే తన సుదీర్ఘ జీవిత రహస్యమని ఎథెల్ స్వయంగా చెప్పారు.
By: Tupaki Desk | 4 May 2025 3:00 AM ISTప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్సు కలిగిన వ్యక్తిగా ఇంగ్లాండ్‌కు చెందిన ఎథెల్ కేటర్‌హామ్ (Ethel Caterham) నిలిచారు. 116 ఏళ్లు జీవించిన సిస్టర్ ఇనా కనబారో లుకాస్ ఇటీవల కన్నుమూయడంతో ఇప్పుడు 1909 ఆగస్టు 21న జన్మించిన ఎథెల్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ఆమె కేంబెర్లీలోని హాల్‌మార్క్ లేక్‌వ్యూ నర్సింగ్ హోమ్‌లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
అసలు 115 ఏళ్లు బతకడానికి ఈ బామ్మ ఏం చేసిందో తెలుసా? ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా ఉండడమే తన సుదీర్ఘ జీవిత రహస్యమని ఎథెల్ స్వయంగా చెప్పారు. వినడానికి చాలా సింపుల్‌గా ఉన్నా కానీ ఆచరించడానికి ఎంతో ఓర్పు, సహనం ఉండాలి.
అంతేకాదు, ఈ ఆసక్తికరమైన బామ్మగారి గురించి ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి. ఆమె తన 18 ఏళ్ల వయస్సులో మన భారతదేశానికి వచ్చారట. ఇక్కడ ఒక బ్రిటిష్ కుటుంబంలో దాదాపు మూడేళ్ల పాటు పిల్లల సంరక్షకురాలిగా పనిచేశారు. అంటే మన భారత గడ్డపై కూడా ఆమె కొంతకాలం గడిపారన్నమాట.
1909లో జన్మించిన ఈమె రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. ఎన్నో చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచారు. ఒక శతాబ్దానికి పైగా జీవితాన్ని ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా గడిపిన ఎథెల్ నిజంగా అందరికీ ఒక స్ఫూర్తి. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఆమె తన జీవితంతో నిరూపించారు.
ప్రస్తుతం 115 ఏళ్ల వయస్సులో కూడా ఆమె ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారని, నర్సింగ్ హోమ్ సిబ్బంది చెబుతున్నారు. ఆమె తన జ్ఞాపకాలను అందరితో పంచుకుంటూ.. తన అనుభవాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారట. నిజంగా ఎథెల్ కేటర్‌హామ్ ఒక అద్భుతమైన వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
