Begin typing your search above and press return to search.

గజ్వేల్ లో ఈటల పోటీ వెనుక అన్ని లెక్కలు ఉన్నాయా?

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ బరిలోకి దిగితే తాను అక్కడ బరిలోకి దిగుతానని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

By:  Tupaki Desk   |   23 Oct 2023 4:30 PM GMT
గజ్వేల్ లో ఈటల పోటీ వెనుక అన్ని లెక్కలు ఉన్నాయా?
X

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ బరిలోకి దిగితే తాను అక్కడ బరిలోకి దిగుతానని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పినట్లే.. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో పోటీకి దిగనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తుండటం తెలిసిందే. గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ సైతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనూ బరిలోకి దిగుతున్నారు.

పైకి కనిపిస్తున్నట్లుగా.. కేసీఆర్ మీద కసితో ఈటల రాజేందర్ పోటీ చేయట్లేదని.. ఆయన్ను గెలిపించేందుకు వీలుగా గజ్వేల్ బరిలోకి దిగుతున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారిన ఈ చర్చలోకి వెళితే.. కేసీఆర్ - ఈటల మధ్య జరుగుతున్న పోరు స్నేహపూర్వక పోటీనే తప్పించి.. కేసీఆర్ ను ఓడించటమే లక్ష్యంగా బరిలోకి దిగట్లేదన్న మాట వినిపిస్తోంది. బీజేపీ - బీఆర్ఎస్ మధ్య తెర వెనుక అనుబంధం ఉన్నట్లే.. కేసీఆర్ - ఈటల మధ్య పోటీ వేళలోనూ అసలు లెక్కలు వేరే ఉన్నాయన్న వాదన ఆసక్తికరంగా మారింది.

ఇంతకూ ఈ వాదనకు బేస్ ఏమిటి? ఇందులో నిజం ఎంత? అన్న విషయంలోకి వెళితే.. గజ్వేల్ లో భారీగా ఉన్న ముదిరాజ్ ఓట్లను చీల్చేందుకే ఈటల బరిలోకి దిగుతున్నట్లు చెబుతున్నారు. నిజంగానే కేసీఆర్ మీద ఈటలకు కసి ఉంటే.. ఆయన పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయటం బాగుంటుందే తప్పించి.. కేసీఆర్ కు మేలు చేసేలా ఎందుకు పోటీ చేస్తున్నారని చెబుతున్నారు.

ఎవరు అవునన్నా.. కాదన్నా గజ్వేల్ లో కేసీఆర్ కు సానుకూల వాతావరణం లేదంటున్నారు. పేరుకు సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే అయినప్పటికీ స్థానిక నేతలకు ఎవరికి గుర్తింపు లేదని చెబుతున్నారు. దీనికి తోడు.. ముఖ్యమంత్రి నియోజకవర్గమే అయినప్పటికీ.. డెవలప్ మెంట్ యాక్టివిటీస్ పెద్దగా జరగలేదన్న వాదన ఉంది. ఇలాంటి వేళ.. గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో.. ముందుచూపుతో కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

అయితే.. తనను రెండుచోట్ల నుంచి పోటీ చేయాలన్న వినతుల నేపథ్యంలోనే తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చెబుతున్నా.. అందులో వాస్తవం లేదంటున్నారు. అంతేకాదు.. గజ్వేల్ లో ఈటల పోటీ కారణంగా.. గులాబీ బాస్ గెలుపు ఖాయమని చెబుతున్నారు. ఎందుకంటే.. నియోజకవర్గంలోని ముదిరాజ్ ల ఓట్లు ఎక్కువగా ఈటల రాజేందర్ కు పడితే.. మేలు జరిగేది కేసీఆర్ కే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈటల బరిలో నిలచోని పక్షంలో కాంగ్రెస్ కు పడే వీలుంది.

కానీ.. ఈటల కారణంగా ఓట్లు చీలతాయి. అది.. అంతిమంగా కేసీఆర్ కు మేలు జరుగుతుందని చెప్పక తప్పదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండుచోట్ల పోటీ చేస్తున్న కేసీఆర్.. రెండు చోట్ల గెలిస్తే దేన్ని వదులుకుంటారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే..కామారెడ్డి బరిలో నిలుచోవటానికి కారణం.. కుమార్తె కవితకు మరింత బలాన్ని చేకూర్చటం కోసమే అన్న వాదన వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంతన్నది కాలమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.