Begin typing your search above and press return to search.

మోడీ స్థానంపై గురి పెట్టిన ఈటల!

కాగా... వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరీ స్థానం నుంచి భారీ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Jan 2024 4:18 AM GMT
మోడీ స్థానంపై గురి పెట్టిన ఈటల!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించినన్ని, ఆశించినన్ని స్థానాలు సంపాదించుకోలేకపోయిన భారతీయ జనతా పార్టీ... వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. ఈ సమయంలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాల్లో గెలుపొంది కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తెలంగాణ నుంచి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని టి.బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తుంది.

ఈ సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న పలువురు సీనియర్లు లోక్ సభ నియోజకవర్గాల ఎంపికపై దృష్టిపెడితే... ఇప్పటికే తమ తమ స్థానాలు ఉన్నవారు జనాల్లో తిరుగుతున్నారు! ఈ సమయలో... వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన మనసులోని మాటను వెల్లడించారు.

అవును... నిన్నమొన్నటివరకూ... ఈటెల రాజేందర్ కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరి అక్కడనుంచి పోటీకి సిద్ధంగా ఉన్న బండి సంజయ్ పరిస్థితి ఏమిటనే కామెంట్లూ వినిపించాయి. మరోపక్క ఈటల కాంగ్రెస్ టిక్కెట్ పై కరీంనగర్ నుంచి పోటీచెయబోతున్నరనే చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో ఆ విషయాలపై స్పందించిన ఈటల... కరీంనగర్‌ లో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి.. తాను అక్కడ టికెట్ ఆశించడం లేదని తెలిపారు. ఇదే సమయంలో... తనకు మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అధిష్టానాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా.. తనకు అధిష్టానం ఎలా చెబితే అలా వింటానని ఈటల స్పష్టం చేశారు.

ఇక సోషల్ మీడియాలో తన గురించి చిల్లర మల్లర ప్రచారం చేస్తున్నారని మండిపడిన ఈటల రాజేందర్.. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని కోరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈటల చెప్పుకొచ్చారు.

కాగా... వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరీ స్థానం నుంచి భారీ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇప్పటికే ఈ స్థానం నుంచి పోటీచేయాలని బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్ రావు.. ల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్), పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అధినేత మల్క కొమురయ్య.. మొదలైన వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తుంది.

ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని, అందుకు మల్కాజిగిరి నియోజకవర్గం సూటవుతుందని పలువురు నేతలు ప్రధానికి సూచించినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈస్థాయిలో కాంపిటేషన్ ఉన్న మల్కాజిగిరి స్థానంపై ఈటల గురిపెట్టారని చెబుతున్నారు!