Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఎన్నిక‌ల‌పై ఈట‌ల కీల‌క ప్ర‌క‌ట‌న‌... కేసీఆర్‌కు మింగుడు ప‌డ‌దా?

ఈ కోవ‌లోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీ , ఆ పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్‌, యువ‌నేత కేటీఆర్‌పై బీజేపీ ముఖ్య‌నేత ఈట‌ల రాజేంద‌ర్ విరుచుకుప‌డ్డారు.

By:  Tupaki Desk   |   28 Sep 2023 2:30 AM GMT
తెలంగాణలో ఎన్నిక‌ల‌పై ఈట‌ల కీల‌క ప్ర‌క‌ట‌న‌... కేసీఆర్‌కు మింగుడు ప‌డ‌దా?
X

అధికార పార్టీ ఎత్తులు, ప్ర‌తిప‌క్షాల పై ఎత్తుల‌తో తెలంగాణ‌లో ఎన్నిక‌ల హీట్ తారాస్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ రాజ‌కీయాల్లోని ప్ర‌ముఖ నేత‌లు పూర్తి ఫాంలోకి వ‌చ్చేయ‌డంతో రాజ‌కీయం రంజుగా మారింది. ఈ కోవ‌లోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీ , ఆ పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్‌, యువ‌నేత కేటీఆర్‌పై బీజేపీ ముఖ్య‌నేత ఈట‌ల రాజేంద‌ర్ విరుచుకుప‌డ్డారు. రాబోయే ఎన్నిక‌ల షెడ్యూల్ నుంచి మొద‌లుకొని ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల వ‌ర‌కు ఈట‌ల సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో ప‌ర్య‌టించి బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించ‌నున్న నేప‌థ్యంలో ఈ సభ ఏర్పాట్లను ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పై ఫైర్ అయ్యారు.

ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న తీరును చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని ఈటెల రాజేంద‌ర్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీపై గతంలో వారు చేసిన సానుకూల వ్యాఖ్యలను, ఇప్పుడు చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలను ఉదహరిస్తూ నిప్పులు చెరిగారు. 'ప్రధాని అంటే ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అని అసెంబ్లీ సాక్షిగా ప్రధాని మోడీ గురించి సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ప్రధాని గురించి చిన్నగా మాట్లాడినప్పుడు దేశ ప్రధాని గౌరవించుకోవాల్సిన సంస్కారం మన మీద ఉంది అని హిత‌బోధ చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే ప‌లు ప్రాజెక్టులను నిర్మించుకోగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రధానిపై విమర్శలు చేస్తున్నారు?' అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

గురివింద నలుపు దానికి తెలియనట్లుగా.. మీ కింద ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు అంటూ బీఆర్ఎస్ నేత‌ల‌ను ఉద్దేశించి ఈట‌ల రాజేంద‌ర్ వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్ రూమ్ రాదేమో.. సంక్షేమ పథకాలు రాదేమో.. అని భయానికి మీ పాట పాడుతున్నారు తప్ప ప్రజల గుండెల్లో ప్రజల అంతరంగంలో కేసీఆర్‌ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని ఆరాటపడుతున్న విషయం మీకు తెలియదు.తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు. అక్టోబ‌ర్‌ 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. నవంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. . తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ జెండా ఎగరవేయబోతున్నాం.' అంటూ ఈటల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.