మనిషా..పశువా..? ’ఈటెల‘ మాటల దాడి.. పార్టీలోని ఆ ప్రత్యర్థి మీదేనా?
శుక్రవారం ఈటలను శామీర్ పేట (ఆయన నివాసం ఉండే ప్రాంతం) కుట్రదారుగా పేర్కొంటూ ప్రత్యర్థి వర్గం విమర్శలు చేసింది.
By: Tupaki Desk | 19 July 2025 5:08 PM ISTతెలంగాణ బీజేపీలో మళ్లీ రగడ... ఉమ్మడి కరీంనగర్ రాజకీయాలు వీధికెక్కుతున్నాయి.. హుజూరాబాద్ నియోజకవర్గం గురించి శుక్రవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానా? అన్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శనివారం స్పందించారు. అసలు ఇంతకూ ఏం జరుగుతున్నదంటే? ఈటల రాజేందర్ బీఆర్ఎస్ తరఫున ఉమ్మడి కరీంనగర్ లోని హుజూరాబాద్ నియోజకవర్గానికి 2024 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2021లో బీజేపీలోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో గెలుపొందినా, 2023లో ఓడిపోయారు. 2024 ఎంపీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి గెలిచారు.
కాగా, లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. అయితే, కరీంనగర్ ఎంపీగా పోటీచేసిన బండి సంజయ్ కు ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్ లో మెజారిటీ రాకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. హుజూరాబాద్ లో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేశారని ఆయన వ్యాఖ్యనించడం దుమారం రేపాయి. దీనికితోడు ఈటల, సంజయ్ ఇద్దరూ బీజేపీ రాష్ట్ర చీఫ్ పదవికి పోటీ పడడం విభేదాలు మరింత ముదిరాయి.
శుక్రవారం ఈటలను శామీర్ పేట (ఆయన నివాసం ఉండే ప్రాంతం) కుట్రదారుగా పేర్కొంటూ ప్రత్యర్థి వర్గం విమర్శలు చేసింది. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేశారు. ఆయన ప్రధాన అనుచరుడు, హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఈటల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. శామీర్ పేటలోని తన ఇంట్లో నిర్వహించిన ఈ సమావేశానికి హుజూరాబాద్ నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. బీజేపీలో స్థానిక నేతలు ఇబ్బంది పెడుతున్నారని, పదవులు ఇవ్వడం లేదని ఈటల పరిశీలనకు తీసుకెళ్లారు.
కార్యకర్తలను ఉద్దేశించి ఈటల మాట్లాడుతూ.. పరోక్ష్యంగా ప్రత్యర్థిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరులతో, ధీరులతో కొట్లాడతాం అని, కుట్రదారులు, ద్రోహులతో కాదని పేర్కొన్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోం అని అన్నారు. ’కొడకా ఖబడ్దార్..!.. హుజూరాబాద్ గడ్డ మీద, ప్రతి ఊర్లో మనమే ఉంటాం. వార్డు సభ్యులుగా సర్పంచులుగా అన్నిచోట్లా మనమే‘‘ అని అన్నారు. తనపై కుట్రదారు విమర్శలను ఉద్దేశిస్తూ.. ’’వాడు సైకోనా శాడిస్టా మనిషా పశువా...’’? అంటూ నిప్పులు చెరిగారు. ’’నువ్వు ఏ పార్టీలో ఉన్నవో.. వెనుకెవదున్నది ఎవడో..!‘‘ అని వ్యాఖ్యానించారు. ఈటల వ్యాఖ్యల్లో నేరుగా ఎవరినీ ప్రస్తావించకున్నా.. ఎవరిని ఉద్దేశించినవో తెలుస్తోందని అంటున్నారు.
