కాళేశ్వరం అక్రమాలతో నాకేం సంబంధం? ఈటల సంచలన కామెంట్స్
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ కొనసాగుతోంది.
By: Tupaki Desk | 6 Jun 2025 1:46 PM ISTకాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఈటలను కమిషన్ ప్రశ్నించింది. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఈటల, రాజకీయ లబ్ధి కోసమే తమపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. కాళేశ్వరం అక్రమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆర్థిక మంత్రిగా తన పని కేవలం నిధులు కేటాయించడమేనని ఆయన స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ కొనసాగుతోంది. ఈ బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి భారాస ప్రభుత్వంలో ఈటల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రి మండలి తీర్మానాలపై కమిషన్ ఆయన్ను ప్రశ్నించింది.
ఇప్పటివరకు జరిగిన విచారణలో ప్రస్తుత, మాజీ ఈఎన్సీలు, సీఈలు, ఐఏఎస్ అధికారులు ఆర్థిక సంబంధమైన పలు అంశాలపై వాంగ్మూలాలు ఇచ్చారు. వారు పేర్కొన్న అంశాల ఆధారంగా ఆర్థిక సంబంధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు ఏవైనా చోటు చేసుకున్నాయా, నాటి నిర్ణయాలు ఏమిటి అనే విషయాలపై ఈటలను కమిషన్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ఈ విచారణకు 9న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ విచారణలు తెలంగాణ రాజకీయాల్లో మరింత ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.
