నేను తోలుబొమ్మను కాదు.. : ఈటల ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని ఈటల తెలిపారు. కానీ, రాజకీయాలను అడ్డు పెట్టుకుని జీవితాలతో ఆడుకోవడం సరికాదన్నారు.
By: Garuda Media | 10 July 2026 10:52 PM ISTబీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్.. తనపై వస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. తాను ఎవరో చెబితే.. ఎవరో ఆడిస్తే.. ఆడే రకం కాదని చెప్పారు. తాను రాజకీయాల్లో స్వయంగా ఎదిగానని, తనను ఎవరూ వెనుక ఉండి ప్రోత్సహించలేదని తెలిపా రు. ``నేనేమీ తోలు బొమ్మనుకాదు. ఎవరో ఆడిస్తే ఆడడానికి నేనేమీ తెలియనివాడిని కాదు. నాకు అన్నీ తెలుసు.`` అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.. అలాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెప్పారు.
రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని ఈటల తెలిపారు. కానీ, రాజకీయాలను అడ్డు పెట్టుకుని జీవితాలతో ఆడుకోవడం సరికాదన్నారు. తాను క్షేత్రస్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తినని, ఎవరూ తనకు వెనుక ఉండి చేయి పట్టుకుని నడిపించలేదన్నారు. ప్రజలే తనకు అండగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు ఎవరో చెబితే తాను మాట్లాడుతున్నాన ని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, కానీ.. తాను అంతగా దిగజారలేదన్నారు. తాను స్వయం ప్రకాశంగా రాజకీయాల్లోకి వచ్చానని ప్రజలు అండగా నిలిచారని తెలిపారు.
బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతోందని.. దీనిని తట్టుకోలేని వారే వివాదాలు సృష్టిస్తున్నారని ఈటల చెప్పుకొచ్చారు. అనేక ప్రాధాన్య అంశాలు ఉన్నాయని వాటిలో ప్రాజెక్టులు, రైతులు కూడా కీలకమేనని చెప్పారు. కాళేశ్వరం విషయంలో తెలిసీ తెలియకుండా కొందరు చేస్తున్న వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తాను వ్యక్తిగతంగా రైతుల పక్షాన అనేక పోరాటాలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎస్ ఆర్ ఎస్ పీ(శ్రీరాం సాగర్ ప్రాజెక్టు) కోసం తాను నడుం బిగించి పోరాడానని తెలిపారు. ఎస్ ఆర్ ఎస్ పీ వచ్చిన తర్వాతే.. రైతులకు మెరుగైన నీటి సదుపాయం లభించిందన్నారు.
కాళేశ్వరం కంటే ముందుగానే.. జలయజ్ఞం ప్రారంభమైందని.. ఆ క్రమంలోనే ఎస్ ఆర్ ఎస్ పీ కోసం తాను పోరాడి రైతులకు అండగా ఉన్నానని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రాక నిన్నటి వరకు ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు నీళ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ బాధ్యత ఎవరిది అని ప్రశ్నిస్తే.. తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని రైతులకు నీళ్లు ఇచ్చే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వారు కూడా తనను విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.
