Begin typing your search above and press return to search.

ఈటెల రూట్ ఎటు...టార్గెట్ చేస్తున్నారుగా ?

ఈటెల ఎందుకిలా మాట్లాడుతున్నారు ఆయన మనసులో ఏముంది అన్నది కమలనాధులలో చర్చగా మారింది.

By:  Tupaki Desk   |   23 Jun 2025 8:15 AM IST
ఈటెల రూట్ ఎటు...టార్గెట్ చేస్తున్నారుగా ?
X

బీజేపీలో నాలుగేళ్ళ క్రితం చేసిన తెలంగాణా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న ధీటైన పోరాటం చేసిన వారుగా ఈటెల రాజెందర్ కి ఎంతో పేరుంది. ఆయనది తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో పాతికేళ్ల చరిత్ర. అనేక పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అంతే కాదు మంత్రిగా కూడా వివిధ కీలక శాఖలకు పనిచేశారు కేసీఆర్ కి తలలో నాలుకగా ఆనాటి టీఆర్ఎస్ లో నంబర్ టూ గా వ్యవహరించేవారు.

అయితే తరువాత కాలంలో కేసీఆర్ తో విభేదాలు రావడంతో పాటు పార్టీలో కేటీఆర్ ప్రాధాన్యత పెరగడంతో ఈటెలని మెల్లగా సైడ్ చేస్తూ వచ్చారన్నారన్న భావం ఆయన వర్గంలో కలిగింది. ఇక కారు పార్టీకి తామూ యజమానులమని ఆయన ప్రకటించిన తరువాత దారులు వేరయ్యాయి. ఒక ఫైన్ మార్నింగ్ ఆయనను పార్టీ దూరం పెట్టేసింది.

ఆ సమయంలో విపక్షంలో కాంగ్రెస్ బీజేపీ రెండూ ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితేనే తెలంగాణాలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి రక్షణ ఉంటుందని భావించి కాంగ్రెస్ ఉంచి మంచి ఆహ్వానం ఉన్నా సరే ఈటెల కమలం తీర్ధం పుచ్చుకున్నారు. ఇది వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం అంటున్నారు.

ఇక చూస్తే బీజేపీలో చేరినా ఈటెలకు అక్కడ సరైన ప్రాధాన్యత లేదని అంటున్నారు. బీజేపీలో మొదటి నుంచి ఉన్న బలమైన బీసీ నేత బండి సంజయ్ కే ప్రాముఖ్యత ఉంటూ వచ్చింది. ఇక ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యారు. బీజేపీలో ఎవరు చేరినా టికెట్ ఇచ్చి ఎంపీ ఎమ్మెల్యేలు చేస్తారు కానీ పదవుల విషయానికి వచ్చేసరికి మాత్రం పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తారు అన్నది అందరికీ తెలిసిందే.

దాంతోనే ఈటెల వర్గం కలత చెందుతోంది అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఈటెలకు కచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. అయితే అది దక్కలేదు. ఇక తెలంగాణా బీజేపీ అధ్యక్ష పదవి కూడా దక్కలేదు. దాంతో ఆయన వర్గం అసంతృప్తితో రగులుతోంది అని అంటున్నారు. దాంతోనే ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విచారణ కమిటీ వేస్తే దాని ముందుకు వెళ్ళిన ఈటెల కేసీఅర్ ని సమర్ధిస్తూ మాట్లాడారు. కేసీఆర్ తప్పేమీ లేదని మీడియా ముఖంగానే చెప్పారు.

దాంతో బీజేపీ నేతలు షాక్ తిన్నారు. ఈటెల ఎందుకిలా మాట్లాడుతున్నారు ఆయన మనసులో ఏముంది అన్నది కమలనాధులలో చర్చగా మారింది. ఇక లేటెస్ట్ గా చూస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటెల మీద పరోక్ష విమర్శలు చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఏవరైనా సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సమర్ధించడం ముమ్మాటికీ తప్పు అని బండి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో ఉంటే పార్టీ స్టాండ్ మేరకే మాట్లాడాలని అంతే తప్ప వ్యక్తిగతాలు ఎవరికీ ఉండరాదని ఈటెలకు స్ట్రాంగ్ గానే చెప్పేశారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని అవినీతి అక్రమాలలో కూడుకున్న ప్రాజెక్ట్ అది అని బండి సంజయ్ అన్నారు.

అలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సమర్ధించడం ఎంత మాత్రం మంచిది కాదని ఈటెలకు సూచించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతితో పాటు ఫోన్ ట్యాపింగ్ మీద కూడా సీబీఐ విచారణకు ఆయన డిమాండ్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఈటెల పార్టీ స్టాండ్ కి యాంటీగా వెళ్తున్నారు అని బండి సంజయ్ చెప్పకనే చెప్పారా అన్న చర్చ సాగుతోంది.

మరో వైపు చూస్తే ఈటెల బీఆర్ఎస్ నేతలకు మళ్ళీ టచ్ లోకి వచ్చారని గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఈటెల బీఆర్ఎస్ లో తిరిగి చేరుతారని ఆయనను చేర్చుకోవడానికి కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం సుముఖంగా ఉందని కూడా గాసిప్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరి ఈటెల రూట్ ఎటూ అన్న చర్చ ఒక వైపు సాగుతూంటే బీజేపీలో ఆయనను టార్గెట్ చేస్తున్నది ఎవరు అన్నది మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా బలమైన బీసీ నేత ఈటెల కనుక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే కనుక కచ్చితంగా అది బీజేపీకి దెబ్బ అని అంటున్నారు.