బీజేపీకి ఈటెలా గుచ్చుకుంటున్నాయా ?
తనకు తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ అని ఈటెల రాజేందర్ స్పష్టంగానే చెప్పేశారు. ఒక విధంగా కుండబద్ధలు కొట్టేశారు. తనకు రాష్ట్రం తారువాతనే పార్టీ అని అన్నారు.
By: Satya P | 11 July 2026 9:25 AM ISTతెలంగాణా రాజకీయాల్లో తాము దూసుకుని పోతామని కేంద్ర బీజేపీ పెద్దలకు ఆశలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణాలో బీజేపీ పోకడ ఎలా ఉంది అంటే వర్గ పోరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా అని జవాబు వస్తోంది. గ్రౌండ్ లెవెల్ లో ఏమి జరుగుతోంది అన్నది చూసుకోకుండా బీజేపీ పెద్దలు ఆలోచిస్తే ఇబ్బందే అని అంటున్నారు. తాజాగా సీనియర్ లీడర్ మాజీ మంత్రి మల్కాజ్ గిరీ ఎంపీ అయిన ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. అంతే కాదు బీజేపీ పెద్దలు కూడా ఆయన మాటల వెనక అర్ధాలు పరమార్ధాలు ఏమిటి అని ఆరా తీసే పనిలో పడ్డారు. ఇంతకీ ఈటెల ఏమన్నారు అన్నది చూస్తే లోతుగానే ఉంది మ్యాటర్ అని అంటున్నారు.
పార్టీ తరువాత అంటూ :
తనకు తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ అని ఈటెల రాజేందర్ స్పష్టంగానే చెప్పేశారు. ఒక విధంగా కుండబద్ధలు కొట్టేశారు. తనకు రాష్ట్రం తారువాతనే పార్టీ అని అన్నారు. ఇక తన వ్యక్తిగతం ఆ తరువాత అని కూడా అన్నారు. తాను తెలంగాణా రాష్ట్రం కోసం బాగు కోసం ఎందాకైనా వెళ్తాను అన్నట్లుగా ఈటెల వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈటెల మొదట ఉద్యమ నాయకుడు, తెలంగాణా రాష్ట్ర సాధనలో అతి ముఖ్యుడు, టీఆర్ఎస్ లో కేసీఆర్ తో భుజం కలిపి పనిచేసిన వారు. ఆ తరువాత ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ఏర్పాటు అయితే ఆ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. మంత్రిత్వ శాఖలు చూశారు. 2018లో రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు అయిన మీదటనే కేసీఆర్ తో విభేదాలు వచ్చారు. కారుకు తామూ యజమానులమే అని ఆయన చేసిన వ్యాఖ్యల తరువాత మరింత దూరం పెరిగి పార్టీ నుంచి ఆయనను దూరం పెట్టేశారు.
బీజేపీని ఎంచుకుని :
నిజానికి వామపక్ష భావాలు ఉన్న ఈటెల కాంగ్రెస్ లో చేరుతారు అని అంతా భావించారు. అయితే అప్పటికి టీఆర్ఎస్ అధికారంలో ఉంది. దాంతో జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉండడంతో అధికార అండ కోసం కేసీఅర్ తో పోరుకు సరైన వేదికగా బీజేపీని ఆయన ఎంచుకున్నారు అని అంటారు. ఇక హుజూర్ బాద్ కి జరిగిన ఉప ఎన్నికల్లో ఈటెల గెలిచారు. అయితే 2023 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలు అయ్యారు. కానీ 2024 ఎన్నికల్లో మల్కాజ్ గిరీ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఎంపీ గా తొలిసారి గెలిచి సత్తా చాటారు. దాంతో ఆయన దశ మారింది అని బీజేపీలో చేరినందుకు తగిన ఫలితం దక్కుతుందని ఆయనతో పాటు అంతా ఊహించారు. కానీ జరిగింది వేరుగా ఉంది అని గుర్తు చేస్తున్నారు.
కేంద్ర మంత్రి పదవి మిస్ :
బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెలకు 2024 లో మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి గ్యారంటీ అనుకుంటే గురి తప్పింది. తెలంగాణా నుంచి ఇద్దరికి చాన్స్ ఇచ్చారు. అందులో బండి సంజయ్ ఒకరు కిషన్ రెడ్డి మరొకరు. బండి సంజయ్ ఈటెల ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు ఆయన బీజేపీలో సీనియర్ పైగా తెలంగాణా అధ్యక్షుడిగా పనిచేశారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రిగా చేశారు. దాంతో ఈటెల వర్గం నిరాశకు గురి అయింది అని అంటున్నారు. మరో వైపు పార్టీలో కూడా ఈటెలకు తగిన ప్రాధాన్యత లేదని అంటున్నారు. ఆయన తెలంగాణా బీజేపీ అధ్యక్ష పీఠం ఆశించారు అని అయితే ఆయనకు కాకుండా పోయిందని అంటున్నారు.
కేటీఆర్ తో భేటీ :
ఈ నేపథ్యంలో ఈ మధ్యనే ఒక వివాహ వేడుక సందర్భంగా బీఆర్ఎస్ అగ్ర నేత కేటీఆర్ ని ఈటెల కలవడం ఇద్దరూ ముచ్చటించుకోవడం కూడా బీజేపీ రాజకీయాల్లో కాక రేపింది. అయితే తాను బీఆర్ఎస్ లో చేరడం లేదని ఈటెల స్పష్టంగా చెప్పడంతో అక్కడికి అది ఆగినట్లు కనిపించినా తాజాగా ఈటెల చేస్తున్న వ్యాఖ్యలతో బీజేపీలో కలకలం రేగుతోంది. ఈటెల ఎందుకు ఇలా అంటున్నారు అని అన్వేషిస్తున్నారు. ఈటెల తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం హుజూరాబాద్ లో తన హవా లేకుండా బీజేపీలో ఒక వర్గం చెక్ పెట్టే ప్రయత్నాలు చేయడం తనను కేవలం ఒక ఎంపీగానే పరిమితం చేయడం పట్ల ఆయన రగిలిపోతున్నారు అని అంటున్నారు. అంతే కాదు బీజేపీలో అగ్ర నేతలతో కేంద్ర మంత్రులతో ఆయనకు సాన్నిహిత్యం అంతంతమాత్రమే అని అంటున్నారు.
విస్తరణ నేపధ్యంలో :
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ క్రమంలోనే ఈటెల తన స్వరం పెంచారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈసారి కనుక తనకు బెర్త్ దక్కకపోతే తన దారి తనదే అన్నట్లుగా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. ఆయనకు బెర్త్ దక్కాలీ అంటే బండి సంజయ్ ని తప్పించాలి అది సాధ్యం అవుతుందా అన్నదే ఆలోచించే విషయం. ఎందుకంటే బండికి కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. ఒక వేళ కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో కూడా ఈటెలకు తగిన స్థానం దక్కకపోతే మాత్రం ఆయన తరువాత స్టెప్ ఏమిటి అన్నదే ఆసక్తిని కలిగిస్తోంది. మరో వైపు చూస్తే బీఆర్ఎస్ పోయిన నాయకులను వెనక్కు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. మరి బీఆర్ ఎస్ బెట్టు తగ్గించింది అని అంటున్నారు. దాంతో దశాబ్దాలుగా ఉన్న పార్టీలోనే తిరిగి చేరి కొనసాగితే బెస్ట్ అని ఈటెల నిర్ణయించుకుంటారా అన్నది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి ఈటెల వ్యాఖ్యలు బాణాలుగా మారి కాషాయాన్ని గుచ్చుకుంటున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది.
