బండి వర్సెస్ ఈటల.. కొత్త రగడ!
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు, ఎంపీ ఈటల రాజేందర్.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. పైకి ఆయన పేరు చెప్పకపోయినా.. బీజేపీ నాయకులపై ఈటల పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
By: Garuda Media | 6 April 2026 8:45 AM ISTమాజీ మంత్రి, బీజేపీ నాయకుడు, ఎంపీ ఈటల రాజేందర్.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. పైకి ఆయన పేరు చెప్పకపోయినా.. బీజేపీ నాయకులపై ఈటల పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి రెండు కారణాలు చెప్పుకొచ్చారు. 1) తనను ఉద్దేశ పూర్వకంగా ట్రోల్ చేస్తున్నారని. 2) తాను బీజేపీ నుంచి తిరిగి బీఆర్ ఎస్‌లోకి వెళ్తున్నానని. ఈ రెండు అంశాలపైనా ఆయన ఆవేదన, ఆగ్రహం, ఆక్రోశం వెళ్లగక్కారు. ``కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుంది.`` అనడం ద్వారా ఆయన ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించోఅర్ధం అవుతుంది.
గత కొన్నాళ్లుగా..
బీజేపీ తరఫున 2024లో ఎంపీగా గెలిచినప్పటికీ.. ఆ పార్టీలో ప్రాధాన్యంలేకుండా పోయిందన్నది ఈటల ఆవేదన. ముఖ్యంగా కేంద్ర మంత్రి... బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరును ఆది నుంచి ఆయన తప్పుబడుతున్నారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో బండి తన వర్గాన్ని ఎంగేజ్ చేయడం.. స్థానికంగా కండువాలు కప్పడం.. తనకు తెలియకుండానే హుజూరాబాద్‌లో కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారని.. ఇది ఆయన స్థాయికి తగదని కూడా గతంలో రెండు మూడు పర్యాయాలు ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా..
తాజాగా ఈటల రాజేందర్‌పై పార్టీ మార్పు వ్యవహారం చర్చకు దారితీసింది. ఆయన తిరిగి బీఆర్ ఎస్‌లోకి వెళ్లిపోతున్నారంటూ.. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్‌తోనూ సంప్రదింపులు జరిగాయని.. ఆయన రెడీ అవుతున్నారని కూడా ప్రచారం ఉంది. అదేసమయంలో ఈటల నియోజకవర్గంలో ఏమీ చేయడం లేదని, గోళ్లు గిల్లుకుం టున్నారని.. ట్రోల్స్ పెరుగుతున్నాయి. ఈ వ్యవహారం గత రెండు మాసాలుగా జరుగుతున్నా.. ఇటీవల మరింత పెరిగింది.
దీనిపై తాజాగా ఈటల స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టు కొందరు ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేస్తున్నారని.. కానీ, తాను పార్టీ మారబోనని అన్నారు. పైగా.. తనను బయటకు గెంటేసిన పార్టీ(బీఆర్ ఎస్)లోకి ఎలా వెళ్తానని ఆయన ప్రశ్నించారు. ఇదంతా ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం .. తనపై జరుగుతున్న కుట్ర అని ఆక్రోశించారు. దీనిపై ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటానని వ్యాఖ్యానించారు. ``పిచ్చి ప్రచారాలు చేస్తున్న వారికి చెబుతున్నా.. పార్టీలు మారే పరిస్థితి లేదు. పార్టీలు మారడం బట్టలు మార్చినట్టు కాదు. `` అని వ్యాఖ్యానించారు.
బండిపైనే!
కాగా.. ఈటల ఆగ్రహం, ఆక్రోశం అంతా.. బండి సంజయ్‌పైనేనన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎందుకంటే బండి సొంత నియోజకవర్గం కరీంనగర్‌లోనే ఈటల పార్టీ మారుతున్నారంటూ.. పోస్టర్లు అంటించారు. సోషల్ మీడియాలోనూ ఇక్కడే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది.పైగా.. పాత ఫొటోలు(కేసీఆర్‌తో కలిసి ఉన్నవి) కూడా ప్రచురించారు. ఈ క్రమంలో ఆయన పైకి పేరు చెప్పకపోయినా.. బండిపైనే తన ఆగ్రహం వ్యక్తం చేశారని పరిశీలకులు చెబుతున్నారు.
