ట్రంప్ ఏడు సార్లు ప్రయాణించారు!... సె*క్స్ స్కామ్ లో ఈ విమానం కీలకం!
అవును... అమెరికాను కుదిపేస్తూ వార్తల్లో ట్రెండింగ్ లో ఉంటున్న జెఫ్రీ ఎప్ స్టీన్ సె*క్స్ కుంభకోణంలో ఓ విమానం కూడా కీలక భూమిక పోషించింది.
By: Tupaki Desk | 20 July 2025 11:03 PM ISTఅగ్రరాజ్యం అమెరికాలో టారిఫ్ లు, ఎంఏజీఏ మొదలైన వాటికంటే జెఫ్రీ ఎప్ స్టీన్ సె*క్స్ కుంభకోణం మరింత హాట్ టాపిక్ గా ఉందని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం అమెరికాలో రిపబ్లికన్స్ కి, డెమోక్రాట్లకి మధ్య ఈ విషయం పొలిటికల్ ఫైట్ కి కారణంగా మారింది. మరోవైపు ఈ వ్యవహారం ట్రంప్ కి కంటికి కనిపించని తలనొప్పులు తెచ్చిపెడుతోందనే చర్చా జరుగుతోంది.
ఈ సందర్భంగా... ట్రంప్ తో సహా అతనితో సంబంధం ఉన్న ధనవంతులు, శక్తివంతమైన ఉన్నత వర్గాల వారిని రక్షించడానికి అధికారులు ఎప్ స్టీన్ కేసు గురించి వివరాలను దాచిపెడుతున్నారని పలువురు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సెక్స్ కుంభకోణంలో ఓ విమానానిదీ కీలక పాత్ర అనే విషయం తెరపైకి వచ్చింది. ఈ విమానం ముద్దుపేరు "లోలితా ఎక్స్ ప్రెస్"!
అవును... అమెరికాను కుదిపేస్తూ వార్తల్లో ట్రెండింగ్ లో ఉంటున్న జెఫ్రీ ఎప్ స్టీన్ సె*క్స్ కుంభకోణంలో ఓ విమానం కూడా కీలక భూమిక పోషించింది. హైప్రొఫైల్ వ్యక్తుల వద్దకు బాలికలను, యువతులను చేరవేసేందుకు బోయింగ్ 727 ప్రైవేట్ జెట్ ను జెఫ్రీ ఎప్ స్టీన్ వినియోగించాడని చెబుతున్నారు. ఇందులో నిత్యం యువతులే కనిపించేవారని అంటున్నారు.
ఈ సెక్స్ రాకెట్ కోసం వర్జిన్ ఐలాండ్స్ లో ఓ దీవిని కొనుగోలు చేసి, దానికి ఆల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ గా పేరుపెట్టిన జెఫ్రీ ఎప్ స్టీన్.. ఆ దీవినే తన సె*క్స్ రాకెట్ కు అడ్డాగా చేశాడు. ఈ క్రమంలో లోలితా ఎక్స్ ప్రెస్ జెట్ లో బాలికలను వివిధ ప్రాంతాల నుంచి అక్కడకు తరలించేవాడు. ఈ విమానం ఎక్కిన వారిలో బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ, నటుడు కెవిన్ స్పెసీ వంటి ప్రముఖులున్నట్లు చెబుతారు.
ఈ క్రమంలో 2019లో వర్జిన్ ఐలాండ్స్ ఎయిర్ పోర్టు ఉద్యోగులు మాట్లాడుతూ... జెఫ్రీ ఎప్ స్టీన్ తరచూ యువతులతో కనిపించేవాడని.. వారిలో చాలా మంది హైస్కూల్ వెళ్లే వయసు కలిగినవారు ఉండేవారని.. వారు ఎప్పుడూ తమ గుర్తింపు బయటపడకుండా స్వెట్ షర్ట్ లు ధరించే వారని చెప్పారు. ఈ విమానం ఎప్ స్టీన్ ప్రైవేటు ద్వీపాలకు తరచూ ప్రయాణించేదని తెలిపారు.
అయితే ఈ విమానానికి లోలితా ఎక్స్ ప్రెస్ అని నామకరణం చేయడం వెనుక ఓ కారణం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా.. దీనిలో తరచూ యువతులు కనిపిస్తుండటంతో దీనిని 'లోలితా ఎక్స్ ప్రెస్'గా పిలిచేవారట. రష్యా రచయిత వ్లాదిమిర్ నబుకోవ్ రాసిన లోలిత (1955) పుస్తకం నుంచి ఈ పేరు వచ్చిందని చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ విమానం పైలట్ గా ఓ మాజీ మహిళా మోడల్ పనిచేసేవారట. ఇక ఈ విమానం లోపల విలాసవంతమైన బెడ్, సోఫాసెట్, కుర్చీలు, భోజనం చేయడానికి టేబుల్స్ ఉండేవని చెబుతున్నారు. అయితే... 2016 నుంచి ఈ విమానం గాల్లోకి ఎగరలేదు.. జార్జియాలోని ఓ రన్ వేపై కొన్నేళ్లుగా నిలిచిపోయింది.
కాగా ఇటీవల ఈ విషయంపై స్పందించిన నటుడు కెవిన్ స్పెసీ... జెఫ్రీ ఎఫ్ స్టీన్ కు సంబంధించిన అన్ని ఫైళ్లను విడుదల చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... 65 ఏళ్ల స్పేసీ గతంలో తాను అపఖ్యాతి పాలైన "లోలితా ఎక్స్ ప్రెస్"లో ప్రయాణీకుడినని ఒప్పుకున్నాడు. 2002లో ఆఫ్రికాకు మానవతా పర్యటన సందర్భంగా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో కలిసి అందులో ప్రయాణించినట్లు తెలిపాడు. అయితే.. తనకు ఎప్ స్టీన్ వ్యక్తిగతంగా తెలియదని అన్నారు.
మరోవైపు 1990ల నాటి జెఫ్రీ ఎఫ్ స్టీన్ విమాన లాగ్ లలో డోనాల్డ్ ట్రంప్ పేరు ఏడు సార్లు కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే ట్రంప్.. ఎప్ స్టీన్ ప్రైవేట్ ఐలాండ్ కి వెళ్లినట్లు లేదా నేర కార్యకలాపాలలో పాల్గొన్నట్లు ఎటువంటి ఆధారాలు మాత్రం లేవని చెబుతున్నారు. 90ల్లో ట్రంప్, ఎప్ స్టీన్ సామాజికంగా దగ్గరగా ఉన్నా 2000ల ప్రారంభంలో విడిపోయినట్లు తెలుస్తోందని చెబుతున్నారు!
