Begin typing your search above and press return to search.

'వైల్డ్' వైరల్ పిక్... ఎప్ స్టీన్ తో ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్!

కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోన్నాయి ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి తాజాగా విడుదలైన భారీ ఫైల్స్.

By:  Tupaki Desk   |   10 Feb 2026 10:32 AM IST
వైల్డ్ వైరల్ పిక్... ఎప్ స్టీన్ తో ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్!
X

కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోన్నాయి ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి తాజాగా విడుదలైన భారీ ఫైల్స్. ఈ ఫైల్స్ బ్రిటన్ లో రాజకీయ సంక్షోభానికీ దారి తీస్తున్నాయని అంటున్నారు. ఇక ఈ ఫైల్స్ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పలువురు ప్రముఖుల జీవితాలను నెట్టింట పాలు చేస్తోన్నాయి! ఈ సమయంలో.. ఎప్ స్టీన్ పార్టీలో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ కనిపించిన ఫోటోలు తెరపైకి వచ్చాయి.

అవును... వ్యభిచారం కోసం బాలికలు, యువతను అక్రమంగా రవాణా చేసిన కేసుల్లో దోషిగా తేలిన తర్వాత కూడా.. లైంగిక నేరస్తుడు ఎప్ స్టీన్ తో కలిసి కాలిఫోర్నియాలోని విలాసవంతమైన విందులో మెటా సీసీఓ మార్క్ జుకర్ బర్గ్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు కనిపిస్తోన్న ఓ ఫోటో విడుదలైంది. ఇదే సమయంలో.. లింక్డ్ ఇన్ కో-ఫౌండర్ రీడ్ హాఫ్ మాన్, పేపాల్ కో-ఫౌండర్ పీటర్ థీల్ కూడా హాజరైన పార్టీ గురించి ఈ-మెయిల్ లో స్పందిస్తూ ఈ ఈవెంట్ ను "వైల్డ్" అని పిలిచాడు!

తాజాగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఫోటోలో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ డైనింగ్ టేబుల్ పై కూర్చున్నట్లు కనిపిస్తుండగా.. ఆ సమయంలో స్పేస్ ఎక్స్ సీఈఓ కెమెరా పర్సన్ వైపు చూస్తున్నట్లు కనిపిస్తున్నారు.. ఆ వ్యక్తి బహుశా ఎప్ స్టీన్ అయ్యి ఉంటారని అంటున్నారు. మరోవైపు జుకర్ బర్గ్ మాత్రం సూటిగా కాస్త సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ ఫోటోను 2015 ఆగస్టు 3న ఎప్ స్టీన్ తనకు తానుగా ఈమెయిల్ చేసుకున్నాడు.

ఈ క్రమంలో ఆగస్టు 20 - 2015న డెమోక్రాట్, ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్ కర్ బంధువు.. బిలియనీర్ టామ్ ప్రిట్జ్ కర్ కు పంపిన ఈ-మెయిల్ లో ఎప్ స్టీన్ ఈ డిన్నర్ పార్టీ గురించి ప్రస్తావిస్తూ... దీన్ని "వైల్డ్" అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో... తాను, జుకర్ బర్గ్, మస్క్, థియల్ హాఫ్ మన్, వైల్డ్ తో డిన్నర్ చేశామని అందులో కాస్త కోడ్ భాషలో ఉన్నట్లు చెబుతున్నారు!

కాగా... ఎప్ స్టీన్ ఫైల్స్ నుంచి ఇటీవల వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు.. వ్యాపార ప్రపంచంలో లైంగిక నేరస్తుడి లోతైన సంబంధాలను హైలెట్ చేస్తున్నాయి! 2019 వానిటీ ఫెయిర్ కథనంలో... తన ద్వీపాన్ని సందర్శించడానికి తనను పదే పదే ఎప్ స్టీన్ ఆహ్వానించాడని.. అయితే తాను అందుకు నిరాకరించానని ఎలాన్ మస్క్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఫోటో వెలుగులోకి రావడం గమనార్హం.

వాస్తవానికి ఎలాన్ మస్క్ పై ఎలాంటి తప్పుడు ఆరోపణలూ రాలేదు.. అతను ద్వీపాన్ని సందర్శించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. కాకపోతే ఎప్ స్టీన్ తో ఈ-మెయిల్ సంభాషణలు ఉన్నప్పటికీ.. మస్క్ మాత్రం అతడితో సన్నిహిత సంబంధాన్ని పదేపదే తిరస్కరించినట్లు చెబుతున్నారు. మరోవైపు.. ఎప్ స్టీన్, అతని నేరాలతో తనకు సంబంధం లేదని అంటూ.. అతనితో పాల్గొన్న సమావేశాల గురించి చింతిస్తున్నట్లు వెల్లడించారు.

కాగా... 2008 జూన్ 30న.. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్ తో వ్యభిచారం చేయించారనే ఆరోపణలను ఎప్ స్టీన్ అంగీకరించాడు. దీంతో.. కనీస భద్రతా సౌకర్యంలో అతనికి 18 నెలల జైలు శిక్ష విధించబడింది. అయితే... తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటో అతని విడుదల తర్వాతదిగా చెబుతుండటంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమవుతోంది!