Begin typing your search above and press return to search.

పదో క్లాస్ లో మొదలు పెట్టి పెళ్లైనా వదల్లేదు.. వీడేం టీచర్!

ఒక ఇంగ్లిషు టీచర్ ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఇలా కూడా చేస్తారా? అనుకోకుండా ఉండలేరు.

By:  Tupaki Desk   |   27 Jun 2025 12:54 PM IST
పదో క్లాస్ లో మొదలు పెట్టి పెళ్లైనా వదల్లేదు.. వీడేం టీచర్!
X

ఒక ఇంగ్లిషు టీచర్ ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఇలా కూడా చేస్తారా? అనుకోకుండా ఉండలేరు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈ ఇంగ్లిషు టీచర్ కు తాజాగా కోర్టు 17 ఏళ్లు జైలుశిక్ష విధించినప్పటికి.. వీడు చేసిన ఘోరాలకు అది కూడా తక్కువ శిక్షగా అనిపించక మానదు. హనుమకొండకు చెందిన మధుకర్ 2013లో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ లో ఇంగ్లిషు టీచర్ గా పని చేశాడు. ఆ సమయంలో పదో తరగతి చదివే బాలికను బలవంతంగా లోబర్చుకున్నాడు.

నైట్ క్లాస్ పేరుతో స్కూల్ కు పిలిచి స్టాఫ్ రూంలో ఆమెను బలవంతంగా అనుభవించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే.. ఆమె తల్లిదండ్రుల్ని చంపేస్తానని బెదిరించాడు. వీడి బెదిరింపులకు భయపడిన ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. స్కూల్ అయిపోయి కాలేజీలోకి చేరిన తర్వాత కూడా ఆమెను అదే విధంగా భయపెట్టి శారీరకంగా వాడుకునేవాడు.

ఆమెకు తెలీకుండా ఫోటోలు.. వీడియోలు తీశాడు. తాను పిలిచినప్పుడల్లా రావాలని.. రాకుంటే ఫోటోలు.. వీడియోలు బయటపెడతానని బెదిరించేవాడు.దీంతో.. అతడి వేధింపుల్ని భరించింది. పెళ్లైన తర్వాత కూడా ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె భర్తకు ఫోన్ లో తనతో ఉన్న ఫోటోలు.. వీడియోలు పంపటంతో.. అవి చూసిన భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు.

దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడ్ని రిమాండ్ కు పంపారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం.. టీచర్ మధుకర్ దురాగతాలపై కోర్టు స్పందించి పదిహేడేళ్ల జైలు శిక్షతో పాటు.. రూ.1.5 లక్షల ఫైన్ వేస్తూ తీర్పు చెప్పారు. పదో తరగతి టైంలో మొదలు పెట్టి పెళ్లైన తర్వాత కూడా విడవని ఈ కామపిశాచికి మరింత కఠినశిక్షవేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.