జంబలకడి పంబ సినిమా సీన్ రిపీట్.. యువతి వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య!
ఇటీవలి కాలంలో 'జంబలకడి పంబ' సినిమాను తలపించేలా పురుషులపై వేధింపులు, ఒత్తిడి పెరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
By: Tupaki Desk | 3 Jun 2025 2:00 AM ISTఇటీవలి కాలంలో 'జంబలకడి పంబ' సినిమాను తలపించేలా పురుషులపై వేధింపులు, ఒత్తిడి పెరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. శారీరక సంబంధాల కోసం పురుషులను బ్లాక్‌మెయిల్ చేయడం, వేధించడం వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాంటి ఒక దారుణమే హిమాచల్ ప్రదేశ్‌లోని సురేంద్రనగర్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఒక యువతి వేధింపులు తాళలేక 20 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసులు, మృతుడి తల్లి వెల్లడించిన ప్రకారం..
హిమాచల్ ప్రదేశ్‌లోని సురేంద్రనగర్‌లో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న 20 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అదే కళాశాలలో చదువుతున్న ఒక యువతి అతనిపై కన్నేసి, శారీరక సంబంధం పెట్టుకోవాలని నిరంతరం ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. మొదట స్నేహంగా మెలిగిన ఆమె, ఆ తర్వాత తన డిమాండ్లను పెంచుతూ తనను వేధించడం మొదలు పెట్టిందట. యువతి పెడుతున్న ఒత్తిడి, బ్లాక్‌మెయిల్ వల్ల యువకుడు తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు పోలీసులు, మృతుడి తల్లి చెప్పిన వివరాల ప్రకారం తెలుస్తోంది.
ఈ విషయం గురించి అతను తన తల్లికి చెప్పుకుని తీవ్రంగా ఏడ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. యువతి వేధింపులు రోజురోజుకు శ్రుతి మించిపోవడంతో, వాటిని భరించలేకపోయిన యువకుడు శుక్రవారం రాత్రి తన కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. శనివారం ఉదయం కళాశాల సిబ్బంది హాస్టల్ గది తలుపులు తెరిచి చూడగా, యువకుడు విగతజీవిగా కనిపించాడు. వెంటనే కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలంలో యువకుడు రాసిన సూసైడ్ నోట్ (ఆత్మహత్య లేఖ) లభ్యమైంది. ఆ లేఖలో, తన తల్లి తన మరణానికి ఏ విధంగానూ కారణం కాదని, తన ఆత్మహత్యకు గల కారణాలను సూటిగా పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. యువకుడి మరణానికి కారణమని భావిస్తున్న ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. ఈ విషాద సంఘటన సమాజంలో పురుషులు ఎదుర్కొంటున్న వేధింపులు, మానసిక ఒత్తిడి గురించి తీవ్రమైన చర్చకు దారితీసింది.
