ఇంజినీరింగ్ విద్య, ఉద్యోగంపై ‘ఫైనాన్స్ గ్లోబల్ ఎకనామిక్స్ అవుట్ లుక్’ సర్వేలో సంచలన విషయాలు..
కేవలం తక్కువ జీతం కాదు, అసలు ఉద్యోగమే దొరకని పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి.
By: Tupaki Political Desk | 5 May 2026 3:10 PM ISTఇంజినీరింగ్ అంటే సమాజంలో గౌరవం, భవిష్యత్తుకు హామీ. కొడుకు, కూతురు ఇంజినీర్ అవుతున్నాడంటే తన కష్టాలన్నీ తీరుతాయని, విదేశీ ప్రయాణాలు లేదంటే పెద్ద పెద్ద నగరాల్లో విలాసవంతమైన జీవితం గడపవచ్చని కలలు కనేది. కాలక్రమేణా ఆ కలల సౌధం బీటలు వారుతోంది. ఏటా లక్షల మంది పట్టభద్రులు బయటకు వస్తున్నా, వారి చేతిలో ఉన్న డిగ్రీకి, మార్కెట్‌లో ఉన్న ఉద్యోగాలకు అగాధం పెరుగుతోంది. అప్పు చేసి, ఆస్తులు అమ్మి చదివించిన చదువు చేతిలో చిల్లిగవ్వ పెట్టలేని స్థితికి చేరుకోవడం నేటి వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. చదువుకు పెడుతున్న పెట్టుబడికి, తిరిగి వస్తున్న ప్రతిఫలానికి మధ్య పొంతన లేకపోవడం దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.
పొంతన లేని చదువులు
ఇంజినీరింగ్ విద్య అంటే సామాన్యుడికి భారమనే చెప్పాలి. ఫైనాన్స్ గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్ సర్వే ప్రకారం, ఒక విద్యార్థి సగటున ఇంజినీరింగ్ పూర్తి చేయాలంటే దాదాపు ₹34.1 లక్షల వరకు ఖర్చు చేయాలి. కోచింగ్ ఫీజు, హాస్టల్ ఖర్చు, కాలేజీలకు డొనేషన్లు అన్నీ కలిపితే మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి చదువు పూర్తి చేస్తే సదరు విద్యార్థికి లభిస్తున్న ప్రారంభ వార్షిక జీతం సగటున ₹4.74 లక్షలు మాత్రమే ఉంటోంది. అంటే పెట్టిన పెట్టుబడిలో 15వ వంతు కూడా ఏడాదికి రావడం లేదు. ఈ విధంగా చూస్తే చదువు కోసం చేసిన అప్పులు తీరేందుకే ఎన్ని దశాబ్దాలు పడుతుందోనని అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కొరవడిన కొలువులు.. ఆందోళనలో తల్లిదండ్రులు..
కేవలం తక్కువ జీతం కాదు, అసలు ఉద్యోగమే దొరకని పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. సరైన నైపుణ్యాలు లేకపోవడం ఒక కారణమైతే, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యాబోధన లేకపోవడం మరో ప్రధాన కారణంగా మారుతోంది. వేల సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలు వెలిసినా, వాటిలో నాణ్యమైన విద్య అందడం లేదన్నది బహిరంగ రహస్యం. దీంతో డిగ్రీలు ఉన్నా ఉద్యోగాలకు అనర్హులుగా మిగిలిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తమ పిల్లల భవిష్యత్తు కోసం జీవితాంతం సంపాదించిన సొమ్ము దారబోస్తున్న తల్లిదండ్రులు, చివరకు తమ పిల్లలు ఖాళీగా ఇంట్లో కూర్చోవడం చూసి కుమిలిపోతున్నారు. ఈ అనిశ్చితి విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని పెంచుతోంది.
సాధారణ డిగ్రీనే మేలా?
ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో సాంకేతిక విద్య కంటే సాధారణ డిగ్రీ కోర్సులే మేలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సులకు అయ్యే ఖర్చు ఇంజినీరింగ్‌తో పోలిస్తే చాలా తక్కువ. తక్కువ పెట్టుబడితో విద్య పూర్తి చేసి, పోటీ పరీక్షలకు లేదా ఇతర నైపుణ్యాధారిత కోర్సులకు ప్రాధాన్యత ఇస్తే త్వరగా స్థిరపడే అవకాశం ఉంటుంది. సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి లభించే వేతనాలకు, వారు చదువు కోసం పెట్టిన ఖర్చుకు మధ్య సమతుల్యత ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. లక్షల రూపాయలు గుమ్మరించి నిరుద్యోగిగా మిగిలిపోవడం కంటే, ఉన్నంతలో తక్కువ ఖర్చుతో చదువుకొని ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవడం ఉత్తమమనే వాదన బలపడుతోంది.
విద్యా వ్యవస్థలో మార్పు అవసం..!
చదువు కేవలం సర్టిఫికెట్ల కోసమే కాకుండా, ఉపాధిని ఇచ్చేలా ఉండాలి. విద్యార్థులు కోర్సులను ఎంచుకునేటప్పుడు సామాజిక హోదా కాకుండా, మార్కెట్ అవసరాలు, తమ ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసుకోవాలి. ప్రభుత్వం, విద్యా సంస్థలు కూడా ఫీజుల నియంత్రణతో పాటు, ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు ప్రాధాన్యతనిచ్చేలా విద్యా ప్రణాళికలను రూపొందించాలి. లేదంటే విద్యావంతులైన నిరుద్యోగుల సంఖ్య పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
విద్య అనేది వ్యాపారంగా మారుతున్న నేటి రోజుల్లో, ప్రతి అడుగూ ఆచి తూచి వేయక తప్పదు. కేవలం ఇంజినీరింగ్ ముసుగులో లక్షలాది రూపాయలు వృథా చేసుకోవడం కంటే, వాస్తవ పరిస్థితులను గ్రహించి ముందుకు సాగడమే మేలు.
