మళ్లీ వలంటీర్ల వ్యవస్థ.. వైసీపీ షాకింగ్ డెసిషన్
గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన వలంటీర్ల వ్యవస్థపై ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Political Desk | 18 April 2026 2:42 PM ISTగత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన వలంటీర్ల వ్యవస్థపై ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామని గత కొంతకాలంగా వాదిస్తున్న అమరనాథ్, వచ్చే ఎన్నికల తర్వాత ఏం చేస్తామో స్పష్టం చేశారు. 2029 ఎన్నికల తర్వాత మళ్లీ వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చే ప్రసక్తే ఉండదని, అధినేత జగన్ కూడా ఈ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి తేల్చిచెప్పారు.
దూరం పెంచేశారు
ఏపీలో 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ను నియమించింది. వారి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసింది. లబ్ధిదారుల ఎంపికకు వారినే భాగస్వాములు చేసింది. దీనివల్ల ప్రజలకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు మధ్య దూరం పెరిగిందని వైసీపీ గుర్తించింది. అదే సమయంలో ఎన్నికల ముందు వలంటీర్లు కూటమి నేతలు ఇచ్చిన హామీలకు ఆకర్షితులై తమ పార్టీకి పనిచేయలేదని, దీనివల్ల రాజకీయంగా మేలు జరుగుతుందని భావిస్తే, వ్యతిరేక ఫలితాలు వచ్చాయని వైసీపీ నేతలు గుర్తించారని అంటున్నారు.
మళ్లీ ఆ తప్పు చేయకూడదు
ఈ కారణంగానే వలంటీర్ల విషయంలో మళ్లీ తప్పు చేయకూడదని వైసీపీ నిర్ణయించుకుందని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా విశాఖ నగరంలోని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదీప్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ కార్యకర్తలకు స్పష్టత ఇచ్చారని చెబుతున్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల పాలనలో ప్రజాప్రతినిధులు, నాయకులకు ఎటువంటి ప్రాధాన్యం లేకపోయిందని, ఈ కారణంగా ప్రజలకు దూరమై ఓటమి చూశామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమస్యను అధినేత జగన్మోహనరెడ్డి గుర్తించారని, మరోసారి ఇటువంటి పొరపాటు జరక్కుండా చూసుకుంటారని హామీ ఇచ్చారు.
అదంతా ఒక చరిత్ర
అమరనాథ్ వ్యాఖ్యలతో ఏపీలో మళ్లీ వలంటీర్ వ్యవస్థ వచ్చే పరిస్థితి లేదని స్పష్టమైందని అంటున్నారు. గత ఎన్నికల ముందు వరకు వలంటీర్ వ్యవస్థపై అనేక చర్చలు కొనసాగేవి. ముఖ్యంగా వైసీపీ నేతలు వలంటీర్లు తమ సైన్యంగా తప్పుడు అంచనాలు వేసుకుని నష్టపోయారని అంటున్నారు. ఇక వైసీపీ ప్రయోగించిన వలంటీర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకుని కూటమి నేతలు రాజకీయంగా లబ్దిపొందారని అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10 వేల వేతనం చేస్తామని, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వలంటీర్లు వైసీపీకి దెబ్బ వేశారని, ఆ తర్వాత వారు విధుల్లోనే లేరని కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని గుర్తు చేస్తున్నారు. అలా తెరమరుగైన వలంటీర్ల వ్యవస్థను తిరిగి కొనసాగించే అవసరం, అవకాశం లేదని వైసీపీ నేతలు కూడా డిసైడ్ అవడంతో వలంటీర్ వ్యవస్థ గతించిన చరిత్రగానే మిగిలిపోనుందని అంటున్నారు.
