బ్లాంక్ చెక్ మీద సంతకం...రిస్క్ చేయాల్సిందే !
జీవితం అంటే మూడు అక్షరాల మాదిరిగా సింపుల్ గా ఉండదు, అందంగా అంతకంటే ఉండదు, జీవితంలో ఎన్నో మలుపులు ఎన్నో పిలుపులు ఉంటాయి.
By: Satya P | 30 Nov 2025 11:04 AM ISTజీవితం అంటే మూడు అక్షరాల మాదిరిగా సింపుల్ గా ఉండదు, అందంగా అంతకంటే ఉండదు, జీవితంలో ఎన్నో మలుపులు ఎన్నో పిలుపులు ఉంటాయి. నిన్న నేడు అయ్యే వేళ పక్క వారు మెల్లగా జారుకుంటారు, కొత్త వారు జత చేరుతారు, ఇక్కడ ఎవరూ ఎవరికీ శాశ్వతం కాదు, ఆ మాటకు వస్తే నీకు నీవే శాశ్వతం కాదు, అంతా టైం బట్టే సాగుతుంది. ఎవరి టైం వస్తే వారికి జరగాల్సింది జరిగి తీరుతుంది. అలాగని తీరిగ్గా కూర్చుంటే అసలు కుదరదు, నీ పని నీవు చేయాల్సిందే. కాలం అనే రైలు బండిలో ప్రయాణం ఎపుడో మొదలెట్టేశావు. అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన తొలి సెకన్ నుంచే ఈ ప్రయాణం స్టార్ట్ అయింది. అది ఆగేది నీ అలుపుతో కాదు, ఆగాల్సిన సమయంలో ఆగుతుంది. ఇక అది నీ రాతలోనూ చేతిలోనూ ఉందనుకుంటే వేరే లెక్క. అలాంటి నమ్మకాలు పెట్టుకున్నా ఒక తాత్వికుడిగా అయినా జీవితాన్ని సాగించాల్సిందే, బతుకు బండి లాగించాల్సిందే.
సేఫ్ గేం ఉండదు :
జీవితంలో సేఫ్ గేం అన్నదే ఉండదు, అడుగడుగున ముళ్ళ పొదలు, కొండలు లోయలు గుట్టలు ఎక్కీ దిగే లోగానే పుణ్య కాలం గడచిపోతుంది, ఎంత చమట చిందించావు అన్నది ఒక్కోసారి లెక్కలోకే రాదు, రక్తం ఎంత మరిగించినా లక్ష్యం చేరుకోకపోనూ వచ్చు, జీవితం అనే ఆటలో ఎక్కువ సార్లు ఓటమి పాలూ కావచ్చు. అయినా తప్పని ఆట ఇది. నీకు నీవే ఆడాల్సిన ఆట కూడా ఇదే. దెబ్బలు తగలకుండా కసి కందకుండా సున్నితంగా ఆడతాను అనడానికి ఇదేమీ నీవు ఎంచుకున్న ప్లే గ్రౌండ్ కాదు, ఇక్కడ రూల్స్ నీ కోసం బ్రేక్ కానే కావు, సడలింపులు అంతకంటే ఉండవు. అందువల్ల సేఫ్ గేం ఆడతాను అని అనుకుంటే అదే అసలైన రిస్క్ అని తెలుసుకోవాల్సిందే.
ఎమోషన్స్ ఎంతున్నా :
జీవిత ప్రయాణంలో ఎమోషన్స్ ఎన్నో ఉంటాయి, బంధాలు చుట్టేస్తాయి, తెలియని పాశాలు అడ్డుపడతాయి. కానీ నీకు సంకల్పబలం ఉంటే అవన్నీ మబ్బుల మాదిరిగా తేలిపోతాయి. ముందే చెప్పుకున్నట్లు ఏ బంధమూ నీది కాదు, నీతో తుదికంటా వెంట రాదు, అందువల్ల నీకు నీవే అనుకుని సాగించాల్సిన పోరాటం ఇది. ఈ జీవితంలో ఏమి సాధించాం అన్నది ఎంత ముఖ్యమో, ఏ దిశగా వెళ్తున్నామన్నది అంతే ముఖ్యం. అందువల్ల ఎమోషన్స్ కి కట్టుబడి ప్రయాణం ఆపేద్దామనుకున్నా ఏ బంధమో శ్రీరామ రక్షగా మారి రక్షిస్తుందని అనుకున్నా పప్పులో కాదు తప్పులో కాలేసినట్లే.
ఫేస్ చేయాల్సిందే :
నా వల్ల కాదు అన్న మాట ఎన్నడూ రాకూడదు, అసలు ఆ మాట అనే హక్కు కూడా నీకు లేదు, ఎందుకంటే నీవు తెలియకుండానే ఈ ఆటలోకి వచ్చేశావు. అన్ని కండిషన్స్ నీ ఒప్పేసుకుని మరీ బరిలోకి దూకేశావు. అందువల్ల ప్రతీ సెకన్ అప్రమత్తమే నీకు కొండంత బలం కావాలి కానీ బేలతనం, జాలి తనం అన్నది అసలు కూడదు, నీ కఠిన పరీక్షను నేను తట్టుకోలేను, దీనిని నేను ఫేస్ చేయలేను అని వెనక్కు వెళ్ళాలనుకున్నా కుదిరే వ్యవహారం కాదు, ఇంతకు ఇంత వడ్డీలు కట్టి మరీ కఠిన పరీక్ష నీకు మళ్ళీ మళ్ళీ ఎదురవుతుంది. అందువల్ల నీవు దేనికైనా రెడీ అన్నట్లు ఉంటే ఈ జీవితం అనే ఆటలో పోటీలో ఉండగలుతావు.
మిడిల్ డ్రాప్ అంటే :
మరణం అన్నది సహజ ప్రక్రియ. అది దాని మానన జరిగేది, కాలం పెట్టే కామావో ఫుల్ స్టాపో దానికే తెలియాలి. ఆ రోజు వచ్చేంతవరకూ నీవు ఆటలో ఉన్నట్లే. ఆటాడాల్సిందే. వయసు మనసు ఇవేమీ అడ్డంకులు కావు, కేవలం అవి కుంటి సాకులు మాత్రమే. అలాగని సమస్యలు ఉన్నాయని బెదిరిపోయి ఆత్మహత్య చేసుకుంటే మాత్రం మిడిల్ డ్రాప్ అయినట్లే. గివ్ అప్ ఇచ్చినట్లే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు, ఆ బ్యూటీ నీవు బతకడంలోనే ఉంది. దేనిని అయినా ఎదుర్కోవడంలోనే ఉంది. పిరికిపందలా ఆత్మహత్య చేసుకోవడంలో లేదు, ఇది గుర్తు పెట్టుకుని ముందుకు సాగాలి. అయినా బ్లాక్ చెక్ మీద సంతకం పెట్టి ఈ భూమి మీద అడుగు పెట్టిన నీవు రిస్క్ వద్దు అంటే జరిగే పనేనా. అది అసలు కుదిరే పనేనా. అందువల్ల తెగించి ముందుకు అడుగు వేయ్. వేసవి వడగాడ్పులు అయినా శిశిరంలో వణికించే చలిలో అయినా భీకరమైన వర్షంలో అయినా నీ అడుగు తడబడకుండా ముందుకు సాగిపోవాల్సిందే. తల వంచక దారి వెతుక్కోవాల్సిందే.
