దేశాధ్యక్షుడి చెంప చెళ్లుమనిపించిన భార్య ?.. వైరల్ వీడియో!
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, బ్రిగిట్టే మెక్రాన్‌ల మధ్య సంబంధం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By: Tupaki Desk | 26 May 2025 11:08 PM ISTఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఆయన భార్య బ్రిగిట్టే మెక్రాన్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో బ్రిగిట్టే మెక్రాన్ తన భర్త ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ చెంపపై కొట్టినట్లుగా కనిపించడంతో దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
సాధారణంగా భార్యాభర్తల మధ్య జరిగే చిన్నపాటి గొడవలు గ్రామీణ ప్రాంతాల్లో తరచుగా కనిపిస్తుంటాయి. పట్టణాల్లోనూ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అయితే రాజకీయ ప్రముఖులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు లేదా దేశాధ్యక్షుల విషయంలో ఇలాంటి సంఘటనలు ఊహించనివి. ఈ క్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు సంబంధించిన ఈ వీడియో దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ వైరల్ అయ్యింది.
-వియత్నాం పర్యటనలో ఘటన:
తాజాగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ వియత్నాంలో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా విమానం నుంచి కిందకు దిగుతుండగా, మెక్రాన్ సతీమణి బ్రిగిట్టే ఆయన చెంపపై కొట్టినట్లుగా దృశ్యాలు విమానం కింద స్వాగతం పలికేందుకు వచ్చిన వారికి కనిపించాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పందించింది. మెక్రాన్‌పై ఆయన సతీమణి బ్రిగిట్టే కావాలని చేయి చేసుకోలేదని, అది సరదాగా చేసిన చర్య అని వివరణ ఇచ్చింది.
ఆదివారం రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు చెందిన అధికారిక విమానం వియత్నాంలోని హనోయిలో ల్యాండ్ అయింది. కొద్ది క్షణాల తర్వాత డోర్లు తెరవబడ్డాయి. అప్పుడు ఒక దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. మెక్రాన్‌ను ఆయన భార్య చెంపపై కొడుతున్నట్లుగా ఉంది. వెంటనే మెక్రాన్ తేరుకుని ఆమె చేతిని పక్కకు నెట్టివేశారు. ఆ తర్వాత మెక్రాన్ భార్య బ్రిగిట్టే విమానంలోనే ఉండిపోయి, బయటకు రాలేదు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపిస్తున్నాయి.
- దేశానికి అవమానం?:
ఈ ఘటనపై ఫ్రాన్స్‌లో తీవ్ర స్పందన వస్తోంది. కొంతమంది నెటిజన్లు "ఇది దేశానికే అవమానకరం" అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం "ఇది భార్యాభర్తల వ్యక్తిగత విషయం" అని చెబుతున్నారు. "మెక్రాన్ తన భార్యతో సన్నిహితంగా ఉన్నారని, ఆమె భర్తపై ప్రేమతో చేతులు వేసిందని" సాక్షులు తెలిపారు. అయితే, మరికొందరు ఈ ఘటనను సీరియస్‌గా పరిగణిస్తున్నారు.
- ఆసక్తికర విషయాలు:
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, బ్రిగిట్టే మెక్రాన్‌ల మధ్య సంబంధం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇమ్మాన్యుయేల్ కంటే ఆయన భార్య బ్రిగిట్టే 24 ఏళ్లు పెద్దది. 15 ఏళ్ల వయసులో ఇమ్మాన్యుయేల్ తన డ్రామా టీచర్‌గా పనిచేస్తున్న బ్రిగిట్టేతో ప్రేమలో పడ్డారని, అప్పటికే ఆమెకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారని గమనార్హం. ఈ నేపథ్యంలో వారి బంధం ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో వారి బంధాన్ని మరోసారి వార్తల్లో నిలిపింది.
