Begin typing your search above and press return to search.

ఈఎంఐల ఊబిలో మధ్య తరగతి.. బయటపడడం ఎలా?

ఈ పరిస్థితిలో విద్యుత్ బిల్లులు, పిల్లల స్కూల్ ఫీజులు, అద్దె, ఆరోగ్య ఖర్చులు.. ఇవన్నీ భారంగా మారుతున్నాయి. 80% మంది ఆదాయంలో 40% కంటే ఎక్కువ ఈఎంఐలు చెల్లిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Political Desk   |   7 Feb 2026 5:00 PM IST
ఈఎంఐల ఊబిలో మధ్య తరగతి.. బయటపడడం ఎలా?
X

ఈ దేశంలో మధ్య తరగతి జీవితంలో ఒక కొత్త పదం కేంద్ర బిందువుగా మారింది అదే EMI. ఇల్లు, కారు, బైక్, ఫోన్, ఫర్నిచర్.. అవసరమా? కోరికా? అన్న తేడా లేకుండా అన్నింటికీ ఈఎంఐ. కానీ ఇప్పుడు అదే ఈఎంఐ చాలా కుటుంబాలకు ఊపిరాడనీయని ఆర్థిక బంధంగా మారుతోంది. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు 10,000 మంది బాధితులపై ఒక రిజల్యూషన్ కన్సల్టెన్సీ సంస్థ చేసిన సర్వే ఫలితాలు కలవరపెడుతున్నాయి. 85% మంది తమ నెలవారీ ఆదాయంలో 40% కంటే ఎక్కువ మొత్తాన్ని EMIలకు చెల్లిస్తున్నారని తేలింది. ₹35,000 నుంచి ₹65,000 మధ్య జీతం పొందేవారిలో చాలా మంది ₹28,000 నుంచి ₹52,000 వరకు ఈఎంఐలకే వెచ్చిస్తున్నారు. అంటే జీతం వచ్చిందంటే.. అది బ్యాంకులకు వెళ్లిపోతుంది, ఇంటికి రాదు..

కార్డు టు కార్డుతో మరింత అప్పు..

ఈ పరిస్థితిలో విద్యుత్ బిల్లులు, పిల్లల స్కూల్ ఫీజులు, అద్దె, ఆరోగ్య ఖర్చులు.. ఇవన్నీ భారంగా మారుతున్నాయి. 80% మంది ఆదాయంలో 40% కంటే ఎక్కువ ఈఎంఐలు చెల్లిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 40% మంది ఒక క్రెడిట్ కార్డ్ బకాయిని మరో కార్డ్‌తో కడుతున్నారు. ఇది స్పష్టంగా డెట్ సైకిల్. 22% మంది స్నేహితులు, బంధువుల వద్ద నుంచి అప్పులు తీసుకుంటున్నారు. అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే.. 65% మందికి ఎమర్జెన్సీ ఫండ్ లేదు. ఇది మధ్య తరగతి జీవితాలను తీవ్రమైన అఘాతంలోకి నెడుతుంది.

కుటుంబ కలహాలు..

పిల్లల చదువు ఆపేయడం, మెడికల్ ట్రీట్‌మెంట్ వాయిదా.. ఇన్సూరెన్స్ పాలసీలు క్యాన్సిల్ చేయడం, ఫుడ్ బడ్జెట్ తగ్గించడం.. ఇవి కేవలం గణాంకాలు కాదు, జీవిస్తున్న కుటుంబాల వాస్తవాలు. 15% మంది బంగారం అమ్ముకుంటున్నారు. కానీ రెండు నుంచి ఆరు నెలల్లో మళ్లీ అదే సమస్య చుట్టుముడుతోంది. ఇక రికవరీ ఏజెంట్ల ఒత్తిడి మరో భయం. 72% మంది హరాస్‌మెంట్‌కు గురవుతున్నారు. 67% మందికి నెలకు 50 నుంచి 100 కాల్స్ వస్తున్నాయి. 70% మందికి వాట్సాప్‌లో బెదిరింపులు. 12% కేసుల్లో ఇంటికి, ఆఫీసుకు వెళ్లి పరువు పోగొట్టుకుంటున్నారు. 18% సందర్భాల్లో కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగం పోతుందన్న భయం, నిద్రలేమి, కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి. సర్వే ప్రకారం 50% మంది సూసైడల్ థాట్స్‌కు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

హక్కుల గురించి కూడా తెలుసుకోవాలి..

అసలు సమస్య అవగాహనలో లోటు. RBI ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్, బ్యాంకింగ్ ఒంబుడ్స్‌మన్, లీగల్ రైట్స్ గురించి చాలా మందికి తెలియదు. అందుకే వారు సులభంగా ఎక్స్‌ప్లాయిట్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు చేయాల్సింది స్పష్టం. తమ హక్కులు తెలుసుకోవాలి. హరాస్‌మెంట్‌కు సంబంధించిన కాల్ రికార్డింగ్స్, మెసేజుల వంటి ఎవిడెన్స్ సేకరించాలి. బ్యాంకింగ్ ఒంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాలి. బ్యాంకు అధికారులతో నేరుగా మాట్లాడి రీస్ట్రక్చరింగ్ లేదంటే అదనపు సమయం కోరాలి. చట్ట ప్రకారం రికవరీ ఏజెంట్లు బెదిరించడం నేరం. కానీ దీని కంటే పెద్ద ప్రశ్న.. మనం ఎందుకు ఈ పరిస్థితికి చేరుకున్నాం? నిపుణులు చెబుతున్నది కఠిన సత్యం. మధ్య తరగతి ప్రజలు లగ్జరీని తప్పనసరైనదిగా భావిస్తున్నారు. కారు, బైక్, ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఇవి అసెట్స్ కావు. ఇవి డిప్రిసియేటింగ్ లయబిలిటీస్. ఈఎంఐ ఆఫర్ వస్తే.. అది నిజానికి మనం అఫోర్డ్ చేయలేనిదనే సంకేతం.

సరైన మార్గం ఏంటి? సర్ ప్లస్ క్యాష్ ఉన్నప్పుడే కొనాలి. అవసరం, కోరిక మధ్య స్పష్టత ఉండాలి. ఆదాయంలో కనీసం 20–30% సేవింగ్స్‌గా ఉంచాలి. ముందుగా ఎమర్జెన్సీ ఫండ్.. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, రిటైర్‌మెంట్ ఫండ్స్, గోల్డ్, లేదా దీర్ఘకాలిక అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఈఎంఐలు స్వతహాగా శత్రువులు కావు. కానీ అవి మన ఆదాయాన్ని మించిపోతే.. ఆర్థిక బంధాలు. ఆర్థిక స్వేచ్ఛ అంటే కేవలం ఎక్కువ జీతం కాదు; తక్కువ అప్పు, నియంత్రిత ఖర్చు, ముందుచూపు పెట్టుబడులు. మధ్యతరగతి నిజమైన అభివృద్ధి అక్కడే మొదలవుతుంది.