Begin typing your search above and press return to search.

ఏఐకి భవిష్యత్ లేదా? మస్క్ గ్రోక్ లో భారీ తొలగింపులు దేనికి సంకేతం?

టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ యొక్క xAI సంస్థ, ఇటీవల తీసుకున్న నిర్ణయం టెక్ ప్రపంచంలో కలకలం రేపింది.

By:  A.N.Kumar   |   13 Sept 2025 6:57 PM IST
ఏఐకి భవిష్యత్ లేదా? మస్క్ గ్రోక్ లో భారీ తొలగింపులు దేనికి సంకేతం?
X

టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ యొక్క xAI సంస్థ, ఇటీవల తీసుకున్న నిర్ణయం టెక్ ప్రపంచంలో కలకలం రేపింది. కంపెనీ తన డేటా అనోటేషన్ బృందంలో దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించడం అనేక ప్రశ్నలకు తావిచ్చింది. ఇది కేవలం ఉద్యోగులకే కాకుండా, మొత్తం AI పరిశ్రమలోనూ చర్చనీయాంశమైంది.

xAI నిర్ణయం వెనుక కారణాలు

గ్రోక్ చాట్‌బాట్‌కు కీలకమైన డేటా అనోటేషన్ టీమ్, డేటాను అర్థం చేసుకోవడం, లేబుల్ చేయడం, సందర్భాన్ని జోడించడం వంటి పనులను చేసేది. ఇది గ్రోక్ చాట్‌బాట్‌కు "ప్రపంచం అంటే ఏమిటో" నేర్పింది. కానీ, ఈ టీమ్‌లోని చాలా మందికి ఒకేసారి వారి యాక్సెస్ కట్ చేసి, కాంట్రాక్ట్ గడువు వరకు జీతం మాత్రమే చెల్లిస్తామని xAI ఒక ఇమెయిల్ ద్వారా తెలియజేసింది.

xAI ఈ నిర్ణయాన్ని ఒక వ్యూహాత్మక మార్పుగా సమర్థించుకుంది. సాధారణ డేటా ట్యూటర్లకు బదులుగా, స్పెషలిస్ట్ AI ట్యూటర్ల బృందాన్ని పది రెట్లు పెంచుతామని కంపెనీ ప్రకటించింది. ఇది మరింత నైపుణ్యం కలిగిన బృందాన్ని తయారు చేయడానికి మస్క్ చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది.

అంతర్గత కుదుపుల సంకేతాలు

ఈ భారీ తొలగింపులు, కొన్ని వారాల క్రితం CFO మైక్ లిబరటోరే రాజీనామా చేయడం వంటి అంతర్గత పరిణామాలు xAIలో ఏదో కుదుపు నడుస్తోందని సూచిస్తున్నాయి. మస్క్ 2023లో xAIని ప్రారంభించినప్పుడు, బిగ్‌టెక్ కంపెనీల సెన్సార్‌షిప్ , బలహీనమైన భద్రతా ప్రమాణాలకు ప్రత్యామ్నాయంగా స్వేచ్ఛాయుత AIని రూపొందించే లక్ష్యాన్ని ప్రకటించారు. అయితే, ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు, ఈ లక్ష్యంపై అనుమానాలను రేకెత్తిస్తోంది.

మస్క్ ఎప్పుడూ రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు. కానీ ఈసారి ఆయన తీసుకున్న నిర్ణయం xAI భవిష్యత్తుపై , AI పరిశ్రమలో దాని పాత్రపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది xAIకు ఒక కొత్త అధ్యాయానికి సంకేతమా, లేదా అది తన ఆశయాలకు మించి అడుగులు వేస్తోందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.