Begin typing your search above and press return to search.

చైనా సోలార్ దూకుడు: అమెరికాకు మస్క్ "వేక్-అప్ కాల్"

ఈ నేపథ్యంలో ప్రపంచ పునరుత్పాదక శక్తి రంగం పూర్తిగా చైనా ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 1:00 AM IST
చైనా సోలార్ దూకుడు: అమెరికాకు మస్క్ వేక్-అప్ కాల్
X

ప్రపంచ పునరుత్పాదక శక్తి రంగంలో చైనా వేగంగా ముందుకెళ్తూ ఉన్నదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. రాబోయే నాలుగు సంవత్సరాలలో చైనా సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అమెరికాను మించి నిలబడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చైనా 100 టెరావాట్‌ అవర్స్ (TWh) సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని, ప్రతి రెండేళ్లకూ ఈ సామర్థ్యం రెట్టింపవుతోందని మస్క్ తెలిపారు. ఇది గమనించాల్సిన కీలక అంశమని, అమెరికా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అమెరికా ఎనర్జీ రంగంలో వెనుకబడిపోతుందని ఆయన హెచ్చరించారు.

- చైనా ఎదుగుదల.. గణనీయమైన గణాంకాలు

చైనా ప్రభుత్వ పరిపాలనలో పునరుత్పాదక శక్తికి అత్యంత ప్రాధాన్యం దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఫామ్‌లను నిర్మించడమే కాకుండా, అనేక రాష్ట్రాల్లో గృహాలకు సోలార్ ప్యానెల్స్‌ను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావడంలోనూ చైనా ముందుంది. అంతేకాకుండా తమ స్వంత అవసరాలకే కాకుండా, ఇతర దేశాలకు సోలార్ టెక్నాలజీ ఎగుమతుల ప్రక్రియను వేగవంతం చేసింది. గత పదేళ్లలో చైనా సోలార్ ఇండస్ట్రీ గణనీయంగా వృద్ధి చెందింది.

ప్రతి రెండేళ్లకూ చైనా సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు అవుతోందన్న మస్క్ వ్యాఖ్యలు అమెరికా పాలక వర్గాలకు హెచ్చరిక వంటివి. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో చైనా ఇప్పటికే అనేక అడుగులు ముందుకేసింది. అయితే అమెరికా మాత్రం నిబంధనల పరంగా, విధానాల పరంగా ఇంకా సన్నద్ధం కావలసిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.

-అమెరికాలో విధాన పరమైన పరిమితులు

అమెరికాలో సోలార్ విద్యుత్ రంగంపై గణనీయమైన ఇన్వెస్ట్‌మెంట్స్‌ అవసరమని పరిశ్రమ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. మస్క్ ఇటీవల "బిగ్ బ్యూటిఫుల్ బిల్"పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్‌ వల్ల అమెరికాలో సోలార్ రంగం మరింత దెబ్బతింటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ బిల్ కారణంగా అమెరికాలో పునరుత్పాదక శక్తి రంగానికి మద్దతు తగ్గిపోతుందని, ఫలితంగా దేశీయ సోలార్ మార్కెట్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

-ట్రంప్ పాలనపై మస్క్ వ్యాఖ్య

మస్క్ ట్రంప్ పరిపాలనపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా అభివృద్ధిని నిరోధించాలంటే ఇప్పుడు నుంచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా, అమెరికాలో సోలార్ పరిశ్రమను పునఃప్రాణం పోసేలా, కొత్త విధానాలు, ఇన్సెంటివ్‌లు తీసుకురావాలని సూచించారు.

-భవిష్యత్తులో పునరుత్పాదక శక్తి పోటీ

ఈ నేపథ్యంలో ప్రపంచ పునరుత్పాదక శక్తి రంగం పూర్తిగా చైనా ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోలార్, విండ్, హైడ్రో వంటి శక్తి వనరుల్లో చైనా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండగా, అమెరికా మాత్రం నయవంచన విధానాల దారిలో నడుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మొత్తంగా చూస్తే, మస్క్ హెచ్చరికలు అమెరికా పాలకులకు గట్టి సందేశాన్ని ఇచ్చాయి. చైనా జెండాను పునరుత్పాదక శక్తి రంగంలో ముందుగ ఉంచేందుకు సిద్ధంగా ఉంది. ఈ పోటీలో అమెరికా కూడా తన వ్యూహాలను సమీక్షించుకుని, గ్రీన్ ఎనర్జీ రంగంలో తిరిగి పట్టు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఈ శక్తి రంగంపై పూర్తి ఆధిపత్యాన్ని చైనా సంపాదించవచ్చు.

ఈ విషయంలో భారత్ సహా ఇతర దేశాలకు కూడా ప్రాధాన్యత ఉంది. గ్రీన్ ఎనర్జీ వనరులను పెంచుకునే విషయంలో చైనాకు పోటీగా నిలవాలని వాటి లక్ష్యాలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది. అప్పుడే ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు గట్టి మద్దతు లభిస్తుంది.