ట్రంప్–ఎలాన్ మస్క్ మధ్య దూరం పెరుగుతోందా?
ట్రంప్ బిల్లు కేవలం విద్యుత్ వాహనాల పరిశ్రమనే కాకుండా, పేదలకు వైద్యసాయం అందించే మెడికెయిడ్, ఆహార టోకెన్ల వంటి సంక్షేమ కార్యక్రమాలకు భారీగా కోత విధిస్తోంది.
By: Tupaki Desk | 5 Jun 2025 8:48 PM ISTఒకప్పుడు రాజకీయంగా దగ్గరగా మెలిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ప్రపంచ కుబేరుల్లో ముందున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఇప్పుడు దూరం పెరిగిపోతోంది. వారి మధ్య పెరుగుతున్న విభేదాలకు తాజా కారణం ఏంటంటే.. 4.5 లక్షల కోట్ల డాలర్ల పన్ను బిల్లుపై వారి వైరుధ్య అభిప్రాయాలు. ఈ బిల్లును ట్రంప్ "అందమైన భారీ బిల్లు"గా అభివర్ణించగా, మస్క్ దీనిని "హేయమైన, అసహ్యకరమైన బిల్లు"గా తీవ్రంగా విమర్శించారు.
-పన్ను బిల్లు: ఆసక్తికరమైన విభేదాలు
ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ పన్ను బిల్లు మద్యం, ముడి చమురు, రియాల్టీ, కార్పొరేట్ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా రూపొందించబడింది. అయితే ఈ బిల్లు విద్యుత్ వాహనాలకు, హరిత ఇంధనాలకు నిధులు తగ్గించనుందని మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నేరుగా మస్క్ స్వంత సంస్థ టెస్లాపై తీవ్ర ప్రభావం చూపనుంది. అంతేకాకుండా హరిత భవిష్యత్తుపై నమ్మకంగా ఉన్న పెట్టుబడిదారులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
- సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్రంప్ పాలనను కలవరపెట్టేలా మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీలోని కఠినత్వవాదులకు ఆగ్రహం తెప్పించవచ్చు. కానీ ఎలాన్ మాత్రం వెనక్కి తగ్గే రీతిలో లేరు. ఆయన ఈ బిల్లు కేవలం కార్పొరేట్ సంస్థలకు, సంపన్నులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని, సామాన్య ప్రజల భవిష్యత్తును బలిపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
-సంక్షేమ కార్యక్రమాలపై ప్రభావం
ట్రంప్ బిల్లు కేవలం విద్యుత్ వాహనాల పరిశ్రమనే కాకుండా, పేదలకు వైద్యసాయం అందించే మెడికెయిడ్, ఆహార టోకెన్ల వంటి సంక్షేమ కార్యక్రమాలకు భారీగా కోత విధిస్తోంది. ప్రభుత్వ రుణభారం తగ్గిస్తామనే ముసుగులో సామాన్య ప్రజల భవిష్యత్తును బలిపెట్టే ప్రయత్నం చేస్తోందని మస్క్ అభిప్రాయపడుతున్నారు.
-రాజకీయంగా మారిన పరిస్థితులు
ఒకానొక సమయంలో ట్రంప్‌కు 25 కోట్ల డాలర్ల భారీ విరాళం ఇచ్చిన మస్క్ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నిలబడటం రాజకీయంగా పరిస్థితులు మారుతున్నాయని స్పష్టం చేస్తోంది. “అమెరికన్ ప్రజలకు ద్రోహం చేసిన నాయకులను వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెప్తారు” అని మస్క్ హెచ్చరించారు.
ఈ పరిణామాలు ట్రంప్ మద్దతుదారుల్లో చీలికలు, పారిశ్రామిక వర్గాల మధ్య ఆసక్తికర రాజకీయ గజిబిజి ప్రారంభమైందని అర్థం అవుతోంది. వచ్చే ఎన్నికల వరకు ఈ చర్చ మరింత ఉత్కంఠ కలిగించనుంది. ట్రంప్-మస్క్ మధ్య పెరుగుతున్న ఈ దూరం అమెరికా రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
