Begin typing your search above and press return to search.

అత్యంత ధనవంతుడికి అత్యంత శక్తివంతమైన వ్యక్తి మాస్ వార్నింగ్!

అవును... అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తుల మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Jun 2025 10:20 AM IST
అత్యంత ధనవంతుడికి అత్యంత  శక్తివంతమైన వ్యక్తి మాస్  వార్నింగ్!
X

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ కు, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన వ్యక్తి ఎలాన్ మస్క్ కు మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే! ప్రస్తుతం మస్క్ అటు సోషల్ మీడియాలో, ట్రంప్ ఇటు మీడియాలో బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో మస్క్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.

అవును... అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తుల మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ట్రంప్ తన వల్లే గెలిచారని మస్క్ అంటే.. మస్క్ కు బ్రెయిన్ సరిగ్గా లేదని, తన గెలుపుకు తాను మాత్రమే కారణం అని ట్రంప్ అంటున్నారు. ఈ సమయంలో "ది అమెరికా పార్టీ" అంటూ మస్క్ ట్వీట్ చేశారు.

ఈ క్రమంలో ట్రంప్ మాత్రం అటు మస్క్ ను లైట్ తీసుకున్నట్లుగా మాట్లాడుతూనే.. పరోక్ష హెచ్చరికలు, ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. తాను చాలా బిజీగా ఉన్నానని.. రష్యా, చైనా, ఇరాన్ అంశాలపై పని చేస్తున్నానని.. తనకు చాలా పనులు ఉన్నాయని.. ప్రస్తుతం తాను మస్క్ గురించి ఆలోచించడం లేదని ట్రంప్ తెలిపారు.

మరోపక్క మస్క్ చాలా సబ్సిడీలు తీసుకున్నారని, పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నారని.. అయితే, అదంతా పారదర్శకంగానే జరిగిందా లేదా అనేదాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని.. మస్క్ లేకపోయినా మా ప్రభుత్వం కొనసాగుతుందని.. తాను తప్ప ఎవరు లేకపోయినా అమెరికాకు ఏమీ కాదని తనదైన శైలిలో స్టేట్ మెంట్ లు, పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు!

ఈ నేపథ్యంలోనే.. గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి అతిపెద్ద ఆర్థిక మద్దతుదారుగా ఉన్న మస్క్.. పన్ను బిల్లుకు ఓటు వేసిన రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ప్రాథమిక సవాళ్లకు నిధులు సమకూర్చాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోందని అంటున్నారు! దీనిపై స్పందించిన ట్రంప్.. మస్క్ అలా చేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

కాగా... ట్రంప్ పై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయి విమర్శలు చెసిన మస్క్ ఓ విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. ఇందులో భాగంగా సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్ స్టెన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరుందని ఆరోపించిన మస్క్.. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలు బహిరంగంగా బయటపెట్టలేదని అన్నారు. అనంతరం ఆ పోస్టును తొలగించారు.