ఏఐ ఆధిపత్యంపై పోరాటం.. ట్రంప్-మస్క్ మధ్య చిచ్చుపెట్టిందా?
ఈ ఏడాది ఆరంభంలో ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్త భాగస్వామ్యంతో "స్టార్‌గేట్" అనే ప్రాజెక్ట్ ప్రారంభమైంది.
By: Tupaki Desk | 29 May 2025 10:00 PM ISTకృత్రిమ మేధస్సు రంగంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటమే ట్రంప్-మస్క్ సంబంధాలపై ప్రభావం చూపిందని సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికా ప్రభుత్వంలోని డోజ్ శాఖ బాధ్యతల నుంచి వైదొలగడానికి అసలు కారణం ఇదేనని బయటపడింది. ఈ సంచలన నిర్ణయం వెనుక గల కారణాలను వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం బయటపెట్టింది.
వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, కృత్రిమ మేధ సంస్థ ఓపెన్‌ఏఐ-యూఏఈ మధ్య కుదిరిన "స్టార్‌గేట్" ఒప్పందాన్ని ఆపమని మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే వైట్‌హౌస్ మస్క్ మాటలను పట్టించుకోకుండా, ప్రణాళిక ప్రకారం డీల్‌ను ఖరారు చేసింది.
-"స్టార్‌గేట్": ఒక భారీ ప్రాజెక్ట్
ఈ ఏడాది ఆరంభంలో ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్త భాగస్వామ్యంతో "స్టార్‌గేట్" అనే ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా అబుదాబీలో అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసుకునేందుకు "స్టార్‌గేట్ యూఏఈ" అనే వెంచర్‌ను ప్రకటించారు. ఇందులో జీ42, ఎమిరాటి ఏఐ కంపెనీలు భాగస్వామిగా ఉండనున్నాయి. ఇటీవల ట్రంప్ గల్ఫ్ పర్యటన సందర్భంగా ఓపెన్‌ఏఐ-యూఏఈ మధ్య ఈ ఒప్పందం ఖరారైనట్లు సమాచారం. ట్రంప్ పర్యటనలో ఆయన వెంట ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కూడా ఉండటం గమనార్హం.
-మస్క్ అభ్యంతరం: "ఎక్స్‌ఏఐ" కోసం పట్టు
ఈ ఒప్పందం మస్క్‌కు నచ్చలేదు. ఆ ప్రాజెక్టులో తన 'ఎక్స్‌ఏఐ'ను కూడా చేర్చాలని ఆయన ట్రంప్ సర్కారుపై ఒత్తిడి తెచ్చారు. అంతేగాక స్వయంగా జీ42 కంపెనీ ఛైర్‌పర్సన్‌కు మస్క్ ఫోన్ చేసి, "ఎక్స్‌ఏఐ లేకుండా.. ట్రంప్ ఎలాంటి డీల్‌ను అంగీకరించరు" అని చెప్పినట్లు వాల్‌స్ట్రీట్ కథనం పేర్కొంది.
-వైట్‌హౌస్ వివరణ: మస్క్-ఆల్ట్‌మన్ వైరం?
అయితే, మస్క్ ఒత్తిడిని పట్టించుకోకుండా ట్రంప్ సర్కారు డీల్‌కు సుముఖత వ్యక్తంచేసింది. వైట్‌హౌస్ అధికారులు ఈ ఒప్పందాన్ని పరిశీలించి ప్రణాళిక ప్రకారమే డీల్‌ను కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒక అధికారి మాట్లాడుతూ "మస్క్ ఆందోళనలో నిజం ఉందో, లేదో పక్కనబెడితే.. శామ్ ఆల్ట్‌మన్‌తో ఆయనకు సుదీర్ఘకాలంగా వైరం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దానివల్లే ఆయన ఈ ఒత్తిడి తెచ్చి ఉంటారనే సంకేతాలు కన్పిస్తున్నాయి" అని అన్నారు.
-ఓపెన్ ఏఐ చరిత్ర: మస్క్ పాత్ర
2022 నవంబరులో వచ్చిన ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీ ఆరు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సంపాదించుకుంది. 2015లో ఓపెన్ ఏఐను శామ్ ఆల్ట్‌మన్ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. అయితే 2018లో ఆ కంపెనీని వీడారు. ఆ తర్వాత 2019లో మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐలో 14 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఈక్రమంలోనే ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్‌పై మస్క్ గతేడాది దావా వేశారు. కంపెనీ స్థాపించినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారంటూ అందులో ఆరోపించారు.
ఈ పరిణామాలు కృత్రిమ మేధ రంగంలో పెరుగుతున్న పోటీని, వ్యాపార దిగ్గజాల మధ్య ఆధిపత్య పోరాటాన్ని స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్-మస్క్ బంధం చెడిందంటూ వస్తున్న వార్తలకు ఈ పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి.
