ఎలన్ మస్క్ వన్ ట్రిలియన్ డ్రీం.. మరో సంచలనం దిశగా..
ప్రపంచ టెక్నాలజీ , ఆటోమొబైల్ రంగాలను తన నిర్ణయాలతో షేక్ చేసే పేరు ఎలన్ మస్క్.
By: A.N.Kumar | 1 Jan 2026 3:54 AM ISTప్రపంచ టెక్నాలజీ , ఆటోమొబైల్ రంగాలను తన నిర్ణయాలతో షేక్ చేసే పేరు ఎలన్ మస్క్. ఇప్పుడు ఆయన మరోసారి చరిత్రను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు. టెస్లా షేర్ హోల్డర్ల ఆమోదంతో 1 ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది గనుక సాకారమైతే ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా మస్క్ రికార్డ్ సృష్టించనున్నారు.
ఇది జీతం కాదు.. పనితీరుకు దక్కే పురస్కారం..
ఈ భారీ ప్యాకేజీ మస్క్ కు ఊరికే రాదు. ఇది పూర్తిగా పనితీరు మీద ఆధారపడిన ఒప్పందం అంటే.. టెస్లా కంపెనీ మార్కెట్ విలువ ఊహించని రీతిలో పెరగాలి. ముందుగా నిర్ణయించిన అత్యంత కఠినమైన లక్ష్యాలను మస్క్ చేరుకోవాలి. షేర్‌హోల్డర్ల సంపద గణనీయంగా వృద్ధి చెందాలి. ఒకవేళ లక్ష్యాలు పూర్తికాకపోతే.. మస్క్‌కు ఈ ప్యాకేజీలో నయా పైసా కూడా దక్కదు. "రిస్క్ నాది.. లాభం అందరిదీ" అనే ధోరణితో మస్క్ ఈ సవాల్‌ను స్వీకరించారు.
టెస్లా లక్ష్యాలు.. ఆకాశమే హద్దు..
మస్క్ విజన్ ప్రకారం టెస్లా కేవలం కార్ల కంపెనీ మాత్రమే కాదు.. అదొక ఏఐ, రోబోటిక్స్ పవర్ హౌస్. ఆయన ముందు ప్రధాన లక్ష్యాలున్నాయి. టెస్లా మార్కెట్ విలువను సుమారు 8.5 ట్రిలియన్లకు చేర్చడం.. డ్రైవర్ అవసరం లేదని స్వయం చాలక ట్యాక్సీలతో రవాణా రంగంలో విప్లవం తేవడం.. మనుషుల్లా పనిచేసే హ్యూమనాయిడ్ రోబోలను వాణిజ్యపరంగా విజయవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
రోబో టాక్సీలు.. అసలైన గేమ్ ఛేంజర్
భవిష్యత్తులో ఉబెర్, ఓలా వంటి సంస్థలకు సవాల్ విసురుతూ టెస్లా రోబో టాక్సీలు రాబోతున్నాయి. దీనివల్ల డ్రైవర్ ఖర్చు తగ్గి ప్రయాణం చౌకగా మారుతుంది. ప్రమాదాల శాతం తగ్గుతుంది. టెస్లా ఆదాయం ఊహించని స్థాయికి చేరుకుంటుంది.
ప్రపంచ తొలి ట్రిలియనీర్ దిశగా..
ప్రస్తుతం మస్క్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్తానంలో ఉన్నప్పటికీ ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఆయన వ్యక్తిగత సంపద 1000 బిలియన్ల డాలర్లను దాటుతుంది. మానవ చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ సాధించని మైలురాయిని ఆయన చేరుకుంటారు. మరోవైపు ఈ భారీ ప్యాకేజీపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది అతిగా ఉందని షేర్‌హోల్డర్ల ప్రయోజనాల కంటే మస్క్ వ్యక్తిగత లాభం కోసమే ఇదంతా చేస్తున్నారని కొందరు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయితే లక్ష్యాలు సాధిస్తేనే నాకు రివార్డ్ అనే మస్క్ వాదనను మెజారిటీ ఇన్వెస్టర్లు సమర్థిస్తున్నారు.
ఎలాన్ మస్క్ అంటేనే అసాధ్యాలను సుసాధ్యం చేసే వ్యక్తి. ఈ $1 ట్రిలియన్ ప్యాకేజీ కేవలం ఒక వ్యక్తి సంపద గురించి మాత్రమే కాదు. ఇది రాబోయే కాలంలో ఏఐ , ఆటోమేషన్ మన జీవితాలను ఎలా మార్చబోతున్నాయో చెప్పడానికి ఒక సంకేతం.
