టెస్లా కంటే ముందుగా భారత్ లో స్టార్ లింక్ సేవలు
భారత్ లో తన స్టార్ లింక్ సంస్థ శాట్ కామ్ సేవల్ని అందించేందుకు మస్క్ ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు.
By: Tupaki Desk | 9 May 2025 4:15 AMభారత్ లో ఉన్న కోకొల్లలుగా ఉన్న వ్యాపార అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని తపిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన సంస్థ తాజాగా తన వ్యాపారాన్ని భారత్ తోనూ చేయనుంది. దీనికి సంబంధించిన కీలకమైన ప్రాథమిక అనుమతులు జారీ అయ్యాయి. భారత్ లో ఎప్పటి నుంచో తన శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యాపారాన్ని నిర్వహించాలని భావించినప్పటికి.. అందుకు తగిన అనుమతుల రాక ఎప్పటికప్పుడు ఆలస్యమవుతున్న పరిస్థితి. ఇందుకు చెక్ పెడుతూ తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
భారత్ లో తన స్టార్ లింక్ సంస్థ శాట్ కామ్ సేవల్ని అందించేందుకు మస్క్ ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకూ ఇది చేసే వ్యాపారం ఏమిటి? అంటే.. సంప్రదాయ బ్రాడ్ బ్యాంక్ సేవలు అందుబాటులోని ప్రాంతాలకు టెలికం సేవల్ని ఈ వ్యాపారం ద్వారా అందించే వీలుంది. ఇందులో భాగంగా భారత్ లో దిగ్గజ టెలికం సంస్థలైన జియో.. ఎయిర్ టెల్ తోనూ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు స్టార్ లింక్ చేపట్టే వ్యాపారానికి టెలికం శాఖ నుంచి ప్రాథమిక అనుమతులు లభించాయి. దీంతో.. ఒప్పంద నియమాల్ని అంగీకరిస్తున్నట్లుగా కంపెనీ సంతకాలు చేసి.. నిర్దేశిత ఫీసులు చెల్లించినంతనే తుది లైసెన్సు లభించనుంది.
సదూరంగా ఉండే జియో స్టేషనరీ ఉపగ్రహాలపై ఆధారపడే సంప్రదాయ శాటిలైట్ సర్వీసులతో పోలిస్తే.. భూమికి 550కి.మీ. దూరంలోనే ఉండే లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను ఉపయోగిస్తుంది. ప్రస్తుతానికి ఇవి 7వేల వరకు ఉండగా.. రానున్న రోజుల్లో 40 వేల వరకు పెరగనున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మస్క్ కు చెందిన టెస్లాను భారత్ లోకి వాయువేగంతో తీసుకురావాలని తపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో టెస్లా కంటే కూడా స్టార్ లింక్ వ్యాపారం మొదలుకానున్నట్లుగా అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యాపారానికి సంబంధించి ఇప్పటివరకు యూటెల్ శాట్ వన్ వెబ్.. జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్తలకు లైసెన్సులు వచ్చాయి. స్పెక్ట్రాంను కేటాయించిన తర్వాత సర్వీసుల్ని ప్రారంభిస్తారు. భారత్ లో ఈ లైసెన్సు కోసం మస్క్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే రిలయన్స్ జియో.. భారతీ ఎయిర్ టెల్ తో ఒప్పందాలు కుదుర్చుకోవటం ద్వారా.. సొంత డిస్ట్రిబ్యూషన్.. కస్టమర్ సర్వీస్.. మౌలిక సదుపాయాల కల్పన లాంటి వాటిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.